Telugu Global
Telangana

బీఆర్ఎస్‌కు మరో చిక్కు.. టీఆర్ఎస్ పేరుతో పార్టీ, గుర్తు

21 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పేరు ప్రజల్లో నానిపోయింది. ఉద్యమ పార్టీగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టిన పార్టీగా టీఆర్ఎస్ అందరికీ సుపరిచితం.

బీఆర్ఎస్‌కు మరో చిక్కు.. టీఆర్ఎస్ పేరుతో పార్టీ, గుర్తు
X

బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో గుర్తు కష్టాలు తప్పేలా లేవు. కారు గుర్తును పోలిన గుర్తులను ఎలక్షన్ కమిషన్ కేటాయించడంతో.. దాని ద్వారా కలిగే నష్టాన్ని నివారించడానికి ఇప్పటికే అగ్రనాయకత్వం వ్యూహాలు సిద్ధం చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వృద్ధులు, చదువు రాని వాళ్లు, కళ్లు సరిగా కనపడని వారికి కారు గుర్తుకు మిగిలిన గుర్తులకు మధ్య పోలికను స్పష్టంగా చెప్పాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, గుర్తును కచ్చితంగా గుర్తు పట్టేలా క్షేత్ర స్థాయి కార్యకర్తలు ఓటర్లను అప్రమత్తం చేయాలని నిర్ణయించారు.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో చిక్కు వచ్చి పడింది. 21 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పేరు ప్రజల్లో నానిపోయింది. ఉద్యమ పార్టీగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టిన పార్టీగా టీఆర్ఎస్ అందరికీ సుపరిచితం. గతేడాది దసరా సమయంలో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చారు. పేరు ఒక్కటే భారత రాష్ట్ర సమితిగా మార్చినా.. గుర్తు, రంగు అదే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వాడవాడలా పేరు మారిన విషయం తెలుసు. అయినా సరే కొంత మంది అలవాటులో పొరపాటుగా బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా సంబోధిస్తుంటారు. ఇదే కాస్త ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉన్నది.

తెలంగాణలో కొత్తగా ఒక రాజకీయ పార్టీ రిజిస్టర్ అయ్యింది. తెలంగాణ రాజ్య సమితి పేరుతో ఎన్నికల సంఘం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్నది. తెలంగాణ రాజ్య సమితికి సంక్షిప్త నామం టీఆర్ఎస్. దీంతో ప్రజలు కన్‌ఫ్యూజ్ అవుతారనే ఆందోళన నెలకొన్నది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కూడా బరిలోకి దిగనున్నది. తెలంగాణ రాజ్య సమితికి కేంద్ర ఎన్నికల సంఘం సిలిండర్ గుర్తును కేటాయించింది. ఈ పార్టీ కూడా తమ జెండా బ్యాగ్రౌండ్ గులాబీ రంగులో ఏర్పాటు చేసుకున్నారు. బీఆర్ఎస్‌ను నష్టపరచాలనే ఉద్దేశంతోనే ఇలా టీఆర్ఎస్, గులాబీ రంగులను వాడుతున్నట్లు స్పష్టమవుతుంది.

కాగా, బీఆర్ఎస్ అనగానే అందరికీ కారు గుర్తు మాత్రమే తెలుసు. కాబట్టి సిలిండర్ గుర్తుతో పెద్దగా ఇబ్బందులు ఎదురు కావని అంచనా వేస్తున్నారు. ప్రచారం సమయంలో కాస్త కన్ఫ్యూజన్‌కు గురైనా.. పోలింగ్ రోజు గుర్తును మాత్రమే వోటర్లు చూస్తారు. కారుకు, సిలిండర్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థులకు వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు.


First Published:  20 Oct 2023 11:53 AM GMT
Next Story