Telugu Global
Telangana

బుల్డోజర్ రాజకీయం.. మూర్ఖుడి చేతిలో దేశం

నియంతల ఆగడాలు తాత్కాలికమేనని, వారు చాలాకాలం కొనసాగిన చరిత్ర లేనే లేదని చెప్పారు ప్రకాష్ రాజ్. మనిషిని మినిషిగా చూడాల్సి ఉందని, నేటి పాలనలో ఇది కొరవడిందన్నారు.

బుల్డోజర్ రాజకీయం.. మూర్ఖుడి చేతిలో దేశం
X

దేశం మూర్ఖుడి చేతిలో బందీ అయిపోయిందని మండిపడ్డారు సినీ నటుడు ప్రకాష్ రాజ్. కె.శ్రీనివాస్ రచించిన ‘బుల్డోజర్‌ సందర్భాలు’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రకాష్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వాల నిరంకుశ ధోరణులపై ఎక్కుపెట్టిన అస్త్రమే ఈ ‘బుల్డోజర్‌ సందర్భాలు’ అనే పుస్తకం. వివిధ సందర్భాల్లో బుల్డోజర్లు ఎలాంటి దుర్మార్గాలు చేశాయో, దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలాంటి దురవస్థలో ఉందో తెలిపే పుస్తకం ఇది. బుల్డోజర్‌ కి హృదయం లేదని, కేవలం భయపెడుతుందని, ఎదుటి వారి భయం మీద ఆధారపడి మాత్రమే బుల్డోజర్‌ పనిచేస్తుందని పుస్తకావిష్కరణ సందర్భంగా ప్రకాష్ రాజ్ విమర్శించారు.

నియంతల ఆగడాలు తాత్కాలికమేనని, వారు చాలాకాలం కొనసాగిన చరిత్ర లేనే లేదని చెప్పారు ప్రకాష్ రాజ్. మనిషిని మినిషిగా చూడాల్సి ఉందని, నేటి పాలనలో ఇది కొరవడిందన్నారు. భారత్ లో నేడు ఫాసిజం కొత్త రూపాన్ని సంతరించుకుందన్నారు సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి. దేశంలో ప్రజాస్వామ్యం పేరిట పాలన జరుగుతున్నది కానీ, అసలైన ప్రజాస్వామ్యం ఆనవాళ్లే లేవన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డు పెట్టుకుని, మీడియా ఒక వర్గానికి అనుకూలంగా పనిచేస్తోందని సుదర్శన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పలువురు మీడియా ప్రతినిధులు, వివిధ రంగాల నిపుణులు పాల్గొన్నారు.

First Published:  21 May 2023 3:09 AM GMT
Next Story