Telugu Global
Telangana

రాజాసింగ్‌కు షాక్‌.. బీజేఎల్పీ నేతగా ఆయనకే ఛాన్స్

రాజాసింగ్ పార్టీలో సీనియర్ నాయకులు. గోషామహల్‌ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో శాసనసభాపక్ష నేతగా తనకు అవకాశం కల్పించాలని ఆయ‌న‌ పార్టీ పెద్దలను కోరుతున్నారు.

రాజాసింగ్‌కు షాక్‌.. బీజేఎల్పీ నేతగా ఆయనకే ఛాన్స్
X

బీజేపీ శాసనసభ పక్ష నేత పదవి రాజాసింగ్‌కు దక్కే అవకాశాలు దాదాపుగా క‌నుమ‌రుగైన‌ట్లే. తాజాగా శాసనసభా పక్ష నేతను ఎంపిక చేసే ప్రయత్నంలో భాగంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ తరుణ్‌ చుగ్‌లు తమ పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకున్నారు. ఇందులో మెజార్టీ ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి వైపు మొగ్గు చూపినట్లు సమాచారం.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందినవారిలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, నిర్మల్‌ ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి మినహా అందరూ కొత్తవారే. అంటే ఈ ఎన్నికల్లో 8 మంది బీజేపీ నుంచి గెలుపొందగా అందులో ఆరుగురు కొత్తవారే. అయితే రాజాసింగ్‌తో సహా మరికొందరు ఎమ్మెల్యేలు బీజేపీ శాసనసభాపక్ష నేత పదవి కోసం పోటీ పడుతున్నారు. రాజాసింగ్ పార్టీలో సీనియర్ నాయకులు. గోషామహల్‌ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో శాసనసభాపక్ష నేతగా తనకు అవకాశం కల్పించాలని ఆయ‌న‌ పార్టీ పెద్దలను కోరుతున్నారు.

నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి సైతం రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన కూడా బీజేపీ ఎల్పీ నేత రేసులో ఉన్నారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డికే అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఇక కామారెడ్డిలో మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్‌ రెడ్డిలను ఓడించిన వెంకటరమణ రెడ్డికి బీజేఎల్పీ పదవి ఇస్తే ఎలా ఉంటుందని తరుణ్‌ చుగ్‌ అడగ్గా.. ఎమ్మెల్యేలు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

First Published:  8 Jan 2024 5:00 PM GMT
Next Story