Telugu Global
Telangana

గ్రేటర్ హైదరాబాద్ రోడ్లపై పరుగులు తీయనున్న 640 ఎలక్ట్రిక్ బస్సులు

హైదరాబాద్ రోడ్లపై ఈవీ బస్సులు పరుగులు తీయడం ప్రారంభిస్తే.. శబ్ద, వాయు కాలుష్యాలు భారీగా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

గ్రేటర్ హైదరాబాద్ రోడ్లపై పరుగులు తీయనున్న 640 ఎలక్ట్రిక్ బస్సులు
X

ఐటీ, ఫార్మా రంగాలకు హబ్‌గా మారి.. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని తగ్గించి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సిటీ రోడ్లపై సౌకర్యవంతమైన, అంతర్జాతీయ స్థాయి ప్రయాణ అనుభూతిని అందించేందుకు గ్రేటర్ ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. మార్చి 2024 నాటికి 640 ఎలక్ట్రిక్ వాహనాలు హైదరాబాద్ రోడ్లపై పరుగులు పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 620 నాన్ ఏసీ బస్సులు కాగా.. మిగిలినవి ఏసీ బస్సులు ఉంటాయన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 137 బస్సులు, డిసెంబర్ కల్లా 205 బస్సులు రోడ్డెక్కనున్నాయి. మిగిలిన బస్సులు మార్చి చివరి నాటికి సిద్ధమవుతాయని అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్ రోడ్లపై ఈవీ బస్సులు పరుగులు తీయడం ప్రారంభిస్తే.. శబ్ద, వాయు కాలుష్యాలు భారీగా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఇప్పటికే గుర్తించిన డిపోల్లో ఈవీ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఈ బస్సులన్నీ అందుబాటులోకి రాగానే.. ప్రస్తుతం నడుస్తున్న బస్సుల్లోంచి కాలం చెల్లిన 300 బస్సులను తుక్కు కింద అమ్మేయనున్నట్లు తెలుస్తున్నది. ఇక కొత్త ఎలక్ట్రిక్ బస్సులు ఒక్కసారి చార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. 620 బస్సులు సిటీలో.. 20 ఏసీ బస్సులు పుష్పక్ పేరుతో ఎయిర్‌పోర్టుకు తిప్పనున్నారు.

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ డిపోల పరిధిలో 15 ఏళ్ల నుంచి కొత్త సిటీ బస్సులు కొనుగోలు చేయలేదు. చాలా కొత్త బస్సులు అద్దె ప్రాతిపదికన తీసుకున్నవే ఉన్నాయి. ఇక టీఎస్ఆర్టీసీకి చెందిన సొంత సిటీ బస్సులు పూర్తిగా పాడైపోయాయి. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో మరమ్మతులు చేసి నడిపిస్తున్నారు. పైగా వీటి వల్ల శబ్ద, వాయు కాలుష్యం భారీగా వస్తోంది. ఈ క్రమంలో గ్రేటర్ ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈవీ బస్సులను ప్రస్తుతం ఉన్న రూట్లలోనే కాకుండా.. కొత్తగా అన్వేషించిన రూట్లలో కూడా తిప్పనున్నారు.

విద్యుత్ బస్సుల చార్జింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం కంటోన్మెంట్, మియాపూర్ డిపోల్లో 11కేవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. భవిష్యత్‌లో వీటి సామర్థ్యాన్ని 33 కేవీకి పెంచే అవకాశాలు ఉన్నాయి. 640 బస్సులు పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత అన్ని డిపోల్లో చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తారు. ఈవీ బస్సుల రాకతో డీజిల్ ఖర్చులు భారీగా తగ్గుతాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

First Published:  29 April 2023 1:55 AM GMT
Next Story