Telugu Global
Telangana

తెలంగాణ: 24 గంటలు షాపులు తెరవొచ్చు.. కండిషన్స్ అప్లై

ఇప్పటి వరకూ నగరాలు, పట్టణాల్లో మెడికల్ షాపులు మాత్రమే 24 గంటలు అందుబాటులో ఉండేవి. ఇకపై పచారీ షాపులు, కూరగాయల షాపులు, పాలు, పెరుగు అమ్మే దుకాణాలు.. ఇలాంటి వన్నీ 24గంటలు తెరచి ఉంచొచ్చు.

తెలంగాణ: 24 గంటలు షాపులు తెరవొచ్చు.. కండిషన్స్ అప్లై
X

ఏయ్.. టైమ్ పదైంది.. ఇంకా షాపు మూయలేదేం.. టకటకమంటూ లాఠీ శబ్దం..

ఏయ్ నీకే కదా చెప్పేది.. పోలీస్ స్టైల్ ఘాటు పదాలు..

ఇకపై తెలంగాణలో ఇలాంటివి ఉండకపోవచ్చు. ఎందుకంటే 24గంటలు షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. దీనికోసం తెలంగాణ దుకాణాలు, సంస్థల చట్టంలో మార్పులు తెస్తోంది. రోజుకి 24 గంటలు ఇకపై దుకాణాలు తెరచి ఉంచుకోవచ్చు. అయితే ఇలా దుకాణాలు, సంస్థల్ని నిర్వహించేందుకు ఏడాదికి రూ.10 వేలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఎందుకిలా..?

కాలం మారుతోంది. వృత్తి, వ్యాపారాలు, వాటి విధానాలు పూర్తిగా మారిపోతున్నాయి. షిఫ్ట్ ల పనివేళల్లో ఏది రాత్రో, ఏది పగలో తెలుసుకోవాల్సిన అవసరం చాలామందికి లేకుండా పోయింది. డ్యూటీ పూర్తయితే నిద్ర, నిద్రలేచాక డ్యూటీ ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ జీవుల టైమ్ టేబుల్ సెట్ అయింది. ఇలాంటివాటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని షాపులు కూడా 24గంటలు తెరచి ఉంచేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దుకాణాలు, సంస్థల చట్టం -1988 కింద నమోదైన సంస్థలన్నిటికీ ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు అధికారులు. ఈ మేరకు కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణికుముదిని ఉత్తర్వులు జారీ చేశారు.

నిబంధనలు పాటించాల్సిందే..

24గంటలు షాపులు తెరుచుకోడానికి కేవలం వార్షిక ఫీజు చెల్లిస్తే సరిపోదు. దానికి తగ్గ నిబంధనలన్నిటినీ పాటించాల్సిందే. ఉద్యోగులందరికీ ఐడీ కార్డులివ్వాలి. వీక్లీ ఆఫ్ లు ఇవ్వాలి. పనిగంటల నిబంధనలు పాటించాలి. ఓవర్ టైమ్ పనిచేస్తే, జీతం పెంచాలి. ప్రభుత్వం గుర్తించిన సెలవలు, పండగ సమయాల్లో పనిచేయించుకుంటే అదనంగా జీతం చెల్లించాల్సిందేనంటూ కార్మికశాఖ స్పష్టం చేసింది. మహిళా ఉద్యోగులకు భద్రతా చర్యలతో పాటు రవాణా సదుపాయం కల్పించాలని కూడా కార్మిక శాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పోలీసు నిబంధనలు కూడా పాటించాల్సిందేనని పేర్కొంది.

ఇప్పటి వరకూ నగరాలు, పట్టణాల్లో మెడికల్ షాపులు మాత్రమే 24 గంటలు అందుబాటులో ఉండేవి. ఇకపై పచారీ షాపులు, కూరగాయల షాపులు, పాలు, పెరుగు అమ్మే దుకాణాలు.. ఇలాంటి వన్నీ 24గంటలు తెరచి ఉంచొచ్చు. నిబంధనలు సడలించినా అన్ని ప్రాంతాల్లో ఇది లాభసాటి వ్యాపారం కాకపోవచ్చు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, చిన్న చిన్న సూపర్ మార్కెట్ లకు ఇది సదవకాశం అనుకోవచ్చు. ఈ వెసులుబాటుని వినియోగించుకునే అవకాశం వ్యాపారులకే వదిలిపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం.

First Published:  8 April 2023 3:05 AM GMT
Next Story