Telugu Global
Sports

ప్రపంచ బ్యాడ్మింటన్లో భారత జోరు కొనసాగేనా?

బ్యాడ్మింటన్ ప్రపంచ సమరానికి జపాన్ లోని టోక్యో నగరంలో రంగం సిద్ధమయ్యింది. పురుషుల సింగిల్స్, డబుల్స్ లో భారత్ ను జంట స్వర్ణాలు ఊరిస్తున్నాయి.

ప్రపంచ బ్యాడ్మింటన్లో భారత జోరు కొనసాగేనా?
X

బ్యాడ్మింటన్ ప్రపంచ సమరానికి జపాన్ లోని టోక్యో నగరంలో రంగం సిద్ధమయ్యింది. పురుషుల సింగిల్స్, డబుల్స్ లో భారత్ ను జంట స్వర్ణాలు ఊరిస్తున్నాయి.

ప్రపంచ బ్యాడ్మింటన్లో స్వర్ణంతో సహా ఐదుపతకాలు సాధించిన తెలుగుతేజం పీవీ సింధు గాయంతో పోటీలకు దూరమయ్యింది.



ప్రపంచ బ్యాడ్మింటన్ సర్క్కూట్ లో ఆల్-ఇంగ్లండ్, ఏషియన్, ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, వివిధ దేశాల ఓపెన్ టోర్నీలున్నా ప్రపంచ బ్యాడ్మింటన్ సమరంలో విజేతగా నిలవడంలో ఉన్న మజాయేవేరు.

ఆగస్టు 22 నుంచి 28 వరకూ జరిగే ఈ ప్రతిష్టాత్మక సమరంలో వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు మహిళల, పురుషుల సింగిల్స్, డబుల్స్, మిక్సిడ్ డబుల్స్ విభాగాలలో ట్రోఫీలతో పాటు స్వర్ణ, రజత, కాంస్య పతకాల కోసం పోటీపడుతున్నారు.

భారత..లక్ష్యం బంగారం...!

బర్మింగ్ హామ్ వేదికగా ఇటీవలే ముగిసిన 2022 కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ పురుషుల, మహిళల సింగిల్స్, డబుల్స్ లో స్వర్ణ, మిక్సిడ్ టీమ్ విభాగంలో రజత, పతకాలతో మోత మోగించిన భారత షటర్లు ప్రస్తుత ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో జంట స్వర్ణాలకు గురిపెట్టారు.

చైనా, జపాన్, ఇండోనీసియా, డెన్మార్క్, మలేసియా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలకు చెందిన మేటి క్రీడాకారుల నుంచి భారత స్టార్ ప్లేయర్లు లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్, ప్రణవ్, సాయి ప్రణీత్, పురుషుల డబుల్స్ లో టాప్ జోడీ సాయి సాత్విక్- చిరాగ్ షెట్టి గట్టి పోటీ ఎదుర్కోనున్నారు.

గాయంతో సింధు దూరం!

మహిళల సింగిల్స్ లో భారత గోల్డెన్ స్టార్, ప్రపంచ మాజీ చాంపియన్ పీవీ సింధు గాయంతో ప్రస్తుత ప్రపంచకప్ టోర్నీకి దూరమయ్యింది.బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ లో అలవోకగా బంగారు పతకం సాధించిన సింధుకు ప్రపంచ బ్యాడ్మింటన్లో కళ్లు చెదిరే రికార్డే ఉంది.

2013, 2014 ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీలలో కాంస్య పతకాలు సాధించిన సింధు ..2017, 2018 ప్రపంచ టోర్నీల్లో రజత, 2019 ప్రపంచ పోరులో బంగారు పతకం సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలో ఐదు పతకాలు సాధించిన భారత ఏకైక ప్లేయర్ పీవీ సింధు మాత్రమే.

ప్రపంచ బ్యాడ్మింటన్ తొలివిజేత ప్రకాశ్..

ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలో భారత్ కు తొలి పతకం అందించిన ఘనత అలనాటి దిగ్గజ ఆటగాడు ప్రకాశ్ పడుకోన్ కే దక్కుతుంది.1983 ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీలలో

చైనా, ఇండోనీసియా, డెన్మార్క్ దిగ్గజ ఆటగాళ్లు హన్ జియాన్, లిమ్ స్వి కింగ్, హర్తానో, ఫ్లెమింగ్ డెల్ఫ్స్, మార్టెన్ ఫ్రాస్ట్ లాంటి గొప్పగొప్ప ఆటగాళ్లతో పోటీపడి మరీ ప్రకాశం కాంస్య పతకం సాధించాడు.

ఆ తర్వాత ..మూడుదశాబ్దాల విరామంతో 2011 ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల డబుల్స్ లో గుత్తా జ్వాలా- అశ్వనీ పొన్నప్ప జోడీ భారత్ కు మరో పతకం అందించలేకపోయారు.

సైనా చేజారిన స్వర్ణం...

2015 ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్స్ చేరిన సైనా నెహ్వాల్ చివరకు రజత పతకంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రపంచ బ్యాడ్మింటన్లో భారత్ కు రజత పతకం అందించిన తొలిప్లేయర్ గా సైనా నిలిచింది.

2013 నుంచి 2019 ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీల వరకూ ఓ స్వర్ణంతో సహా భారత్ కు ఐదు పతకాలు అందించిన ఘనత తెలుగుతేజం సింధుకు మాత్రమే దక్కుతుంది.

2019 ప్రపంచ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో సింధు బంగారు పతకం అందుకొంటే...పురుషుల సింగిల్స్ లో తెలుగు ఆటగాడు సాయి ప్రణీత్ కాంస్య పతకం నెగ్గి సంచలనం సృష్టించాడు.

స్పెయిన్ వేదికగా గత ఏడాది ముగిసిన 2021 ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ కు పురుషుల సింగిల్స్ లో జంట పతకాలు దక్కాయి. కిడాంబీ శ్రీకాంత్ రన్నరప్ స్థానంతో రజత పతకం సాధిస్తే...యువ ఆటగాడు లక్ష్యసేన్ కాంస్యంతో సరిపెట్టుకొన్నాడు.

2018 నుంచి 2021 మధ్యకాలంలో జరిగిన ప్రపంచ పోటీలలో భారత షట్లర్లు ఏకంగా ఐదు పతకాలు సాధించడం ద్వారా భారత ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు.

అందరి చూపు లక్ష్యసేన్ వైపే...

2022 ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ లో భారత సంచలనం లక్ష్యసేన్ స్వర్ణపతకమే లక్ష్యంగా పోటీకి దిగుతున్నాడు. గత టోర్నీ రజత విజేత కిడాంబీ శ్రీకాంత్ సైతం బంగారు పతకానికే గురిపెట్టాడు.

డేనిష్ ఆటగాడు విక్టర్ యాక్సెల్ సన్,జపాన్ స్టార్ ప్లేయర్ కెంటో మొమాటో, ఇండోనీసియా ఆటగాళ్లు జోనాథన్ క్రిస్టి, ఆంథోనీ జింటింగ్, చైనా ప్లేయర్లు ల్యు గాంగ్ జ్యు,

జావో జున్ పెంగ్, మలేసియా నంబర్ వన్ ప్లేయర్ లీ జీ జియా, చైనీసి తైపీ ఆటగాడు టియన్ చెన్ లతో భారత ఆటగాళ్లకు గట్టిపోటీ ఎదురుకానుంది.

భారత ఆటగాడు ప్రణయ్ రెండు, లక్ష్యసేన్ 9, కిడాంబీ శ్రీకాంత్ 12వ ర్యాంక్ ప్లేయర్ల హోదాలో మెయిన్ డ్రాకు అర్హత సంపాదించారు.

పురుషుల డబుల్స్ లో భారత నంబర్ వన్ జోడీ సాయి సాత్విక్- చిరాగ్ షెట్టి సైతం ఏదో ఒక పతకంతో స్వదేశానికి తిరిగిరావాలన్న పట్టుదలతో ఉన్నారు.

2022 పురుషుల టీమ్ చాంపియన్లకు ఇచ్చే థామస్ కప్, 2022 బర్మింగ్ హామ్ కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకాలతో అత్యుత్తమంగా రాణించిన భారత షట్లర్లు ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీలో సైతం సత్తా చాటుకోవాలని కోరుకొందాం.

First Published:  22 Aug 2022 4:22 AM GMT
Next Story