Telugu Global
Sports

ఐపీఎల్ సర్కస్ లో 17 ఏళ్ళ కుర్రాడు!

ఐపీఎల్ లీగ్ 17వ సీజన్ ద్వారా మరో నూనూగుమీసాల కుర్రాడు బరిలోకి దిగాడు.

ఐపీఎల్ సర్కస్ లో 17 ఏళ్ళ కుర్రాడు!
X

ఐపీఎల్ లీగ్ 17వ సీజన్ ద్వారా మరో నూనూగుమీసాల కుర్రాడు బరిలోకి దిగాడు. ముంబై ఇండియన్స్ తరపున హైదరాబాద్ వేదికగా తన అరంగేట్రం మ్యాచ్ ఆడటం ద్వారా రికార్డుల్లో నిలిచాడు.

ఐపీఎల్ గత 16 సీజన్లుగా వివిధ దేశాలకు చెందిన దిగ్గజ క్రికెటర్లు మాత్రమే కాదు..అంతర్జాతీయ అనుభవం ఏమాత్రం లేని నూనూగుమీసాల కుర్రక్రికెటర్లు సైతం వివిధ ఫ్రాంచైజీల తరపున బరిలోకి దిగటం, నిలదొక్కుకోలేక తెరమరుగు కావటం జరిగిపోయాయి.

అయితే..ప్రస్తుత 2024 సీజన్ లీగ్ ద్వారా దక్షిణాఫ్రికాకు చెందిన 17 సంవత్సరాల కుర్రఫాస్ట్ బౌలర్ క్వెనా మపాకా ముంబై ఇండియన్స్ తరపున తన అరంగేట్రం మ్యాచ్ ఆడటం ద్వారా రికార్డుల్లో చోటు సంపాదించాడు.


అండర్ -19 ప్రపంచకప్ నుంచి ఐపీఎల్ కు....

దక్షిణాఫ్రికా వేదికగా కొద్దిమాసాల క్రితం ముగిసిన 2023 ఐసీసీ అండర్- 19 ప్రపంచకప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గెలుచుకొన్న టీనేజ్ సంచలనం క్వెనా మపాకాకు ముంబై ఫ్రాంచైజీ కాంట్రాక్టు ఇచ్చి మరీ జట్టులోకి తీసుకొంది. శ్రీలంక ఫాస్ట్ బౌలర్ మధుశంఖ గాయంతో అందుబాటులో లేకపోడంతో అతని స్థానంలో మపాకాకు చోటు దక్కింది.

జోహెన్స్ బర్గ్ కు చెందిన మపాకా కేవలం 17 సంవత్సరాల వయసులోనే గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే మెరుపు ఫాస్ట్ బౌలర్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు. డెత్ ఓవర్లలో భీకరమైన యార్కర్లు సంధించే నేర్పు సైతం మపాకాకు ఉంది.

ఈ ఎడమచేతి వాటం యువఫాస్ట్ బౌలర్ కు అండర్ -19 ప్రపంచకప్ లో ఆడిన 6 మ్యాచ్ ల్లోనే 21 వికెట్లు పడగొట్టిన రికార్డు ఉంది. ప్రస్తుతం హైస్కూలు విద్యార్థిగా ఉన్న మపాకా కు టెన్నిస్, హాకీ క్రీడల్లో సైతం ప్రవేశం ఉంది.

పీడకలగా అరంగేట్రం మ్యాచ్.....

హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ ద్వారా ముంబై ఇండియన్స్ ఓపెనింగ్ బౌలర్ గా మపాకా రంగప్రవేశం చేశాడు.

35వేల మంది సమక్షంలో మ్యాచ్ ఆడటం మపాకా కెరియర్ లో ఇదే తొలిసారి. తన కోటా 4 ఓవర్లలో మపాకా భారీగా 66 పరుగులు సమర్పించుకొన్నాడు. అరంగేట్రం మ్యాచ్ ఒత్తిడికి తోడు అనుభవం లేమితో మపాకా నియంత్రణ కోల్పోయాడు. ముంబై బౌలర్లలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ మపాకా మాత్రమే.

17 సంవత్సరాల 353 రోజుల వయసులో ఐపీఎల్ ఆడటం ద్వారా రెండో అతిపిన్నవయస్కుడైన బౌలర్ గా నిలిచాడు. 2019లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అరంగేట్రం చేసిన రసిక్ సలామ్ వయసు 17 ఏళ్ళ 352 రోజులు మాత్రమే.

2018లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున సందీప్ లాంచానే, పంజాబ్ కింగ్స్ తరపున ముజీబుర్ రెహ్మాన్ అతిచిన్నవయసులో ఐపీఎల్ ఆడిన విదేశీ క్రికెటర్లుగా నిలిస్తే..వారి తరువాతి స్థానంలో మపాకా నిలిచాడు.

ముంబై ఇండియన్స్ ఆడాల్సిన మిగిలిన 12 రౌండ్ల మ్యాచ్ ల్లో మపాకాకు ఎన్ని మ్యాచ్ ల్లో ఆడే అవకాశం వస్తుందన్నది అనుమానమే.

First Published:  28 March 2024 12:38 PM GMT
Next Story