Telugu Global
Sports

యువీ వార‌సుడు మ‌న తిలక్ వ‌ర్మేనా.. స్కై ఫెయిల్యూర్స్ కలిసొస్తున్నాయా!

సంక్లిష్ట ప‌రిస్థితుల మ‌ధ్య టీ20ల్లో నెంబ‌ర్ 4గా వ‌స్తున్న మ‌న తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ ఆశ‌లు రేకెత్తిస్తున్నాడు. వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న టీ20 సిరీస్‌లో ఇప్పుడు అత‌నే టాప్ స్కోర‌ర్‌.

యువీ వార‌సుడు మ‌న తిలక్ వ‌ర్మేనా.. స్కై ఫెయిల్యూర్స్ కలిసొస్తున్నాయా!
X

యువ‌రాజ్‌సింగ్ ఉన్నంత‌కాలం ఇండియ‌న్ క్రికెట్ టీమ్‌కు నెంబ‌ర్ 4 స్థానంలో మంచి బ్యాట్స్‌మ‌న్ లేడ‌న్న బెంగ లేదు. మంచి ఆఫ్ స్పిన్న‌ర్‌.. క‌ళ్లు చెదిరే ఫీల్డ‌ర్.. ఇవ‌న్నీ క‌లిసి యువీ జ‌ట్టుకు మంచి ఎసెట్ అయ్యాడు. 2011 వ‌న్డే వ‌రల్డ్‌క‌ప్‌లో యువీ ఆల్‌రౌండ్ ప‌ర్‌ఫార్మెన్స్ మ‌నం క‌ప్ గెల‌వ‌డంలో చాలా కీల‌కం. కానీ యువీ త‌ర్వాత ఆ ప్లేస్‌లో ఎవ‌రూ సెట్ కావ‌ట్లేదు.

రాహుల్‌, అయ్య‌ర్ గాయాల గోల‌

యువ‌రాజ్ త‌ర్వాత నెంబ‌ర్ 4 బ్యాట్స్‌మ‌న్ స్థానంలో ఇప్ప‌టికీ ఎవ‌రూ కుదురుకోలేద‌ని కెప్టెన్ రోహిత్‌శ‌ర్మ తాజాగా కామెంట్ చేశాడు. శ్రేయ‌స్ అయ్య‌ర్‌, కేఎల్ రాహుల్ మధ్య‌లో 30, 40 మ్యాచ్‌లాడి సెట్ అయిన‌ట్లే క‌నిపించారు. కానీ వాళ్లు గాయాల‌తో త‌ర‌చూ జ‌ట్టుకు దూర‌మ‌వుతున్నారు. శ్రేయ‌స్ అయ్య‌ర్ అయితే జ‌ట్టులో క‌నిపించి ఏడాది దాటిపోయింది. అత‌ని గాయం ఎప్ప‌టికి త‌గ్గుతుందో ఇప్ప‌టికీ అంచనాల్లేవు. దాదాపుగా రాహుల్ ప‌రిస్థితీ ఇంతే.

సూర్యా భాయ్‌.. ఫ్లాపేనోయ్‌

ఇక టీ20ల్లో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయే సూర్య‌కుమార్ యాద‌వ్ (స్కై) వ‌న్డేల్లోకి వ‌చ్చేస‌రికి తుస్సుమ‌నిపిస్తున్నాడు. అయ్య‌ర్‌, రాహుల్ గైర్హాజరుతో.. వ‌య‌సు 30 దాటినా కూడా స్కైకి అవ‌కాశ‌మిచ్చారు. అయితే అత‌ను దాన్ని ఉప‌యోగించుకున్నసంద‌ర్భాలేమీ లేవు. అతను ఆడిన చివ‌రి 10 వ‌న్డే ఇన్నింగ్స్‌లలో హై స్కోరు 35. నాలుగుసార్లు డ‌కౌట్ అయ్యాడంటే ఇక మ‌నోడి గురించి ఎంత‌వ‌ర‌కు అంచ‌నాలు పెట్టుకోవ‌చ్చో ఈపాటికే టీమిండియా సెలెక్ట‌ర్ల‌కు అర్థ‌మైపోయింది.

తిల‌క్‌వ‌ర్మ‌కు గోల్డెన్ ఛాన్స్‌

ఇన్ని సంక్లిష్ట ప‌రిస్థితుల మ‌ధ్య టీ20ల్లో నెంబ‌ర్ 4గా వ‌స్తున్న మ‌న తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ ఆశ‌లు రేకెత్తిస్తున్నాడు. వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న టీ20 సిరీస్‌లో ఇప్పుడు అత‌నే టాప్ స్కోర‌ర్‌. వ‌య‌సు కూడా ప‌ట్టుమ‌ని 21 ఏళ్లే. ఎలాంటి కండిష‌న్‌లో అయినా బ్యాటింగ్ చేయ‌డానికి సిద్ధంగా ఉన్న‌ట్లు క‌నిపిస్తున్నాడు. వెస్టిండీస్‌తో ఓడిపోయిన రెండు టీ20 మ్యాచ్‌ల్లోనూ టీమంతా వెనుదిరుగుతున్నా తాను మాత్రం కూల్‌గా ఆడుతూ.. ఛాన్స్ దొరికిన‌ప్పుడ‌ల్లా బౌండ‌రీలు బాదుతూ అల‌రించాడు. ఇదే నిల‌క‌డ చూపిస్తే మ‌న వ‌ర్మకి వ‌న్డే జ‌ట్టు త‌లుపులూ తెరిచే ఉండ‌టం ఖాయ‌మంటున్నారు.

First Published:  11 Aug 2023 6:16 AM GMT
Next Story