Telugu Global
Sports

ఎట్టకేలకు సంజు తలుపు తట్టిన అదృష్టం!

టీ-20 ప్రపంచకప్ జట్టులో చోటుతో సంజు శాంసన్ మాత్రమే కాదు..అతని వేలాదిమంది అభిమానులు సైతం గాల్లో తేలిపోతున్నారు. రాహుల్ నుంచి గట్టిపోటీ ఎదుర్కొని మరీ తన జీవితలక్ష్యం నెరవేర్చుకోగలిగాడు.

ఎట్టకేలకు సంజు తలుపు తట్టిన అదృష్టం!
X

టీ-20 ప్రపంచకప్ జట్టులో చోటుతో సంజు శాంసన్ మాత్రమే కాదు..అతని వేలాదిమంది అభిమానులు సైతం గాల్లో తేలిపోతున్నారు. రాహుల్ నుంచి గట్టిపోటీ ఎదుర్కొని మరీ తన జీవితలక్ష్యం నెరవేర్చుకోగలిగాడు.

సంజు శాంసన్...కొండంత ప్రతిభ ఉన్నా..గోరంత అదృష్టం లేక గత కొద్ది సంవత్సరాలుగా భారత ప్రపంచకప్ జట్టుకు దూరమవుతూ వచ్చాడు. ధూమ్ ధామ్ టీ-20, ఇన్ స్టంట్ వన్డే ఫార్మాట్లలో నాణ్యమైన వికెట్ కీపర్ బ్యాటర్ గా పేరు, గుర్తింపు, రికార్డులు ఉన్న తనవంతు కోసం గత తొమ్మిదేళ్లుగా ఎదురుచూస్తూ వచ్చాడు.

2015 నుంచి 2024 వరకూ...

2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో పాల్గొనే 15 మంది సభ్యుల భారతజట్టులో చోటు కోసం రిషభ్ పంత్, కెఎల్ రాహుల్ లాంటి దిగ్గజ ఆటగాళ్లతో సంజు గట్టిపోరాటమే చేయాల్సి వచ్చింది.

భారత నంబర్ వన్ వికెట్ కీపర్ బ్యాటర్ గా రిషభ్ పంత్ స్థానం ఖాయం కాగా..బ్యాకప్ వికెట్ కీపర్ కమ్ టాపార్డర్ బ్యాటర్ స్థానం కోసం రాహుల్ తో సంజు పోటీపడ్డాడు.

ప్రస్తుత ఐపీఎల్ మొదటి 10 రౌండ్ల మ్యాచ్ ల్లో నిలకడగా రాణించడం ద్వారా సంజు సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించగలిగాడు.

2015లోనే భారత టీ-20 ఆటగాడిగా సంజు శాంసన్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత నుంచి ధోనీ, పంత్ లాంటి సూపర్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ల నీడన సంజు మగ్గిపోవాల్సి వచ్చింది.

ధోనీ రిటైర్మెంట్, కారుప్రమాదంతో పంత్ ఏడాదిపాటు జట్టుకు దూరం కావడం సంజుకు కలసి వచ్చింది. తనకు లభించిన పరిమిత అవకాశాలలో స్థాయికి తగ్గట్టుగా రాణిస్తూ వచ్చినా ప్రపంచకప్ జట్లలో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు.

తన కెరియర్ లో భారత్ తరపున ఆడిన 25 టీ-20 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో 77 అత్యధిక వ్యక్తిగత స్కోరుతో 374 పరుగులు సాధించాడు. 18.70 సగటుతో 133.09 స్ట్ర్రయిక్ రేట్ సైతం నమోదు చేశాడు.

ఐపీఎల్ లో సూపర్ హిట్......

భారత వన్డే, టీ-20 జట్లలో అడపాదడపా అవకాశాలు దక్కినా...ఏటా జరిగే ఐపీఎల్ మ్యాచ్ ల ద్వారా పూర్తిస్థాయిలో సత్తా చాటుకోడం సంజుకు కలసి వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ బ్యాటర్ గా సంజు చెలరేగిపోతూ వచ్చాడు. 2022 సీజన్లో ఫైనల్స్ చేరడంతో పాటు రాజస్థాన్ ను రన్నరప్ గా నిలిపాడు. ప్రస్తుత 2024 సీజన్లో మొదటి 9 రౌండ్లలో 8 విజయాలు సాధించిన ఏకైకజట్టుగా రాజస్థాన్ రికార్డు నెలకొల్పడంలో సంజు తనవంతు పాత్ర పోషించాడు.

తన ఐపీఎల్ కెరియర్ లో ఇప్పటి వరకూ మొత్తం 161 మ్యాచ్ లు ఆడిన సంజు 3 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలతో సహా 4వేల 273 పరుగులు సాధించాడు. 30.96 సగటు, 139.04 స్ట్ర్రయిక్ రేటుతో విజయవంతమయ్యాడు. 119 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు సైతం సాధించాడు.

ప్రస్తుత 2024 సీజన్లో ఇప్పటి వరకూ ఆడిన మొదటి 9 రౌండ్ల పోటీలలో సంజు 385 పరుగులతో 77.00 సగటు, 161 స్ట్ర్రయిక్ రేట్ నమోదు చేశాడు. 82 పరుగుల నాటౌట్ అత్యధిక స్కోరుగా నాలుగు హాఫ్ సెంచరీలు సాధించాడు.

కెఎల్ రాహుల్ సైతం లక్నో సూపర్ జెయింట్స్ తరపున రాణించినా..ఎంపిక సంఘం మాత్రం సంజు వైపే మొగ్గు చూపింది. తాను పడిన కష్టానికి తగిన గుర్తింపు ఇప్పటికైనా దక్కిందంటూ సంజు సంతృప్తి వ్యక్తం చేశాడు.

కృతజ్ఞతకు, విశ్వాసానికి మరోపేరు..

2018 ఐపీఎల్ సీజన్ నుంచి రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న సంజు శాంసన్..సీజన్ కు 15కోట్ల రూపాయలు కాంట్రాక్టుపై ఆడుతూ వస్తున్నాడు. వేరే ఫ్రాంచైజీల నుంచి భారీగా కాంట్రాక్టు ఇస్తామంటూ ఆఫర్లు వస్తున్నా.. సంజు సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చాడు. నాలుగు డబ్బులు ఎక్కువ వస్తాయని వేరే ఫ్రాంచైజీలకు వెళ్లే ప్రసక్తేలేదని, తన వరకూ జైపూర్ ఫ్రాంచైజీని పటిష్టంగా తీర్చిదిద్దటమే లక్ష్యమని ప్రకటించాడు.

జోస్ బట్లర్, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చాహల్ లాంటి ప్రపంచ మేటి క్రికెటర్లు రాజస్థాన్ రాయల్స్ జట్టులో సభ్యులుగా ఉండేలా చేయటంలో సంజు చురుకైన పాత్ర పోషించాడు.

2021 సీజన్లో తనజట్టును ఐపీఎల్ ఫైనల్స్ చేర్చడంతో పాటు..రన్నరప్ గా నిలపడంలో కెప్టెన్ గా సంజు శాంసన్ తనవంతు పాత్ర పోషించాడు. వేరే ఫ్రాంచైజీల నుంచి భారీఆఫర్లు వస్తున్నప్పుడు ఎందుకు వెళ్ళటం లేదంటూ తాను సంజూను ప్రశ్నించానని, తనకు రాజస్థాన్ ఫ్రాంచైజీనే ప్రధానమని సంజు చెబుతూ వచ్చాడన్న విషయాన్ని రాయల్స్ ట్రైనర్ రాజమణి ప్రభు గుర్తు చేసుకొన్నారు.

తన ప్రాంచైజీ పట్ల ప్రేమ, విశ్వాసం, కృతజ్ఞత సంజులో చాలా ఎక్కువని, డబ్బుకు కక్కుర్తిపడే తత్వం సంజూ లేనేలేదని రాజమణి ప్రభు ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

సంజు దొడ్డమనసు...

ఐపీఎల్ లో కోట్ల రూపాయలు ఆర్జించే క్రికెటర్లు దేశంలో ఎందరో ఉన్నారు. అయితే..తనకంటే దిగువన ఉన్న ప్రతిభావంతులైన క్రికెటర్ల కోసం సీజన్ కు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసే గొప్పమనసున్న క్రికెటర్ సంజు శాంసన్ మాత్రమే.

ఐపీఎల్ కాంట్రాక్టుకింద ఏడాదికి 15 కోట్ల రూపాయలు వేతనంగా అందుకొంటున్న సంజు శాంసన్..ఆ మొత్తంలో కోటి రూపాయలను దేశవాళీ క్రికెటర్ల కోసం ఖర్చు చేస్తున్నాడు. అంతేకాదు..మరో కోటిరూపాయల మొత్తాన్నిప్రతిభావంతులైన బాలల కోసం వ్యయం చేస్తున్నాడు.

సాటి క్రికెటర్ల కోసం ఏడాదికి 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసే మరో ఆటగాడు ఎవరైనా ఉన్నారా? అని రాజస్థాన్ రాయల్స్ ట్రైనర్ రాజమణి ప్రభు ప్రశ్నిస్తున్నారు.

కేరళ నుంచి భారత క్రికెట్లోకి..

29 సంవత్సరాల సంజు శాంసన్ కు 2014 అండర్ -19 ప్రపంచకప్ లో భారతజట్టుకు వైస్ కెప్టెన్ గా ఆడిన ఘనత ఉంది. 2021 సీజన్లో శ్రీలంక ప్రత్యర్థిగా భారత్ తరపున తన తొలివన్డే ఆడిన సంజు..2015లోనే జింబాబ్వే ప్రత్యర్థిగా టీ-20 అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ లో ఇప్పటికే మూడు శతకాలు బాదిన మొనగాళ్లలో సంజు కూడా ఉన్నాడు.

2013 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తో తన ఐపీఎల్ కెరియర్ ప్రారంభించిన సంజు..2016, 17 సీజన్లలో మాత్రం ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఆడాడు. తిరిగి 2018 సీజన్ నుంచి రాజస్థాన్ రాయల్స్ కే ఆడుతూ కెప్టెన్ స్థాయికి ఎదిగాడు.

సంజు సారథిగా రాజస్థాన్ రాయల్స్ 2021 సీజన్ ఫైనల్స్ చేరడంతో పాటు రన్నరప్ ట్రోఫీని సైతం సొంతం చేసుకోగలిగింది. దేశవ్యాప్తంగా అభిమానులున్న సంజు నిలకడగా రాణించడం ద్వారా భారత టీ-20 ప్రపంచకప్ జట్టులో ఎట్టకేలకు చోటు సంపాదించగలిగాడు. ప్రపంచకప్ లో సైతం సంజు స్థాయికి తగ్గ ఆటతీరుతో తన స్థానం సుస్థిరం చేసుకోగలిగితే తనలోని అపారప్రతిభకు తగిన న్యాయం చేసుకొన్నవాడవుతాడు.

First Published:  1 May 2024 10:55 AM GMT
Next Story