Telugu Global
Sports

భారత విజయాల టెస్టు వేదిక విశాఖ!

భారత్- ఇంగ్లండ్ జట్ల పాంచ్ పటాకా సిరీస్ లోని రెండోటెస్టుకు విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం ఆతిథ్యమిస్తోంది.

భారత విజయాల టెస్టు వేదిక విశాఖ!
X

భారత్- ఇంగ్లండ్ జట్ల పాంచ్ పటాకా సిరీస్ లోని రెండోటెస్టుకు విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం ఆతిథ్యమిస్తోంది. భారత విజయాల టెస్టు వేదికగా విశాఖకు గుర్తింపు ఉంది.....

ప్రపంచ క్రికెట్ కేంద్రబిందువు భారత్ వేదికగా 50కి పైగా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాలుంటే...అందులో 30కి పైగా స్టేడియాలకు సాంప్రదాయ టెస్టుమ్యాచ్ లకు విజయవంతంగా ఆతిథ్యమిచ్చిన రికార్డు ఉంది.

భారత క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్ నుంచి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్ట్రేడియం వరకూ ఎన్నో విలక్షణ వేదికలున్నా...వాటిలో దేని ప్రత్యేకత దానిదే. ప్రస్తుత ఇంగ్లండ్- భారత్ జట్ల ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని రెండోటెస్టుకు ఆతిథ్యమిస్తున్నవిశాఖకు ఆంధ్రప్రదేశ్ ఏకైక టెస్టు వేదికగా, భారత టెస్టు విజయాల వేదికగా గుర్తింపు ఉంది.

భారత 24వ టెస్టు వేదికగా విశాఖ....

స్టీల్ సిటీ విశాఖపట్నం శివారులోని పోతిన మల్లయ్యపాలెంలో బీసీసీఐ ఆర్థికసాయంతో ఆంధ్ర క్రికెట్ సంఘం 2004లో నిర్మించిన ఏసీఏ-వీడీసీఏ స్టేడియం ప్రస్థానం చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్థాన్ జట్ల పోరుతో ప్రారంభమయింది. 2005, ఏప్రిల్‌ 5న ఈ రెండు జట్ల మధ్య వన్డే మ్యాచ్‌ నిర్వహించారు. ఈ పోరులో భారత్ ను పాక్‌ కంగుతినిపించింది.

ఆ తర్వాత నుంచి జరిగిన వన్డే, టీ-20, టెస్టుమ్యాచ్ ల్లో భారత్ అత్యధిక విజయాలు సాధించిన వేదికగా విశాఖ రికార్డుల్లో చేరింది.

2016 లో టెస్ట్ మ్యాచ్ కు ఆతిథ్యం....

ఇప్పటి వరకూ పలు అంతర్జాతీయమ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం వేదికగా మొట్టమొదటి టెస్టుమ్యాచ్ ను 2016లో ఇంగ్లండ్ ప్రత్యర్థిగా నిర్వహించారు.

భారత్ ఆధిపత్యంతో కొనసాగిన ఈ టెస్టులో ఇంగ్లండ్ 246 పరుగుల భారీఓటమి చవిచూసింది. భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ 167, 81 స్కోర్లతో బ్యాటింగ్ లో చెలరేగిపోతే...

తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ 5 వికెట్లతో బౌలింగ్ లో రాణించాడు.

ఆ తర్వాత మూడేళ్లకు 2019 అక్టోబర్ లో మరోసారి టెస్టుమ్యాచ్ కు వేదికగా నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టుమ్యాచ్ లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ సాధిస్తే..రోహిత్ శర్మ 176 పరుగులతో చెలరేగిపోయాడు.

బౌలింగ్ విభాగంలో అశ్విన్ 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ 5 వికెట్లు పడగొట్టడంతో భారత్ 203 పరుగుల భారీవిజయం సాధించింది.

ఇప్పటి వరకూ ఆడిన రెండుకు రెండుటెస్టుల్లోనూ భారత్ విజయాలు సాధించగలిగింది.

2024 లో మరోసారి టెస్టు యోగం!

2024 సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరుగనున్న కీలక రెండోటెస్టుకు విశాఖ మరోసారి ఆతిథ్యమిస్తోంది. ఫిబ్రవరి 2 నుంచి ఐదురోజులపాటు జరుగనున్న ఈ టెస్టు మ్యాచ్ ఆతిథ్య ఇంగ్లండ్ కు చెలగాటం, ఆతిథ్య భారత్ కు సిరీస్ సంకటం గా మారింది.

సిరీస్ లోని మొదటి టెస్టులో 28 పరుగుల తేడాతో ఓడిన భారత్..తన లక్కీ గ్రౌండ్ విశాఖ వేదికగా జరిగే రెండోటెస్టులో ఆరునూరైనా నెగ్గితీరాలన్న పట్టుదలతో ఉంది.

జడేజా, రాహుల్ అవుట్- కుల్దీప్ కు చాన్స్....

హైదరాబాద్ వేదికగా ముగిసిన తొలిటెస్టులో పాల్గొన్న స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, స్పెషలిస్ట్ బ్యాటర్ కెఎల్ రాహుల్ గాయాలతో తప్పుకోడంతో...సరఫ్రాజ్ ఖాన్, ఆఫ్ స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, లెఫ్టామ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్ కు చోటు కల్పించారు.

రోహిత్ శర్మ నాయకత్వంలోని భారతజట్టులో యశస్వి జైశ్వాల్, శుభ్ మన్ గిల్, శ్ర్రేయస్ అయ్యర్, కెఎస్ భరత్ ( వికెట్ కీపర్ ), ధృవ్ జురెల్ ( వికెట్ కీపర్ ),

రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్, జస్ ప్రీత్ బుమ్రా, ఆవేశ్ ఖాన్, రజత్ పాటిదార్, సరఫ్రాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్ సభ్యులుగా ఉన్నారు.

First Published:  1 Feb 2024 4:32 AM GMT
Next Story