Telugu Global
Sports

ఆసియాక్రీడల్లో భారత్ 107 పతకాల రికార్డు వెనుక..!

ఆసియాక్రీడల 7 దశాబ్దాల చరిత్రలో భారత్ రికార్డుస్థాయిలో 107 పతకాలు సాధించడం వెనుక గత దశాబ్దకాలంగా కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ, భారత ఒలింపిక్స్ సమాఖ్య ఆనుసరించిన క్రీడావిధానం ప్రముఖంగా ఉన్నాయి.

ఆసియాక్రీడల్లో భారత్ 107 పతకాల రికార్డు వెనుక..!
X

భారత్ ను తిరుగులేని క్రీడాశక్తిగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ స్పష్టమైన విధానాలను అమలు చేసింది. అంతర్జాతీయస్థాయిలో భారత క్రీడాకారులు రాణించడానికి వీలుగా ఖర్చుకు వెనుకాడకుండా తగిన వనరులు సమకూర్చింది. శిక్షణతో పాటు తరచూ అంతర్జాతీయ పోటీలలో పాల్గొనేలా ప్రోత్సహించింది.

ఐదేళ్లలో ఎంతలో ఎంత మార్పు..!

జకార్తా వేదికగా 2018లో ముగిసిన 18వ ఆసియాక్రీడల్లో 70 పతకాలు మాత్రమే సాధించిన భారత్ కేవలం ఐదేళ్ల కాలంలోనే.. 2022 ఆసియాక్రీడల్లో 107 పతకాలకు చేరుకోవ‌డం వెనుక కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ, భారత ఒలింపిక్ సంఘం కసరత్తు, కృషి ఎంతో ఉన్నాయి. గతంలో క్రీడామంత్రిగా పనిచేసిన కిరణ్ రిజ్జు, ప్రస్తుత క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ లు సైతం తమవంతు బాధ్యతల్ని అంకితభావంతో నిర్వర్తించారు.

కొత్తగా.. సరికొత్తగా పలు పతకాలు!

భారత అథ్లెట్లు తొలిసారిగా అశ్వక్రీడల డ్రెస్సాజ్ విభాగంలో బంగారు పతకం, టేబుల్ టెన్నిస్ మహిళల డబుల్స్ లో రజత పతకం, బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లో బంగారు పతకం, విలువిద్య కాంపౌండ్ విభాగాలలో అరుదైన పతకాలు సాధించగలిగారు. విలువిద్య కోసం ఎన్టీపీసీతో 5 సంవత్సరాలపాటు 115 కోట్ల రూపాయల పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది. విలువిద్య క్రీడకు అవసరమైన అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు, క్రీడాపరికరాలు అందుబాటులో ఉంచడం కోసం 15 కోట్ల రూపాయలను అదనంగా వ్యయం చేసింది.

విఖ్యాత శిక్షకుల పర్యవేక్షణలో..

దక్షిణ కొరియా, ఇటలీ దేశాలకు చెందిన విఖ్యాత శిక్షకుల్ని రప్పించడానికి 2కోట్ల రూపాయలు ఖర్చుచేసింది. భారత్ కు చెందిన 50 మంది శిక్షకులను విదేశీ సెమీనార్ లకు పంపడం ద్వారా అత్యాధునిక నైపుణ్యాలు సమకూర్చుకోడానికి కృషి చేసింది. సైకాలజిస్టులు, పౌష్టికాహార నిపుణులు, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ నిపుణులకు అవసరమైన సాఫ్ట్ వేర్ ను సమకూర్చడం కోసం మరో 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ప్రభుత్వం తీసుకొన్న ఈ చర్యల వల్ల 2018లో 2 పతకాలు మాత్రమే సాధించిన భారత ఆర్చర్లు 2022 క్రీడల్లో 5 బంగారు పతకాలు సాధించగలిగారు. మహిళల విభాగంలో జ్యోతి సురేఖ, పురుషుల విభాగంలో ఓజాస్ మూడేసి స్వర్ణ పతకాలు సాధించడం ద్వారా దేశానికే గర్వకారణంగా నిలిచారు.

22 రకాల క్రీడల్లో పతకాలు..

2018 ఆసియాక్రీడల్లో 18 రకాల క్రీడల్లో పతకాలు సాధిస్తే.. 2022 ఆసియాక్రీడల్లో 22 రకాల క్రీడల్లో పతకాలు సంపాదించింది. గత క్రీడలతో పోల్చిచూస్తే షూటింగ్ లో 20 నుంచి 29కి పతకాల సంఖ్యను పెంచుకొంది. ట్రాక్ అండ్ ఫీల్డ్ లో సైతం భారత్ తన పతకాల సంఖ్యను గణనీయంగా పెంచుకోగలిగింది. పురుషుల జావలిన్ త్రోలో స్వర్ణ, రజతాలు రెండు భారత్ కే దక్కాయి. పురుషుల 3 వేల మీటర్ల స్టీపుల్ చేజ్ లో అవినాశ్ సాబ్లే, మహిళల 5 వేల మీటర్ల పరుగులో పారుల్ చౌదరీ బంగారు విజయాలు అరుదైనవిగా మిగిలిపోతాయి.

క్రికెట్, కబడ్డీలో రెండుకు రెండు..

క్రికెట్ పురుషుల, మహిళల విభాగాలలో భారత్ రెండుకు రెండు బంగారు పతకాలు సొంతం చేసుకొంది. కబడ్డీ పురుషుల, మహిళల విభాగాలలో సైతం భారతజట్లు స్వర్ణ విజయాలు సాధించాయి. చదరంగం పురుషుల, మహిళల విభాగాలలో భారత్ రజత పతకాలతో మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మహిళల గోల్ఫ్ వ్యక్తిగత విభాగంలో ఆదితీ అశోక్ రజత, రోలర్ స్కేటింగ్ లో రెండు కాంస్య, కనోయింగ్ లో ఓ కాంస్య పతకం భారత్ కు అదనంగా దక్కాయి.

బ్యాడ్మింటన్లో సరికొత్త చరిత్ర..

చైనా, కొరియా, జపాన్, మలేసియా, ఇండోనీషియా దేశాల ఆధిపత్యం కొనసాగిన బ్యాడ్మింటన్లో భారత్ సరికొత్త శక్తిగా అవతరించింది. పురుషుల టీమ్ విభాగంలో రజత, వ్యక్తిగత విభాగంలో ప్రణయ్ కాంస్య, డబుల్స్ లో తొలిసారిగా బంగారు పతకాలతో భారత షట్లర్లు చరిత్ర సృష్టించారు.

ఆరు క్రీడల్లో వెనుకబడిన భారత్...

భారత్ కు సాంప్రదాయంగా పతకాలు అందిస్తూ వచ్చిన బాక్సింగ్, కుస్తీ, టెన్నిస్ అంశాలతో పాటు బ్రిడ్జ్, కురాశ్, ఉషు, టేబుల్ టెన్నిస్ క్రీడల్లో భారత్ దారుణంగా విఫలమయ్యింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 655 మంది సభ్యుల భారీబృందంతో 38 రకాల క్రీడాంశాలలో పోటీకి దిగిన భారత్ 28 స్వర్ణాలతో సహా మొత్తం 107 పతకాలతో పతకాల పట్టిక నాలుగోస్థానంలో నిలవడంలో ప్రభుత్వ క్రీడావిధానం, ప్రోత్సాహకాలు ఎంతగానే ఉపకరించాయి. ఈ ఘనత చెమటోడ్చిన క్రీడాకారులకు, వెన్నుతట్టి ప్రోత్సహించిన కేంద్ర క్రీడామంత్రిత్వశాఖకు, భారత ఒలింపిక్ సమాఖ్యకు దక్కుతుంది.

First Published:  14 Oct 2023 2:15 AM GMT
Next Story