Telugu Global
Sports

సరికొత్త చరిత్రకు గెలుపు దూరంలో భారత కుర్రగ్రాండ్మాస్టర్!

ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ 13వ రౌండ్ విజయంతో భారత కుర్ర గ్రాండ్మాస్టర్ గుకేశ్ ముగ్గురు ప్రధాన ప్రత్యర్థులను అధిగమించడం ద్వారా అగ్రస్థానంలో నిలిచాడు.

సరికొత్త చరిత్రకు గెలుపు దూరంలో భారత కుర్రగ్రాండ్మాస్టర్!
X

ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ 13వ రౌండ్ విజయంతో భారత కుర్ర గ్రాండ్మాస్టర్ గుకేశ్ ముగ్గురు ప్రధాన ప్రత్యర్థులను అధిగమించడం ద్వారా అగ్రస్థానంలో నిలిచాడు. సరికొత్త చరిత్ర సృష్టించడానికి గెలుపు దూరంలో నిలిచాడు.

2024 ప్రపంచ క్యాండిడేట్స్ చెస్ రసపట్టుగా సాగుతోంది. ఐదుదేశాలకు చెందిన ఎనిమిదిమంది గ్రాండ్మాస్టర్ల నడుమ గత రెండువారాలుగా సాగుతున్న 14 రౌండ్ల ఈ పోరు ముగింపు దశకు చేరింది. విజేతను నిర్ణయించడానికి కేవలం ఆఖరి రౌండ్ మాత్రమే మిగిలిఉంది.

13వ రౌండ్ గెలుపుతో గుకేశ్ టాప్...

ప్రపంచ చెస్ టైటిల్ కోసం వచ్చే ఏడాది జరిగే పోరులో చైనా సూపర్ గ్రాండ్మాస్టర్, ప్రస్తుత చాంపియన్ డింగ్ లీరెన్ తో తలపడటానికి అర్హతగా అంతర్జాతీయ చెస్ సమాఖ్య..కెనడాలోని టొరాంటో వేదికగా క్యాండిడేట్స్ చెస్ టోర్నీని నిర్వహిస్తోంది.

ఈ పోరులో తలపడుతున్న మొత్తం 8 మంది గ్రాండ్మాస్టర్లలో ముగ్గురు భారత కుర్ర గ్రాండ్మాస్టర్లు ఉన్నారు. 17 ఏళ్ల గుకేశ్, 18 సంవత్సరాల ప్రజ్ఞానంద్ తో పాటు 29 సంవత్సరాల విదిత్ సంతోష్ గుజరాతీ సైతం అమెరికా, రష్యా, ఫ్రాన్స్, అజర్ బైజాన్ దేశాలకు చెందిన విఖ్యాత గ్రాండ్ మాస్టర్లతో తలపడుతున్నారు.

మొదటి 12 రౌండ్ల పోటీలు ముగిసే సమయానికి సంయుక్త ద్వితీయస్థానానికి పడిపోయిన గ్రాండ్మాస్టర్ గుకేశ్ కీలక 13వ రౌండ్లో తిరుగులేని విజయం సాధించాడు.

ఫ్రెంచ్ గ్రాండ్ మాస్టర్ అలీరెజా ఫిరోజా ఆట కట్టించడం ద్వారా పూర్తిపాయింటు సాధించాడు. మొత్తం 8.5 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలిచాడు.

డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ ఆఖరి ( 14) రౌండ్ లో అమెరికా గ్రాండ్ మాస్టర్ హికారు నకామురాతో గుకేశ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఆఖరిరౌండ్లో గుకేశ్ విజేతగా నిలిస్తే...విశ్వనాథన్ ఆనంద్ తరువాత క్యాండిడేట్స్ టైటిల్ సాధించిన భారత రెండవ, 17 సంవత్సరాల వయసులోనే చాలెంజర్ గా నిలిచిన కుర్ర గ్రాండ్మాస్టర్ గా ప్రపంచ రికార్డుతో పాటు సరికొత్త చరిత్ర సృష్టించగలుగుతాడు.

ప్రజ్ఞానంద్ పరాజయం...

భారత చిచ్చరపిడుగు ప్రజ్ఞానంద్ గత మూడురౌండ్లుగా దారి తప్పాడు. స్థాయికి తగ్గట్టుగా రాణించలేక వరుస పరాజయాలతో డీలా పడ్డాడు. 13వ రౌండ్ పోరులో అమెరికాకు చెందిన ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ఆటగాడు ఫేబియానో కరూనా చేతిలో ఓటమితో 6వ స్థానానికి పడిపోయాడు.

అజర్ బెజాన్ గ్రాండ్మాస్టర్ నిజత్ అబ్సోవ్ తో జరిగిన 13వ రౌండ్ పోటీని విదిత్ గుజరాతీ డ్రాగా ముగించడం ద్వారా తన పాయింట్ల సంఖ్యను 5.5కు పెంచుకోగలిగాడు.

సూపర్ గ్రాండ్మాస్టర్లు ఇయాన్ నెపోమినిచ్- హికారు నకామురాల నడుమ జరిగిన 13వ రౌండ్ పోరు సైతం డ్రాగా ముగియడంతో ఇద్దరు గ్రాండ్మాస్టర్లు పాయింట్లు పంచుకోక తప్పలేదు.

13వ రౌండ్ పోటీలు ముగిసే సమయానికి గుకేశ్ ఒక్కడే 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. నకామురా, నెపోమినిచ్ చెరో 8 పాయింట్లతో సంయుక్త ద్వితీయ స్థానంలోనూ, ఫేబియానో కరూనా 7.5 పాయింట్లతో మూడోస్థానంలోనూ కొనసాగుతున్నారు.విదిత్ గుజరాతీ 5.5, ప్రజ్ఞానంద్ 5 పాయింట్లతో ఉన్నారు.

ఈ టోర్నీ ఆఖరి ( 14వ) రౌండ్ పోరులో గుకేశ్ తో నకమురా, అలీరెజాతో విదిత్ సంతోశ్ గుజరాతీ, నిజత్ అబ్సోవ్ తో ప్రజ్ఞానంద్, ఫేబియానో కరూనాతో ఇయాన్ నెపోమినిచ్ తలపడాల్సి ఉంది. ఆఖరి రౌండ్ ఫలితాలే లీగ్ టేబుల్ టాపర్ల తలరాతను మార్చనున్నాయి.

మహిళల విభాగంలో వైశాలీ గెలుపు..

మహిళా కాండిడేట్స్ చెస్ సమరంలో భారత జోడీ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి పోటీ డ్రాగా ముగియగా వైశాలీ సంచలన విజయం సాధించింది. 13వ రౌండ్ పోటీలు ముగిసేసమయానికి చైనా గ్రాండ్మాస్టర్ టాన్ జోంగ్యీ అగ్రస్థానంలో కొనసాగుతోంది.

13వ రౌండ్ పోరులో చైనా గ్రాండ్మాస్టర్ లీ టింగ్ జీ పై వైశాలీ విజయం సాధించింది. మొత్తం 13 రౌండ్లలో వైశాలీ 3 విజయాలు సాధించడం ద్వారా 6.5 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచింది.

14వ రౌండ్ పోటీలలో కోనేరు హంపితో లీ టింగ్ జీ, కాథరీనా లాగ్నోతో వైశాలీ, టాన్ తో అన్నా ముజిచుక్, అలెగ్జాండ్రాతో నూర్గుల్ సాలిమోవ్ పోటీపడనున్నారు.

First Published:  21 April 2024 12:45 PM GMT
Next Story