Telugu Global
Sports

చరిత్ర సృష్టించిన భారత మహిళా బ్యాడ్మింటన్‌ జట్టు, తొలిసారి స్వర్ణ సంబరం

బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్ షిప్లో భారత మహిళా జట్టు చారిత్రాత్మక స్వర్ణం సాధించింది.

చరిత్ర సృష్టించిన భారత మహిళా బ్యాడ్మింటన్‌ జట్టు, తొలిసారి స్వర్ణ సంబరం
X

బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్ షిప్లో భారత మహిళా జట్టు చారిత్రాత్మక స్వర్ణం సాధించింది. పీవీ సింధు సారథ్యంలోని జట్టు థాయ్‌లాండ్‌తో తలపడి విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో రెండు సింగిల్స్‌, ఒక డబుల్‌ మ్యాచ్‌లో గెలిచి భారత జట్టు స్వర్ణాన్ని ముద్దాడింది.

పీవీ సింధు, గాయత్రీ గోపిచంద్-త్రిశా జోలీ జోడీ, అన్‌మోల్‌ ఖర్బ్‌ తమ మ్యాచుల్లో గెలిచారు. ఈ టోర్నీ చ‌రిత్రలో ఫైన‌ల్ చేరిన మొద‌టిసారే భార‌త బృందం స్వ‌ర్ణ ప‌త‌కం కొల్ల‌గొట్టడం విశేషం. రెండేళ్ల కిందట థామస్‌ కప్‌ను నెగ్గిన భారత్‌కు ఆ తర్వాత ఇదే అతిపెద్ద టోర్నీ విజయం.


ఫైనల్లో ఒలింపిక్‌ పతకాల విజేత, తెలుగు తేజం పీవీ సింధు అదరగొట్టేసింది. కేవలం 39 నిమిషాల్లోనే థాయ్‌లాండ్‌కు చెందిన సుపనిద కతేతోంగ్‌పై విజయం సాధించి భారత్‌ను 1-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. ఆ తర్వాత ప్రపంచ 23వ ర్యాంకర్ ట్రీసా జాలీ- గాయత్రి గోపీచంద్ జోడీ అద్భుత ప్రదర్శనతో థాయ్‌ షట్లర్లు కితిథరకుల్‌-రవ్విందాపై తేడాతో గెలవడంతో టీమ్‌ఇండియా లీడ్‌ 2-0 దూసుకెళ్లింది. అయితే 2022లో సింగపూర్ ఓపెన్ లో బుసానన్ను ఓడించిన భారత క్రీడాకారిణి అష్మిత అనుభవజ్ఞురాలైన థాయ్ క్రీడాకారిణి చేతిలో పరాజయం పాలైంది.

ఆ తర్వాత మరొక డబుల్స్‌ మ్యాచ్‌నూ శ్రుతి - ప్రియా జోడీ ఓడిపోయింది. దీంతో ఇక స్వర్ణం సాధించాలంటే చివరి మ్యాచ్‌లో విజయం తప్పనిసరైంది. డిసైడ‌ర్ మ్యాచ్‌లో యువ‌కెర‌టం అన్మోల్ ఖర్బ్అ సాధార‌ణ‌మైన ఆట‌తో ప్ర‌త్య‌ర్థికి చెక్ పెట్టింది. హోరాహోరీగా సాగిన పోరులో పోర్న్‌పిచాను 21-14, 21-19తో మ‌ట్టిక‌రిపించింది. ఈ టోర్నీ చ‌రిత్ర‌లో తొలి స్వ‌ర్ణంతో మువ్వ‌న్నెల జెండాను సగర్వంగా ఎగరేసింది.

First Published:  18 Feb 2024 3:46 PM GMT
Next Story