Telugu Global
Sports

ఆసియా మహిళా బ్యాడ్మింటన్ ఫైనల్లో భారత్!

2024 -ఆసియా మహిళా బ్యాడ్మింటన్ టీమ్ ఫైనల్స్ కు భారత్ తొలిసారిగా చేరుకొంది. ఫైనల్లో థాయ్ లాండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది.

ఆసియా మహిళా బ్యాడ్మింటన్ ఫైనల్లో భారత్!
X

2024 -ఆసియా మహిళా బ్యాడ్మింటన్ టీమ్ ఫైనల్స్ కు భారత్ తొలిసారిగా చేరుకొంది. ఫైనల్లో థాయ్ లాండ్ తో అమీతుమీ తేల్చుకోనుంది.

ఆసియా మహిళా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్షిప్ టోర్నీలో భారత్ సంచలన విజయాల పరంపర కొనసాగుతోంది. పీవీ సింధు నాయకత్వంలోని భారతజట్టు తొలిసారిగా టైటిల్ రౌండ్ కు అర్హత సంపాదించింది.

రెండుసార్లు విజేత జపాన్ పై సంచలన విజయంతో భారత్ మొట్టమొదటిసారిగా ఫైనల్లో అడుగుపెట్టింది.

యువప్లేయర్ల దూకుడుతో..

జపాన్ తో హోరాహోరీగా సాగిన 5 మ్యాచ్ ల ఫైనల్లో భారత్ 3-2తో సంచలన విజయం నమోదు చేసింది. మహిళల డబుల్స్, సింగిల్స్ తో కూడిన ఈ పోరులో ప్రపంచ 23వ ర్యాంక్ డబుల్స్ జోడీ ట్రీసా జోలీ- గాయత్రీ గోపీచంద్ , 53వ ర్యాంక్ జంట అష్మితా చలిహా- అన్ మోల్ అనూహ్య విజయాలు సాధించారు.

ప్రపంచ 4వ ర్యాంకర్ అకానే యమగుచి లేకుండానే బరిలోకి దిగిన జపాన్ భారీమూల్యమే చెల్లించాల్సి వచ్చింది. ప్రపంచ 7వ ర్యాంక్ జోడీ యుకీ ఫుకుషిమా- సయాకా హిరాటోల పై భారత యువప్లేయర్లు తిరుగులేని విజయాలు నమోదు చేశారు.

సింధు ఓడిన పుంజుకొన్న భారత్..

గాయం నుంచి తేరుకొని తిరిగి భారత్ తరపున ఆడుతున్న స్టార్ ప్లేయర్ పీవీ సింధు..చైనాకు చెందిన హాన్ యు, హాంకాంగ్ ప్లేయర్ లో సిన్ యాన లపై విజయాలు సాధించినా..జపాన్ తో పోరులో మాత్రం రాణించలేకపోయింది.

జపాన్ ప్లేయర్ అయా ఒహోరీ తో జరిగిన పోరులో సింధు 13-21, 20-22తో పరాజయం చవిచూడాల్సి వచ్చింది.

ఆ తరువాత జరిగిన మహిళలడబుల్స్ లో ట్రీసా- గాయత్రీ జోడీ 21-17, 16-21, 22-20తో 73 నిముషాల పోరులో విజేతగా నిలవడం ద్వారా స్కోరును 1-1తో సమం చేయగలిగారు.

రెండో సింగిల్స్ లో అశ్మిత 21-17, 21-14తో ప్రపంచ మాజీ చాంపియన్ నజోమీ ఒకుహరా పై సంచలన విజయంతో భారత్ ఆధిక్యాన్ని 2-1కు పెంచింది.

రెండో డబుల్స్ లో సింధు- అశ్వినీ జోడీ 14-21, 11-21తో ఓటమి పొందడంతో స్కోరు 2-2తో సమమయ్యింది.

విజేతను నిర్ణయించే ఆఖరి సింగిల్స్ పోరులో భారత యువప్లేయర్ అన్మోల్ 21-14, 21-18తో జపాన్ కు చెందిన ప్రపంచ 29వ ర్యాంక్ ప్లేయర్ నట్సుకీ నిడైరాను 52 నిముషాలలో కంగు తినిపించడం ద్వారా తనజట్టు కు ఫైనల్స్ బెర్త్ ఖాయం చేయగలిగింది.

టైటిల్ పోరులో థాయ్ లాండ్ తో భారత్ తలపడనుంది.

పురుషుల టీమ్ విభాగంలో 2016, 2020 టోర్నీలలో భారతజట్టు కాంస్య పతకాలు మాత్రమే సాధించగలిగింది. మహిళల విభాగంలో మాత్రం తొలిసారిగా ఫైనల్స్ చేరడం ద్వారా రజత పతకం ఖాయం చేసుకోగలిగింది. ఫైనల్లో నెగ్గితే భారత మహిళాజట్టు బంగారు పతకం అందుకోగలుగుతుంది.

First Published:  18 Feb 2024 3:02 AM GMT
Next Story