Telugu Global
Sports

టీమ్ ఇండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పాక్‌తో మ్యాచ్‌కు ముందే అతనొచ్చేశాడు

శనివారం అహ్మదాబాద్ వేదికగా పాకిస్తాన్‌తో బిగ్ మ్యాచ్ జరగబోతోంది. వరల్డ్ కప్‌లో ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటేనే ఇరు దేశాల అభిమానులకు పండగే.

టీమ్ ఇండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పాక్‌తో మ్యాచ్‌కు ముందే అతనొచ్చేశాడు
X

స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు రెండు విజయాలతో దూకుడు మీద ఉన్నది. ఆసీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టాప్ ఆర్డ‌ర్‌ తడబడినా కోహ్లీ, కేఎల్ రాహుల్ వీరోచిత పోరాటంతో మ్యాచ్ గెలిచింది. ఇక బుధవారం ఢిల్లీలో ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసి.. టీమ్ ఇండియాకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచినా భారత జట్టు అభిమానులు మాత్రం ఒకరి రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఎప్పుడు వస్తాడా అని వేచి చూస్తున్నారు.

శనివారం అహ్మదాబాద్ వేదికగా పాకిస్తాన్‌తో బిగ్ మ్యాచ్ జరగబోతోంది. వరల్డ్ కప్‌లో ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటేనే ఇరు దేశాల అభిమానులకు పండగే. ఇదొక మ్యాచ్‌లా కాకుండా రెండు దేశాల మధ్య సమరంలా భావిస్తారు. వన్డే వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియాను ఇంత వరకు పాకిస్తాన్ ఓడించిన దాఖలాలే లేవు. అయితే భారత జట్టు ఓపెనింగ్ పెయిర్‌లో గిల్ మిస్ అవడంతో అభిమానులతో పాటు జట్టు మేనేజ్‌మెంట్ కూడా ఆందోళన చెందుతోంది.

వరల్డ్ కప్‌కు ముందు డెంగీ జ్వరంతో ఆసుపత్రిలో చేరిన శుభ్‌మన్ గిల్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతని స్థానంలో ఇషాన్ కిషన్‌ను తీసుకున్నా.. అనుభవం లేకపోవడంతో తడబడుతున్నాడు. దీంతో గిల్ వస్తే భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. కాగా గిల్ ప్రస్తుతం జ్వరం నుంచి కోలుకొని జట్టుతో చేరాడు. ఆఫ్గానిస్తాన్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత భారత జట్టు అహ్మదాబాద్ చేరుకున్నది. శుభ్‌మన్ గిల్ కూడా అహ్మదాబాద్‌లో జట్టుతో కలిశాడు. కీలకమైన పాక్‌తో మ్యాచ్‌కు ముందే గిల్ జట్టుతో చేరడంతో జట్టు మేనేజ్‌మెంట్ ఊపిరి పీల్చుకున్నది.

మ్యాచ్‌కు ఇంకా రెండు రోజుల సమయం ఉన్నది. అయితే జట్టుతోనే ఉన్న గిల్.. మ్యాచ్ ఆడతాడా లేదా అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. రెండు రోజుల క్రితమే చెన్నైలోని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన గిల్.. అక్కడే హోటల్‌లో ఉండిపోయాడు. తాజాగా గురువారం ఉదయం అతను అహ్మదాబాద్ చేరుకున్నాడు. ప్రస్తుతం అతడు పూర్తిగా కోలుకున్నాడని.. అయితే ఎంత మేర ఫిట్‌గా ఉన్న విషయం తెలియదని భారత జట్టు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ అన్నారు.

వన్డేల్లో ఈ ఏడాదికి అత్యధిక పరుగుల బ్యాటర్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్ అవసరం వరల్డ్ కప్‌లో ఎంతో ఉన్నది. అతను ఆడిన చివరి నాలుగు మ్యాచ్‌లలో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది 105.03 స్ట్రైక్ రేటుతో 1230 పరుగులు చేశాడు. గిల్ ఎల్లుండి పాక్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడతాడా లేదా అనేది త్వరలోనే మేనేజ్‌మెంట్ వెల్లడించనున్నది.




First Published:  12 Oct 2023 7:39 AM GMT
Next Story