Telugu Global
Sports

యువఆటగాళ్ల ప్రయోగాల వేదికగా ఇంగ్లండ్ సిరీస్!

ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐసీసీ టెస్టు లీగ్ పాంచ్ పటాకా సిరీస్ ను టాప్ ర్యాంకర్ భారత్ ప్రయోగాల వేదికగా చేసుకొని అంచనాలకు మించి ఫలితాలు సాధించింది.

యువఆటగాళ్ల ప్రయోగాల వేదికగా ఇంగ్లండ్ సిరీస్!
X

ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐసీసీ టెస్టు లీగ్ పాంచ్ పటాకా సిరీస్ ను టాప్ ర్యాంకర్ భారత్ ప్రయోగాల వేదికగా చేసుకొని అంచనాలకు మించి ఫలితాలు సాధించింది...

ఐసీసీ టెస్టు లీగ్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదుమ్యాచ్ ల సిరీస్ ను భారత్ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొంటోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో ఏమాత్రం అనుభవం లేని యువఆటగాళ్లతో ప్రయోగాలు చేస్తూ కళ్లు చెదిరే ఫలితాలను రాబట్టింది. భారత టీమ్ మేనేజ్ మెంట్ ప్రస్తుత సిరీస్ లోని మొదటి నాలుగు టెస్టుల్లో మ్యాచ్ కు ఓ కొత్త ఆటగాడిని పరిచయం చేస్తూ విరాట్ కొహ్లీ లాంటి సీనియర్ స్టార్లు లేని లోటును విజయవంతంగా పూరించుకోగలిగింది.

రజత్ పాటిదార్ నుంచి ఆకాశ్ దీప్ వరకూ...

దశాబ్దాల చరిత్ర కలిగిన భారత టెస్టు చరిత్రలో గతంలో టెస్టు అరంగేట్రం చేయాలంటే 30 సంవత్సరాలకు పైబడిన వారికి మాత్రమే అవకాశం ఉండేది. అయితే ..సచిన్ టెండుల్కర్ ఆగమనంతో భారత టెస్టు స్వరూపమే మారిపోయింది.

కేవలం 16 సంవత్సరాల చిరుప్రాయంలోనే సచిన్ టెస్టు అరంగేట్రం చేయడం ద్వారా సరికొత్త చరిత్రకు తెరతీశాడు. ఆ తరువాత నుంచి వయసుతో సంబంధం లేకుండా..ప్రతిభే ప్రాతిపదికగా డజన్ల కొద్ది ఆటగాళ్లు టెస్టు క్యాప్ లు సాధించడం, తెరమరుగైపోడం సాధారణ విషయంగా మారింది.

ప్రస్తుత 2024 ఐసీసీ టెస్టు లీగ్ సిరీస్ లో ఇంగ్లండ్ పై ఇప్పటికే నలుగురు యువఆటగాళ్లతో భారతజట్టు అరంగేట్రం చేయించగలిగింది. సిరీస్ లోని ఆఖరి టెస్టు ద్వారా మరో యువబ్యాటర్ ను బరిలోకి దింపడానికి టీ్మ్ మేనేజ్ మెంట్ కసరత్తులు చేస్తోంది.

కుర్రాళ్లకు వరంగా మారిన సీనియర్ల గాయాలు...

ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్ లోని మొదటి నాలుగు టెస్టులనూ ఐదుగురు సీనియర్ స్టార్ ఆటగాళ్లు లేకుండానే ఆతిథ్య భారతజట్టు ఆడుతూ వచ్చింది. రన్ మెషీన్ విరాట్ కొహ్లీ, రిషభ్ పంత్, మహ్మద్ షమీ, పూజారా, రహానే లాంటి ఆటగాళ్ల ప్రమేయం లేకుండానే భారత్ 3-1తో సిరీస్ కైవసం చేసుకోగలిగింది.

కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ గాయాలతో అందుబాటులో లేకున్నా..బుమ్రా, జడేజా లాంటి కీలక ఆటగాళ్ళకు తగిన విశ్రాంతి ఇస్తూనే భారతజట్టు ఆశించిన ఫలితాలు రాబట్టుకోగలిగింది.

విశాఖ వేదికగా జరిగిన రెండోటెస్టు ద్వారా రజత్ పాటిదార్ ను అరంగేట్రం చేయించిన భారత జట్టు ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. అయితే రాజకోట వేదికగా జరిగిన కీలక మూడోటెస్టుతో తమ టెస్ట్ కెరియర్ ను మొదలు పెట్టిన సరఫ్రాజ్ ఖాన్, వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ మాత్రం అంచనాలకు మించి రాణించారు.

దేశవాళీ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు సాధించిన సరఫ్రాజ్ ఖాన్ తన అరంగేట్రం టెస్టు రెండు ఇన్నింగ్స్ లోనూ హాఫ్ సెంచరీలు సాధించడం ద్వారా సత్తా చాటుకోగలిగాడు.

22 సంవత్సరాల వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ సైతం అంచనాలకు మించి రాణించాడు.

రాంచీ టెస్టులో జురెల్ షో...

రాంచీ వేదికగా ముగిసిన కీలక 4వ టెస్టు భారత వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ షోగా ముగిసింది. వికెట్ కీపర్ గా మాత్రమే కాదు..మిడిలార్డర్ బ్యాటర్ గాను జురెల్ కీలక ఇన్నింగ్స్ తో జట్టు విజయంలో ప్రధానపాత్ర వహించాడు.

తొలిఇన్నింగ్స్ లో 90 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన జురెల్..రెండో ఇన్నింగ్స్ లో నాటౌట్ గా నిలవడం ద్వారా తనజట్టుకు 5 వికెట్ల విజయంతో సిరీస్ ను ఖాయం చేయగలిగాడు. ఏకంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకోగలిగాడు.

అంతేకాదు..జస్ ప్రీత్ బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన అరంగేట్రం ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ సైతం మూడు కీలక వికెట్లతో వారేవ్వా అనిపించుకోగలిగాడు.

మొదటి నాలుగు టెస్టుల ద్వారా నలుగురు యువ క్రికెటర్లు అరంగేట్రం చేస్తే..కేవలం రజత్ పాటిదార్ మాత్రమే విఫలమయ్యాడు.

పాటిదార్ ఫ్లాప్ షో...

విశాఖ టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన మిడిలార్డర్ బ్యాటర్ రజత్ పాటిదార్ అంచనాలను అందుకోలేకపోయాడు. టీమ్ మేనేజ్ మెంట్ తగిన అవకాశాలు కల్పించినా అందిపుచ్చుకోలేకపోయాడు. మూడు టెస్టులు, 6 ఇన్నింగ్స్ లో 32 పరుగుల అత్యధిక స్కోరు మాత్రమే సాధించగలిగాడు. 9, 5, 9, 17, 0 స్కోర్లతో దారుణంగా విఫలమయ్యాడు.

ధర్మశాల వేదికగా మార్చి 7న ప్రారంభంకానున్న ఆఖరి టెస్టు తుదిజట్టు నుంచి పాటిదార్ ను తప్పించి మరో యువబ్యాటర్ దేవదత్ పడిక్కల్ తో అరంగేట్రం చేయించాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది.

టాప్ గేర్ లో దేవదత్ పడిక్కల్..

కర్నాటక యువబ్యాటర్ దేవదత్ పడిక్కల్ తనవంతు కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుత సీజన్ రంజీ ట్రోఫీలో పరుగుల హోరు, సెంచరీల జోరుతో చెలరేగడం ద్వారా 23 ఏళ్ళ పడిక్కల్ భారత టెస్టుజట్టులో చోటు సంపాదించగలిగాడు.

తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన 31 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో పడిక్కల్ 44.54 సగటుతో 2227 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ప్రస్తుత 2024 రంజీ సీజన్ మ్యాచ్ ల్లో పడిక్కల్ ఆరు ఇన్నింగ్స్ లో 3 శతకాలు బాదాడు. 4 మ్యాచ్ ల్లో 556 పరుగులతో 92.66 సగటు నమోదు చేశాడు. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో పడిక్కల్ అత్యధికంగా 193 పరుగుల స్కోరు సాధించగలిగాడు.

మిడిలార్డర్ బ్యాటర్ రాహుల్ అందుబాటులో లేకపోడం, పాటిదార్ వరుస వైఫల్యాల కారణంగా..ఆఖరి టెస్టు తుదిజట్టులో పడిక్కల్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

ధర్మశాల టెస్టు ద్వారా దేవదత్ పడిక్కల్ టెస్టు అరంగేట్రం చేయటం తథ్యమని భావిస్తున్నారు. అదే జరిగితే ఐదుటెస్టుల సిరీస్ లో ఐదుగురు భారత యువక్రికెటర్లు టెస్టు క్యాప్ లు అందుకొన్నట్లు అవుతుంది.

ఇంగ్లండ్ లాంటి పవర్ ఫుల్ జట్టుపైన ఐదుగురు యువఆటగాళ్లతో టెస్టు అరంగేట్రం చేయించిన చీప్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలను అభినందించి తీరకతప్పదు.

First Published:  1 March 2024 10:54 AM GMT
Next Story