Telugu Global
Sports

ప్రపంచ చెస్ చాలెంజర్ రేస్ లో ఐదుగురు భారత గ్రాండ్మాస్టర్లు!

ప్రపంచ చెస్ పురుషుల, మహిళల టైటిల్ వేటలో తొలిసారిగా ఐదుగురు భారత గ్రాండ్మాస్టర్లు నిలిచారు. కెనడా వేదికగా ఈ రోజు నుంచి మూడువారాలపాటు సాగే కాండిడేట్స్ టోర్నీ పురుషుల విభాగంలో ముగ్గురు, మహిళల విభాగంలో ఇద్దరు భారత గ్రాండ్మాస్టర్లు తలపడనున్నారు.

ప్రపంచ చెస్ చాలెంజర్ రేస్ లో ఐదుగురు భారత గ్రాండ్మాస్టర్లు!
X

ప్రపంచ చెస్ పురుషుల, మహిళల టైటిల్ వేటలో తొలిసారిగా ఐదుగురు భారత గ్రాండ్మాస్టర్లు నిలిచారు. కెనడా వేదికగా ఈ రోజు నుంచి మూడువారాలపాటు సాగే కాండిడేట్స్ టోర్నీ పురుషుల విభాగంలో ముగ్గురు, మహిళల విభాగంలో ఇద్దరు భారత గ్రాండ్మాస్టర్లు తలపడనున్నారు.

అష్టగ్రాండ్మాస్టర్ల సమరం....

ప్రపంచ చదరంగ టైటిల్ కోసం ప్రస్తుత చాంపియన్, చైనా సూపర్ గ్రాండ్మాస్టర్ డింగ్ లిరెన్ తో తలపడే ఆటగాడి కోసం టొరాంటో వేదికగా నేటినుంచి మూడువారాలపాటు..ప్రపంచ మేటి ఎనిమిదిమంది గ్రాండ్మాస్టర్ల నడుమ పోటీ జరుగనుంది. ఈ ఎనిమిది మంది నుంచే చాలెంజర్ ఎవరో తేలిపోనుంది.

ప్రపంచ చెస్ చరిత్రలో ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన విశ్వనాథన్ ఆనంద్ కు వారసులుగా ప్రస్తుతం ముగ్గురు యువగ్రాండ్మాస్టర్లు తెరమీదకు వచ్చారు. ఏప్రిల్ 3 నుంచి 22 వరకూ జరిగే ఈ క్యాండిడేట్స్ సమరంలో ప్రజ్ఞానంద్, గుకేశ్, విదిత్ గుజరాతీ బరిలో నిలిచారు.

ప్రపంచ చెస్ క్యాండిడేట్స్ టోర్నీ బరిలో ముగ్గురు భారత గ్రాండ్మాస్టర్లు పోటీకి దిగడం ఇదే మొదటిసారి.

మహిళల విభాగంలో హంపి, వైశాలీ...

మహిళల క్యాండిడేట్స్ టోర్నీలో తలపడుతున్న ఎనిమిది మంది గ్రాండ్మాస్టర్లలో భారతజోడీ కోనేరు హంపి, వైశాలీ సైతం ఉన్నారు. ప్రపంచ చెస్ సమాఖ్య ర్యాంకింగ్స్ ప్రకారం హంపీ, వైశాలీ మాత్రమే క్యాండిడేట్స్ రేస్ లో నిలువగలిగారు.

ప్రపంచ మహిళా చెస్ విజేతగా చైనా గ్రాండ్మాస్టర్ వెన్ జున్ ప్రస్తుత చాంపియన్ గా ఉంది. 36 సంవత్సరాల కోనేరు హంపితో పాటు..22 ఏళ్ల వైశాలీ సైతం క్యాండిడేట్స్ సమరానికి పూర్తిస్థాయిలో సిద్ధమై వచ్చారు.

హాట్ ఫేవరెట్ గా ఫేబియానో...

పురుషుల విభాగంలో మొత్తం ఎనిమిది ఆటగాళ్ల సమరాన్ని డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ ఫార్మాట్లో నిర్వహిస్తారు. ఒక్కో ఆటగాడు మూడువారాల వ్యవధిలో 14 రౌండ్లు ఆడాల్సి ఉంది. అమెరికా గ్రాండ్మాస్టర్ ఫేబియానో కరూనాను హాట్ ఫేవరెట్ గా పరిగణిస్తున్నారు.

ఇతర ప్రముఖ గ్రాండ్మాస్టర్లలో హికారు నకమురా, రష్యాకు చెందిన నెపోమన్చి, ఫ్రాన్స్ కు చెందిన అలీరెజా ఫిరూజా ఉన్నారు. ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ మాగ్నుస్ కార్ల్ సన్ మాత్రం క్యాండిడేట్స్ టోర్నీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించాడు.

1990లో తొలిసారిగా విశ్వనాథన్ ఆనంద్ కాండిడేట్స్ రౌండ్ కు అర్హత సాధించాడు. ఆ తరువాత నుంచి 2014 వరకూ ప్రతిసారీ క్యాండిడేట్స్ టోర్నీ బరిలో నిలుస్తూ వచ్చాడు.

ఫిడే తాజా ర్యాంకింగ్స్ ప్రకారం ప్రజ్ఞానంద్ 2747 పాయింట్లతో ప్రపంచ 14వ ర్యాంకులోనూ, గుకేశ్ 2743 పాయింట్లతో 16వ ర్యాంకులోనూ, విదిత్ గుజరాతీ 2727 పాయింట్లతో 25వ ర్యాంక్ లో కొనసాగుతున్నారు.

18 సంవత్సరాల ప్రజ్ఞానంద్, 17 ఏళ్ల గుకేశ్, 29 ఏళ్ళ గ్రాండ్ మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాతీ తొలిసారిగా క్యాండిడేట్స్ టోర్నీలో తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు.

ప్రపంచ చాంపియన్ రన్నరప్ ఇయాన్ నెపోమినిచీ, ప్రపంచ రెండోర్యాంక్ ఆటగాడు ఫేబియానో కరూనా, 3వ ర్యాంకర్ హికారు నకమురా, 20 సంవత్సరాల అలీరెజాలకు భారత గ్రాండ్మాస్టర్ల త్రయం ఏమాత్రం పోటీ ఇవ్వగలరన్నది ఆసక్తికరంగా మారింది.

చదరంగ నవశక్తి భారత్...

గత 25 సంవత్సరాల కాలంలో భారత్ ప్రపంచ చదరంగ సూపర్ పవర్ గా అవతరించింది. 1988 నుంచి 2013 మధ్యకాలంలో భారత్ అంతైఇంతై అంతింతై అన్నట్లుగా ఎదిగిపోయింది.

గత దశాబ్దకాలంలో 50 మంది గ్రాండ్మాస్టర్లను ప్రపంచ చదరంగానికి అందించిన ఘనత భారత్ కు మాత్రమే దక్కుతుంది. ప్రపంచ క్యాండిడేట్స్ టోర్నీలో పాల్గొంటున్న ఎనిమిదిమంది మేటి ఆటగాళ్లలో ముగ్గురు మనదేశానికే చెందిన వారు కావడం భారత చదరంగానికే గర్వకారణం.

First Published:  3 April 2024 6:07 AM GMT
Next Story