Telugu Global
Sports

తెలుగు రాష్ట్ర్రాల బాక్సర్ పైనే భారత్ 'బంగారు' ఆశలు!

పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే భారత బాక్సింగ్ జట్టుకు తెలుగు రాష్ట్ర్రాల బాక్సర్ ఆశాకిరణంగా మారింది. 50 కిలోల విభాగంలో పతకం ఆశలు రేపుతోంది.

తెలుగు రాష్ట్ర్రాల బాక్సర్ పైనే భారత్ బంగారు ఆశలు!
X

పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనే భారత బాక్సింగ్ జట్టుకు తెలుగు రాష్ట్ర్రాల బాక్సర్ ఆశాకిరణంగా మారింది. 50 కిలోల విభాగంలో పతకం ఆశలు రేపుతోంది.

ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా మరి కొద్దివారాలలో ప్రారంభం కానున్న 2024- ఒలింపిక్స్ లో పాల్గొనే భారత బాక్సింగ్ జట్టుకు తెలంగాణా స్టార్ బాక్సర్, 27 ఏళ్ల నిఖత్ జరీన్ పెద్దదిక్కుగా మారింది. ఇప్పటి వరకూ పురుషుల విభాగంలో భారత్ కు చెందిన ఒక్క బాక్సరూ అర్హత సాధించలేకపోడంతో..మహిళా బాక్సర్లపైనే భారత్ పతకం ఆశలు కేంద్రీకృతమయ్యాయి.

50 కిలోల విభాగంలో ....

మహిళల 50 కిలోల విభాగంలో రెండుసార్లు విశ్వవిజేత నిఖత్ జరీన్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. భారత్ కు ఏదో ఒక పతకం సాధించి పెట్టగల సత్తా కేవలం నిఖత్ జరీన్ కు మాత్రమే ఉంది.

టోక్యో ఒలింపిక్స్ మహిళల 75 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించిన లవ్లీనా బోర్గెయిన్ తోపాటు 54 కిలోల విభాగంలో ప్రీతీ పవార్, 57 కిలోల విభాగంలో ప్ర్రవీణ్ హుడా సైతం పారిస్ ఒలింపిక్స్ పతకం వేటకు దిగుతున్నారు.

థాయ్ లాండ్ వేదికగా మే 25 నుంచి జూన్ 2 వరకూ జరిగే ప్రపంచ ( ఒలింపిక్ ) అర్హత పోటీలు భారత బాక్సర్లకు ఆఖరి అవకాశం కానున్నాయి.

బంగారు పతకమే లక్ష్యంగా....

భారత మహిళా బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ రిటైర్మెంట్ తరువాత..ఖచ్చితంగా పతకం సాధించగల సత్తా నిఖత్ జరీన్ కు మాత్రమే ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే తన కెరియర్ లో రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్ బంగారు పతకాలు సాధించిన నిఖత్ గత ఆసియాక్రీడల్లో కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

పారిస్ ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించాలన్న లక్ష్యంతో గత కొద్దిమాసాలుగా తాను సాధన చేస్తున్నట్లు తెలంగాణాలోని నిజామాబాద్ కు చెందిన నిఖత్ చెప్పింది.

తనకు గెలుపు, ఓటమి సమానమేనని, ప్రతి ఓటమి తనకు ఓ విలువైన పాఠమని, లోపాలు సవరించుకొని మెరుగైన ఆటతీరుతో ఒలింపిక్స్ పతకం సాధించడమే తన లక్ష్యమని తెలిపింది.

ఎలాంటి అంచనాలు లేకుండా, ఒత్తిడి రానివ్వకుండా బరిలోకి దిగటమే తన వ్యూహమని వివరించింది. మే 12 నుంచి 19 వరకూ కజకిస్థాన్ వేదికగా జరిగే ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నీలో పాల్గొన్న అనంతరం శిక్షణ కోసం జర్మనీకి వెళ్లనున్నట్లు నిఖత్ తెలిపింది. జర్మనీ లో శిక్షణతో నేరుగా పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొంటానని తన సన్నాహాల గురించి వివరించింది.

ఇప్పటి వరకూ పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొనటానికి కనీసం ఒక్క భారత పురుష బాక్సర్ అర్హత సాధించకపోడం తనకు బాధకలిగించిందని చెప్పింది. రెండు బెర్త్ లు భారత పురుష బాక్సర్ల కోసం సిద్ధంగా ఉన్నాయని, థాయ్ టోర్నీలో వాటిని దక్కించుకోవాల్సిన బాధ్యత మన బాక్సర్ల పైనే ఉందని తెలిపింది.

పారిస్ ఒలింపిక్స్ జులై 26 నుంచి ఆగస్టు 11 వరకూ జరుగనున్నాయి. 204 దేశాలకు చెందిన 10వేల మంది అథ్లెట్లు 32 రకాల క్రీడల్లోతలపడబోతున్నారు.

First Published:  9 May 2024 11:24 AM GMT
Next Story