Telugu Global
Sports

ఆసియాక్రీడల హాకీలో భారత్ మరో భారీగెలుపు!

ఆసియాక్రీడల హాకీ గ్రూప్ లీగ్ లో టాప్ ర్యాంకర్ భారత్ వరుసగా రెండో భారీవిజయం సాధించింది. సింగపూర్ ను 16-1 గోల్స్ తో చిత్తు చేసి నాకౌట్ రౌండ్ కు మరింత చేరువయ్యింది.

ఆసియాక్రీడల హాకీలో భారత్ మరో భారీగెలుపు!
X

ఆసియాక్రీడల హాకీలో భారత్ మరో భారీగెలుపు!

ఆసియాక్రీడల హాకీ గ్రూప్ లీగ్ లో టాప్ ర్యాంకర్ భారత్ వరుసగా రెండో భారీవిజయం సాధించింది. సింగపూర్ ను 16-1 గోల్స్ తో చిత్తు చేసి నాకౌట్ రౌండ్ కు మరింత చేరువయ్యింది.

ఆసియాక్రీడల హాకీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత్ స్థాయికి తగ్గట్టుగా ఆడుతూ భారీవిజయాలతో దూసుకుపోతోంది. హాంగ్జు లోని గాంగ్జు షు కెనాల్ స్పోర్ట్స్ పార్క్ స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్-ఏ లీగ్ రెండోరౌండ్ మ్యాచ్ లో ప్రపంచ 3వ ర్యాంకర్ భారత్ 16-1 గోల్స్ తో సింగపూర్ ను చిత్తు చేసింది.

అరుదైన రికార్డు...

ఆసియాక్రీడల హాకీలో వరుసగా రెండుమ్యాచ్ ల్లో 16 గోల్స్ చొప్పున సాధించిన తొలిజట్టుగా భారత్ నిలిచింది. లీగ్ ప్రారంభమ్యాచ్ లో ఉజ్బెకిస్థాన్ ను 16-0 గోల్స్ తో ఊదిపారేసిన భారత్ రెండోరౌండ్లోనూ సింగపూర్ పై అదేజోరు కొనసాగించింది.

ఏకపక్షంగా సాగిన ఈ పోరులో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ నాలుగు గోల్స్ సాధిస్తే..మిడ్ ఫీల్డర్ మన్ దీప్ సింగ్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. భారత్ ఆడిందే ఆటగా సాగిన ఈ పోటీలో మన్ దీప్ సింగ్ ఆట 12, 30, 51 నిముషాలలో గోల్స్ నమోదు చేస్తే..కెప్టెన్ కమ్ పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్ హర్మన్ ప్రీత్ సింగ్ ఆట 24, 39, 40, 42 నిముషాలలో గోల్స్ సాధించాడు.

ఆట 16వ నిముషంలో లలిత్ ఉపాధ్యాయ, 22వ నిముషంలో గుర్జంత్ సింగ్, 23వ నిముషంలో వివేక్ ప్రసాద్, 37వ నిముషంలో మన్ ప్రీత్ సింగ్, 38వ నిముషంలో షంషేర్ సింగ్, 51, 52 నిముషాలలో అభిషేక్, వరుణ్ కుమార్ 55, 56 నిముషాలలో గోల్స్ సాధించడంతో భారత్ కు ఎదురేలేకపోయింది.

సింగపూర్ తరపున ఆట 55వ నిముషంలో మహ్మద్ జకీ బిన్ జుల్కారియన్ ఒకే ఒక్కగోలు సాధించగలిగాడు.

గ్రూప్ -ఏ ప్రారంభమ్యాచ్ లో పాకిస్థాన్ చేతిలో 11-0 గోల్స్ తో ఓటమి పొందిన సింగపూర్ కు భారత్ చేతిలో అంతకుమించిన ఘోరపరాజయం తప్పలేదు.

ప్రపంచ హాకీ ర్యాంకింగ్స్ 49వ స్థానంలో ఉన్న సింగపూర్..3వ ర్యాంకర్ భారత్ కు ఏ విధంగాను సరిజోడీ కాలేకపోయింది. ఆట మొదటి భాగానికే 6-0తో పైచేయి సాధించిన భారత్ ..రెండోభాగంలో 10 గోల్స్ తో చెలరేగిపోయింది.

గురువారం జరిగే గ్రూప్ - ఏ మూడోరౌండ్ పోటీలో గత ఏషియాడ్ గోల్డ్ మెడలిస్ట్ జపాన్ తో భారత్ తలపడనుంది.

First Published:  26 Sep 2023 5:33 AM GMT
Next Story