Telugu Global
Sports

ప్రపంచకప్ కు భారతజట్టు ఎంపిక అలాజరిగింది!

2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కు 15మంది సభ్యుల భారతజట్టు ఎంపిక పై మిశ్రమస్పందన వ్యక్తమయ్యింది. పేస్ బౌలింగ్ కూర్పు పేలవంగా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

ప్రపంచకప్ కు భారతజట్టు ఎంపిక అలాజరిగింది!
X

2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కు 15మంది సభ్యుల భారతజట్టు ఎంపిక పై మిశ్రమస్పందన వ్యక్తమయ్యింది. పేస్ బౌలింగ్ కూర్పు పేలవంగా ఉందంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

పదకొండు సంవత్సరాల విరామం తరువాత ఐసీసీ ప్రపంచకప్ గెలుచుకోవాలని కలలు కంటున్న భారత్..మరో రెండుమాసాలలో జరుగనున్న 2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ కు గురిపెట్టింది. 2007 ప్రారంభ టీ-20 ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన భారత్ మరో ప్రపంచకప్ కోసం చకోరపక్షిలా ఎదురుచూస్తోంది.

వెస్టిండీస్, అమెరికా దేశాల సంయుక్త ఆతిథ్యంలో జూన్ 2 నుంచి మూడువారాలపాటు జరుగనున్న ఈ టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యుల జట్టును బీసీసీఐ ఎంపిక సంఘం ప్రకటించిన కొద్దిగంటల వ్యవధిలోనే జట్టు కూర్పుపై పలువురు మాజీ దిగ్గజాలు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

పాపం! శుభ్ మన్ గిల్, రింకూ సింగ్....

టీ-20ప్రపంచకప్ లో పాల్గొనే భారతజట్టులో యువఓపెనర్ శుభ్ మన్ గిల్ కు చోటు దక్కక పోడం దురదృష్టకరం మాత్రమే కాదు..స్వయంకృతాపరాదం అంటూ భారత మాజీ కెప్టెన్, విశ్వవిఖ్యాత క్రికెట్ వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ తేల్చి చెప్పారు.

భారత క్రికెట్లో ప్రస్తుతం అత్యంత ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఎక్కువగా ఉండటంతో శుభ్ మన్ గిల్, రింకూ సింగ్ లాంటి కొందరికి చోటు దక్కకపోడం సహజమేనని గవాస్కర్ అభిప్రాయపడ్డారు.

ప్రపంచకప్ కు రెండు పవర్ ఫుల్ జట్లను పంపే శక్తి ప్రస్తుత భారత క్రికెట్ కు ఉందని, 25 మంది ప్రతిభావంతుల నుంచి 15 మంది సభ్యులజట్టును ఎంపిక చేయడం కత్తిమీద సాము లాంటిదేనని అన్నారు.

23 సంవత్సరాల గిల్ కు టీ-20 ఫార్మాట్లో 320 పరుగులు, 34.56 సగటు, 140.97 స్ట్ర్రయిక్ రేట్ ఉన్నా..ప్రస్తుత ఐపీఎల్ ఫామ్ మాత్రం స్థాయికి తగ్గట్టుగా లేదని, గత నాలుగు మ్యాచ్ ల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా గిల్ సాధించలేకపోయాడని గవాస్కర్ గుర్తు చేశారు.

స్థాయికి తగ్గట్టుగా ఫామ్ లో లేకపోడమే గిల్ కు శాపంగా మారిందని, ప్రపంచకప్ కు ఎంపిక కాలేకపోయాడని వివరించారు.

రింకూ సింగ్ దీ అదేసీన్...

మ్యాచ్ ఫినిషర్ గా గత ఏడాది వరకూ అదరగొట్టిన కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు రింకూ సింగ్ సైతం భారతజట్టులో చోటు దక్కించుకోడంలో విఫలమయ్యాడు.

రింకూ సింగ్ స్థానాన్ని చెన్నై ఫ్రాంచైజీ ఆటగాడు శివం దూబే తన్నుకుపోయాడు.

2023 ఐపీఎల్ సీజన్లో కోల్ కతా తరపున సత్తా చాటుకోడం ద్వారా భారత టీ-20 జట్టులో చోటు సంపాదించిన రింకూ సింగ్ 474 పరుగులు సాధించాడు. భారత్ తరపున ఆడిన మొత్తం 15 మ్యాచ్ ల్లో 356 పరుగులతో 89 సగటు నమోదు చేశాడు. 176 స్ట్ర్రయిక్ రేటుతో వారేవ్వా అనిపించుకొన్నాడు. అయితే ..ప్రస్తుత 2024 సీజన్లో రింకూసింగ్ ఆటతీరు నాసిరకంగా తయారయ్యింది. చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేకపోయాడు. దీంతో అంతంత మాత్రం ఫామ్ లో ఉన్న రింకూను కాదని..శివం దూబేకు ఎంపిక సంఘం పట్టం కట్టింది.

పేస్ బౌలింగ్ లో పదునేది- మదన్ లాల్..

రోహిత్ శర్మ నాయకత్వంలో ప్రపంచకప్ కు ఎంపికైన 15 మంది సభ్యుల భారతజట్టు బ్యాటింగ్, స్పిన్ విభాగాలలో పటిష్టంగా ఉన్నా..పేస్ బౌలింగ్ విభాగంలో మాత్రం తేలిపోయేలా కనిపిస్తోందని..భారత మాజీ ఆల్ రౌండర్ మదన్ లాల్ చెప్పారు.

బుమ్రా, అర్షదీప్, పాండ్యా, సిరాజ్ లతో కూడిన భారత పేస్ ఎటాక్ లో నమ్మదగిన బౌలర్ కేవలం బుమ్రా మాత్రమేనని, మిగిలిన పేసర్లంతా గాల్లో దీపం లాంటి వారేనని అన్నారు.

అర్షదీప్ కు డెత్ ఓవర్లలో భారీగా పరుగులిచ్చే బలహీనత ఉందని, సిరాజ్ ప్రస్తుతం నమ్మదగిన బౌలర్ గా ఏమాత్రం కనిపించడం లేదని తేల్చి చెప్పారు. హార్ధిక్ పాండ్యాను నమ్ముకోడం కుంటిగుర్రం మీద పందెం కట్టడం లాంటిదేనని చెప్పారు.

భారత్ విశ్వవిజేతగా నిలవాలంటే పేస్ బౌలింగ్ పటిష్టంగా ఉండాలని మదన్ లాల్ సూచించారు.

జూన్ 2న ప్రారంభంకానున్న ప్రపంచకప్ గ్రూప్- ఏ లీగ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో పాటు ఐర్లాండ్, కెనడా, అమెరికా జట్లతో భారత్ తలపడాల్సి ఉంది. భారత్ తన ప్రారంభమ్యాచ్ ను జూన్ 5న ఐర్లాండ్ తో ఆడాల్సి ఉంది.

First Published:  1 May 2024 8:16 AM GMT
Next Story