Telugu Global
Science and Technology

పెరుగుతున్న ‘విషింగ్’ సైబర్ స్కామ్‌లు.. జాగ్రత్తలు ఇలా..

జనాన్ని మోసం చేసి డబ్బు కాజేయడం కోసం రకరకాల ప్లాన్స్ వేస్తుంటారు సైబర్ నేరగాళ్లు. తాజాగా ‘విషింగ్’ అనే కొత్త రకమైన స్కామ్‌కు తెరలేపారు.

పెరుగుతున్న ‘విషింగ్’ సైబర్ స్కామ్‌లు.. జాగ్రత్తలు ఇలా..
X

పెరుగుతున్న ‘విషింగ్’ సైబర్ స్కామ్‌లు.. జాగ్రత్తలు ఇలా..

జనాన్ని మోసం చేసి డబ్బు కాజేయడం కోసం రకరకాల ప్లాన్స్ వేస్తుంటారు సైబర్ నేరగాళ్లు. తాజాగా ‘విషింగ్’ అనే కొత్త రకమైన స్కామ్‌కు తెరలేపారు. విషింగ్ అంటే ‘వాయిస్ ఫిషింగ్’ అని అర్థం. అంటే వాయిస్‌ను ఇమిటేట్ చేయడం ద్వారా మోసం చేయడం అన్నమాట. ఇదెలా ఉంటుందంటే..

విషింగ్ అనేది తాజాగా వెలుగులోకి వచ్చిన కొత్తరకమైన సైబర్ స్కామ్. ఈ స్కామ్‌లో సైబర్ నేరగాళ్లు ప్రముఖ కంపెనీలను ఇమిటేట్ చేస్తూ మోసం చేసే ప్రయత్నం చేస్తారు. ఉదాహరణకు మీరు వాడుతున్న బ్యాంక్ నుంచి కాల్ వచ్చినట్టు, మీరు పనిచేస్తున్న సంస్థ నుంచి హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్ వాళ్లు కాల్ చేసినట్టు లేదా మీ ఏరియా ప్రభుత్వ అధికారులమంటూ.. ఇలా గుర్తు పట్టలేని విధంగా వాయిస్ కాల్స్‌తో మోసగిస్తారు. బ్యాంక్ లేదా గవర్నమెంట్‌కు సంబంధించిన కాలర్ ట్యూన్స్ ప్లే చేస్తూ.. నిజంగా అక్కడ్నుంచే కాల్ వచ్చిందన్నట్టు నమ్మిస్తారు. దీనికోసం ‘వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్’ టెక్నాలజీని ఉపయోగిస్తారు.

ఇలాంటి మోసపూరితమైన కాల్స్ చేసి వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు. లింక్ పంపి వాటిని క్లిక్ చేసి బ్యాంక్ వివరాలు నమోదుచేయమని కోరతారు లేదా ప్రభుత్వ స్కీమ్స్ కోసం బ్యాంక్ అకౌంట్‌ లింక్ చేయాలంటారు. అలా ఆ లింక్ ద్వారా ఎంటర్ చేసిన వివరాలతో బ్యాంక్ అకౌంట్‌ను ఖాళీ చేస్తారు. కొన్ని సార్లు ఓటీపీ, క్రెడిట్ కార్డు వివరాలు కూడా అడుగుతారు. అది నిజమని నమ్మితే నిండా మోసపోయినట్టే.

జాగ్రత్తలు ఇలా..

ఏ రకమైన సైబర్ స్కామ్ నుంచైనా తప్పించుకునేందుకు ఒక్కటే దారి. అదే వ్యక్తిగత వివరాలు షేర్ చేయకుండా ఉండడం. ఎలాంటి లింక్‌లు క్లిక్ చేయకుండా, ఓటీపీ, కార్డు పిన్, క్రెడిట్ కార్డు వివరాలు, సీవీవీ వంటి వివరాలు ఎవరితోనూ షేర్ చేసుకోకుండా ఉన్నంత వరకూ సైబర్ స్కామ్స్‌ వలలో పడే వీలుండదు. ప్రభుత్వ అధికారులు ఏదైనా వెరిఫికేషన్ కోసం ఇంటికొచ్చి అడిగితే తప్ప ఎవరికీ వ్యక్తిగత వివరాలు ఇవ్వకూడదు. ముఖ్యంగా కాల్స్‌లో ఎవరినీ నమ్మడానికి లేదు. ఓటీపీ, సీవీవీ, కార్డు నెంబర్ వంటి వివరాలను ఏ చట్టబద్ధమైన సంస్థ అడగదని గుర్తుంచుకోవాలి.

వ్యక్తిగత వివరాలు అడుగుతూ కాల్స్ వస్తే.. వెంటనే కాల్ కట్ చేసి బ్యాంక్ లేదా నెట్‌వర్క్ ప్రొవైడర్‌కు రిపోర్ట్ చేయాలి. డబ్బు నష్టపోతే వెంటనే సైబర్ పోలీసులకు కంప్లెయింట్ ఇవ్వాలి. లేదా 1930 కి కాల్ చేయొచ్చు. అలాగే మీకు తెలియకుండా ఏవైనా ట్రాన్సాక్షన్లు జరిగాయోమో అప్పుడప్పుడు చెక్ చేసుకుంటుండాలి.

First Published:  27 Oct 2023 4:30 AM GMT
Next Story