Telugu Global
NEWS

ఎన్నికల కంటే ముందే హరిహర వీరమల్లు రిలీజ్.. ఏఎం రత్నం క్లారిటీ

ప్రస్తుతం ఏఎం రత్నం రూల్స్ రంజన్ అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన హరిహర వీరమల్లు విడుదలపై మాట్లాడాడు.

ఎన్నికల కంటే ముందే హరిహర వీరమల్లు రిలీజ్.. ఏఎం రత్నం క్లారిటీ
X

పవన్ కళ్యాణ్ హీరోగా పీరియాడిక్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో ప్రారంభమైన సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాకు క్రిష్ దర్శకుడు. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం, దయాకర్ రావు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ మూడేళ్ల కిందటే ప్రారంభమైనప్పటికీ సినిమా నిర్మాణం ఇప్పటికీ పూర్తికాలేదు. ఈ మూవీ కంటే ఆలస్యంగా మొదలైన పవన్ సినిమాలు వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలు ఇప్పటికే విడుదల అయ్యాయి.

అలాగే ఇటీవల మొదలైన ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్నాయి. దీంతో ఇక హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఆగిపోయినట్లేనని ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే మొన్న పవన్ బర్త్ డే సందర్భంగా హరిహర వీరమల్లు చిత్ర బృందం ఒక కొత్త పోస్టర్ ను అభిమానులతో పంచుకుంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా నుంచి టీజర్ కాకుండా జస్ట్ పోస్టర్ మాత్రమే విడుదల కావడంతో ఇప్పటికిప్పుడు ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యే అవకాశం లేదని అందరూ భావించారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్, విడుదల తేదీ గురించి నిర్మాత ఏఎం రత్నం క్లారిటీ ఇచ్చాడు.

ప్రస్తుతం ఏఎం రత్నం రూల్స్ రంజన్ అనే సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ మూవీకి సంబంధించి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన హరిహర వీరమల్లు విడుదలపై మాట్లాడాడు. ఆ మూవీని పీరియాడిక్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నామని చెప్పాడు. ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ డేట్లు ఇచ్చినప్పటికీ ఈ సినిమాను పూర్తి చేయడం కష్టమని తెలిపాడు. ఎందుకంటే ఈ సినిమా రెగ్యులర్ మూవీ కాదని, ఇందుకోసం పెద్దపెద్ద సెట్లు వేయాల్సి ఉంటుందని, గ్రాఫిక్స్ వర్క్ కూడా చాలా ఉంటుందని చెప్పాడు.

అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కూడా రాజకీయంగా బిజీగా ఉన్నాడని, త్వరగా పూర్తయ్యే సినిమాలపైనే ఆయన దృష్టి పెట్టాడని చెప్పుకొచ్చాడు. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఈ ఏడాది ఆఖరుకల్లా పూర్తి చేసి వీఎఫ్ ఎక్స్ పనులు మొదలు పెడతామని, ఎన్నికల కంటే ముందే హరిహర వీరమల్లు మూవీని విడుదల చేస్తామని ఏఎం రత్నం తెలిపాడు. ఈ సినిమా షూటింగ్ ఆగిపోయినట్లేనని ఫ్యాన్స్ భావిస్తున్న నేపథ్యంలో హరిహర వీరమల్లు లైన్ లోనే ఉందని, సమ్మర్ కల్లా విడుదల అయ్యే అవకాశం ఉందని తెలియడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  4 Sep 2023 12:29 PM GMT
Next Story