Telugu Global
National

అమిత్ షా చెబితే ఉద్యమం ఆపేస్తామా..? రెజ్లర్ల ఘాటు స్పందన

రెజ్లర్ల ఉద్యమం కొనసాగుతుందన్నారు సాక్షి మలిక్. ఉద్యమం నుంచి తాను తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఓ వైపు నిరసన తెలుపుతూనే రైల్వేలో తన విధులు నిర్వహించడానికి నిర్ణయించుకున్నానని చెప్పారు.

అమిత్ షా చెబితే ఉద్యమం ఆపేస్తామా..? రెజ్లర్ల ఘాటు స్పందన
X

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో రెజ్లర్లు సమావేశమయ్యారనే వార్తలు బయటకొచ్చిన తర్వాత వారి ఉద్యమం విషయంలో కూడా రకరకాల పుకార్లు మొదలయ్యాయి. అమిత్ షా మాటలతో వారు నిరసన కార్యక్రమాలను విరమించుకున్నారని వార్తలొచ్చాయి. అందుకే వారు తిరిగి ఉద్యోగాల్లో చేరుతున్నారని కూడా అన్నారు. ఈ వార్తలపై రెజ్లర్లు ఘాటుగా స్పందించారు. తాము ఉద్యమం ఆపలేదని, ఆ వార్తలన్నీ అవాస్తవం అంటూ రెజ్లర్ సాక్షి మలిక్ ట్వీట్ చేశారు.

రెజ్లర్ల ఉద్యమం కొనసాగుతుందన్నారు సాక్షి మలిక్. ఉద్యమం నుంచి తాను తప్పుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఓ వైపు నిరసన తెలుపుతూనే రైల్వేలో తన విధులు నిర్వహించడానికి నిర్ణయించుకున్నానని చెప్పారు. సాక్షి మలిక్ నార్తర్న్ రైల్వేస్ లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం చేస్తున్నారు. నిరసనల వల్ల ఆమె ఇటీవల విధులకు హాజరు కాలేదు. అమిత్ షా తో మీటింగ్ తర్వాత ఆమె విధులకు హాజరవుతున్నట్టు ప్రకటించగా, ఆమె ఉద్యమం నుంచి పక్కకు తప్పుకుందని మీడియాలో వార్తలొచ్చాయి. దీంతో సాక్షి మలిక్ వివరణ ఇచ్చారు. ఉద్యోగం చేస్తూనే తాను ఉద్యమం చేస్తానన్నారు.


బజరంగ్ పునియా, ఫోగట్‌ సిస్టర్స్ కూడా ఉద్యమాన్ని కొనసాగించేందుకే మొగ్గు చూపారు. శనివారం రాత్రి రెజ్లర్లు భజరంగ్ పునియా, సాక్షి మలిక్, సంగీతా ఫోగట్, సత్యవర్త్ కడియన్‌.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిశారు. అనంతరం వారిలో కొందరు పోరాటాన్ని విరమించుకుంటున్నారని వార్తలు వచ్చాయి. దీంతో రెజ్లర్లు అవన్నీ తప్పుడు ప్రచారాలంటూ మండిపడ్డారు. ఆ వార్తల్ని ఖండించారు. న్యాయపోరాటంలో తాము ఎప్పుడూ వెనక్కి తగ్గలేదన్నారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

First Published:  5 Jun 2023 2:18 PM GMT
Next Story