Telugu Global
National

నా భార్య, బిడ్డను దోమలు కుడుతున్నాయ్.. సహాయం చేయండి.. పోలీసులకు యువకుడి ఫిర్యాదు

'దోమల వల్ల నా భార్య తీవ్ర ఇబ్బంది పడుతోంది. పసికందు ఏడుస్తోంది. వారి బాధ చూడలేకపోతున్నాను. దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపించండి' అని అసద్ ట్వీట్ చేశాడు.

నా భార్య, బిడ్డను దోమలు కుడుతున్నాయ్.. సహాయం చేయండి.. పోలీసులకు యువకుడి ఫిర్యాదు
X

నా భార్య, నవజాత శిశువు అయిన నా బిడ్డను దోమలు కుడుతున్నాయని.. సహాయం చేయాలని ఓ యువకుడు చేసిన ట్వీట్ కు యూపీ పోలీసులు స్పందించారు. వారు ఉన్న ఆస్పత్రికి వెళ్లి మస్కిటో కాయిల్ అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంభల్ జిల్లా చంద్ దౌసి ప్రాంతానికి చెందిన అసద్ ఖాన్ భార్య ఆదివారం రాత్రి చంద్ దౌసిలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆస్ప‌త్రిలో దోమలు విపరీతంగా ఉండటంతో అసద్ ఖాన్ భార్య తీవ్ర ఇబ్బందికి గురి అయింది. దోమలు పసికందును కుట్టడంతో ఆ చిన్నారి ఏడవడం ప్రారంభించింది.

దోమల బెడదతో భార్య, బిడ్డ పడుతున్న బాధ చూడలేక అసద్ ఖాన్ మస్కిటో కిల్లర్ కోసం బయటికి వెళ్లాడు. అయితే అప్పటికే అర్ధరాత్రి కావడంతో దుకాణాలన్నీ మూసివేసి ఉన్నాయి. చేసేదేమీ లేక అసద్ తిరిగి ఆస్పత్రి వద్దకు వచ్చాడు. తన భార్య, బిడ్డ పడుతున్న ఇబ్బంది గురించి ఓ ట్వీట్ చేశాడు.

'దోమల వల్ల నా భార్య తీవ్ర ఇబ్బంది పడుతోంది. పసికందు ఏడుస్తోంది. వారి బాధ చూడలేకపోతున్నాను. దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపించండి' అని అసద్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ని డయల్ 112 ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేశాడు. అసద్ చేసిన ట్వీట్ ని పోలీసు ఉన్నత అధికారులు చూశారు. వెంటనే స్థానిక పోలీసులను రంగంలోకి దించారు. చంద్ దౌసి పోలీసులు మస్కిటో కిల్లర్ ను తీసుకొని ఆస్పత్రి వద్దకు వెళ్లి అసద్ ఖాన్ కు అందజేశారు.

అర్ధరాత్రి సమయంలో తన పరిస్థితిని అర్థం చేసుకొని సమస్యను పరిష్కరించిన పోలీసులకు అసద్ కృతజ్ఞతలు తెలిపాడు. అర్ధరాత్రి వేళ బాలింత, నవజాత శిశువు పడుతున్న ఇబ్బందిని తెలుసుకుని తక్షణం స్పందించిన యూపీ పోలీసులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

First Published:  23 March 2023 7:40 AM GMT
Next Story