Telugu Global
National

మణిపూర్‌‌లో జరుగుతున్న హింసలో మహిళలే కీలకంగా ఉన్నారెందుకు?

రాష్ట్రంలో నిత్యం ఇలా మహిళలే ముందుండి నడిపిస్తున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి.

మణిపూర్‌‌లో జరుగుతున్న హింసలో మహిళలే కీలకంగా ఉన్నారెందుకు?
X

మణిపూర్‌‌లో జరుగుతున్న హింసలో మహిళలే కీలకంగా ఉన్నారెందుకు?

మణిపూర్ రాష్ట్రంలో జరగుతున్న హింస, అల్లర్లలో మహిళలే ముందుండటం ప్రభుత్వ సంస్థలను ఆశ్చర్యపరుస్తోంది. కూకీ, మైతీ తెగల మధ్య మొదలైన గొడవలు.. చివరకు రాష్ట్రాన్ని తగులబెట్టే పరిస్థితులకు తీసుకొని వెళ్లాయి. ఇరు తెగల్లోని మహిళలే ఎక్కువగా ఈ అల్లర్లలో ముందుండటం అందరినీ ఆలోచింప చేస్తున్నది. ఇటీవల భద్రతా దళాలు ఒక ఆపరేషన్ నిర్వహించి.. మణిపూర్‌కు చెందిన మిలిటెంట్ గ్రూప్ కంగ్లీ యవూల్ కన్నలుప్‌కు చెందిన 12 మందిని బంధించారు.

కాగా, ఆ 12 మందిని విడిచి పెట్టాలంటూ దాదాపు 1200 నుంచి 1500 మహిళల గుంపు ఆర్మీ అధికారులపై ఒత్తిడి తెచ్చింది. అంతకు ముందు కంగ్‌పోప్కీ, యాన్‌గంగ్‌పోప్కీ ప్రాంతాల్లోకి భద్రతా దళాలు రాకుండా కొంత మంది మహిళలు అడ్డుకున్నారు. వారిలో చాలా మంది వద్ద ఆటోమేటిక్ వెపన్స్ ఉన్నాయి. వాటితో ఫైరింగ్ కూడా చేశారు. గత గురువారం మణిపూర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలోకి సీబీఐ అధికారులు రాకుండా చాలా మంది అడ్డుకున్నారు. అంతే కాకుండా కాలేజీ ఆర్మరీ నుంచి ఆయుధాలను ఎత్తుకొని పోయినట్లు కూడా అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో నిత్యం ఇలా మహిళలే ముందుండి నడిపిస్తున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. మణిపూర్ అల్లర్లలో 115 మంది మరణించగా, 40 వేల మంది ఆచూకీ తెలియడం లేదు. కూకీ, మైతీ తెగల మధ్య ఏర్పడిన ఈ వివాదాన్ని పరిష్కరించి, రాష్ట్రంలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని ప్రభుత్వ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ.. నిత్యం ఎక్కడో ఒక దగ్గర హింస చోటు చేసుకుంటూనే ఉన్నది. నిత్యావసర సరుకుల డెలివరీ, వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తూ రోడ్లను బ్లాక్ చేస్తున్నారు.

రాష్ట్రంలో మహిళా గ్రూప్‌లు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కాకుండా.. ఒక వర్గంపై మరొకరు దాడులు చేసుకుంటున్నారు. దీంతో రంగంలోని దిగిన ఆర్మీ.. సదరు గ్రూప్స్ దోచుకున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని రికవరీ చేసే పనిలో పడ్డాయి. ఇక మణిపూర్ అల్లర్లకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్, హోం మంత్రి అమిత్ షా ఇంటి వద్ద నిరసన చేపట్టిన ఇద్దరు కూడా మహిళలే కావడం గమనార్హం.

హింసాకాండకు పాల్పడుతున్నది, హింసకు వ్యతిరేకంగా పోరాడుతున్నది మహిళలే కావడం వెనుక ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. మణిపూర్ సమాజంలో మహిళలే అన్ని విషయాల్లో ముందుంటారు. మణిపూర్ రాజధాని ఇంపాల్‌కు ఎప్పుడైనా వెళ్లి గమనిస్తే.. అక్కడ ఎక్కువగా మహిళలే తారసపడతారు. యువతులు, మధ్య వయస్కులు, వృద్ధులు ఎక్కువగా మహిళలే రోడ్లపై కనిపిస్తారు. అక్కడి ఇమా కైథేల్ (మదర్స్ మార్కెట్)లో మహిళల హవానే ఉంటుంది. ప్రపంచంలో కేవలం మహిళలచే నిర్వహించబడుతున్న అతిపెద్ద మార్కెట్‌గా దీనికి పేరుంది. అక్కడ దాదాపు 3 వేల నుంచి 5 వేల మంది మహిళలు స్టాల్స్ ఏర్పాటు చేసి వివిధ రకాలైన వస్తువులు అమ్ముతుండటం కనిపిస్తుంది. ఇది స్థానికులకే కాకుండా.. పర్యాటకులను కూడా ఆకర్షించే మార్కెట్‌గా నిలిచింది.

మణిపూర్ చరిత్రలో జరిగిన రెండు ఉద్యమాల్లో కూడా మహిళలే కీలకంగా వ్యవహరించారు. 1904, 1907లో జరిగిన వీటిని నూపీ లాన్ అంటే మహిళల యుద్దాలుగా పిలుస్తారు. 1891లో జరిగిన ఆంగ్లో-మణిపూర్ యుద్దం తర్వాత ఆ ప్రాంతం బ్రిటిషర్ల చేతిలోకి వెళ్లింది. అప్పట్లో పశ్చిమ ఇంపాల్‌లో జరిగిన ఉద్యమం తొలి నూపి లాన్‌గా ప్రసిద్ది చెందింది. ఇండియాలో పూర్తిగా మహిళలే నడిపించిన ఉద్యమంగా 1904లో జరిగిన నూపి లాన్ చరిత్రకెక్కింది. పురుషులు ప్రతీ 30 రోజుల తర్వాత 10 రోజుల పాటు ఉచితంగా పని చేయాలని అప్పటి బ్రిటిష్ ఏజెంట్ కల్నల్ హెన్రీ ప్యాట్రిక్ మ్యాక్స్‌వెల్ రూల్ తెచ్చారు. దీనిని నిరసిస్తూ మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు.

1904 సెప్టెంబర్ 3న వేలాది మంది మహిళలు మ్యాక్స్‌వెల్ అధికారిక నివాసం వైపు దూసుకొని వెళ్లారు. వెంటనే ఆ ఉచిత పని దినాలను తీసి వేయాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆ ఉద్యమాన్ని అణచి వేయడంలో విఫలం అయ్యింది. దీంతో కల్నల్ మ్యాక్స్‌వెల్ తెచ్చిన ఆర్డర్‌ను రద్దు చేయక తప్పలేదు. ఇక రెండో నూపి లాన్ 1907లో జరిగింది. మణిపూర్ నుంచి వరిని భారీగా ఎగుమతి చేస్తుండటంతో స్థానికులకు ఆహార కొరత ఏర్పడింది. అంతే కాకుండా మార్వాడీ వ్యాపారుల కారణంగా స్థానిక కుటీర పరిశ్రమలు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో 1907లో ఇంపాల్‌లో వేలాది మంది మహిళలు రాయల్ దర్బార్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. వరి ఎగుమతులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

దర్బార్ ఆఫీస్ వద్ద దాదాపు 4వేల మంది మహిళలు ఆందోళనలో పాల్గొన్నారు. తమ డిమాండ్‌ను నెరవేర్చే వరకు అక్కడి నుంచి కదలబోమని భీష్మించుకొని కూర్చున్నారు. మహిళలను అక్కడి నుంచి చెదరగొట్టడానికి అప్పటి పాలకులు అస్సామ్ రైఫిల్స్ బలగాలను దింపారు. లాఠీ చార్జీలు, గాల్లో కాల్పులు జరిపినా మహిళలు అక్కడి నుంచి కదల్లేదు. మహిళలు కూడా సైనికులపై రాళ్ల దాడి చేశారు. దీంతో చివరకు రాజు దిగి వచ్చి ఒక సందేశాన్ని పంపారు. మణిపూర్ నుంచి వరిని ఎగుమతి చేయబోతమని స్పష్టం చేశారు.

మనోరమ తంగమ్ అనే 32 ఏళ్ల మహిళను అస్సాం రైఫిల్స్ బలగాలు అదుపులోకి తీసుకొని.. సామూహికంగా అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘటన మణిపూర్‌లో ఆగ్రహ జ్వాలలు రగిలించింది. 2004 జూలై 15న 12 మంది మణిపూరీ మహిళలు నగ్నంగా అస్సాం రైఫిల్స్ కేంద్ర కార్యాలయం ముందు నిరసన తెలిపారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

మణిపూర్‌లో హింసాత్మక సంఘటనలు ప్రారంభమైన తర్వాత మే 30న కేంద్ర హోం మంత్రి అమిత్ షా అక్కడ పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన మొదటిగా మైరా పైబీస్‌తో సమావేశం అయ్యారు. మణిపూర్‌లో మైరా పైబీస్ చాలా కీలకంగా వ్యవహరిస్తారు. ఒక రకంగా వాళ్లు కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ లా పనిచేస్తారు. రాష్ట్రంలో వారి అవసరం ఎక్కడ ఉంటే.. అక్కడ మైరా పైబీస్ శాఖ ఏర్పాటు అవుతుంది. మణిపూర్‌లోని మారుమూల గ్రామంలో కూడా మైరా పైబీస్ క్రియాశీలంగా పని చేస్తారు. వీరిలో చాలా మంది గృహిణులే ఉంటారు. కానీ వీరి ప్రభావం సమాజంపై చాలా శక్తివంతంగా పని చేస్తుంది.

మణిపూర్‌లో ఇలా ప్రతీ ఉద్యమంలో, వ్యాపార, వాణిజ్యంలో.. అన్నింటా మహిళలదే కీలక పాత్ర. ఇప్పుడు ఈ అల్లర్ల సమయంలో కూడా ప్రతీ కుటుంబం నుంచి కనీసం ఇద్దరు మహిళలు పాల్గొంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఏ కుటుంబం నుంచి అయినా మహిళలను పంపలేదని తెలిస్తే.. వారిని గ్రామాల్లో బహిష్కరణకు గురి చేస్తున్నట్లు తెలుస్తున్నది. వీరి కోసం ఒక అనధికార వ్యవస్థే పని చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

First Published:  26 Jun 2023 6:53 AM GMT
Next Story