Telugu Global
National

25 వేల టీచర్ ఉద్యోగాలు రద్దు.. కోల్‌కతా హైకోర్టు షాకింగ్‌ తీర్పు..!

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ పిటిషన్లపై విచారణ కోసం కోల్‌కతా హైకోర్టులో ప్రత్యేక డివిజన్ బెంచ్ ఏర్పాటైంది. సుదీర్ఘ విచారణ జరిపిన బెంచ్‌.. తాజాగా ఆ నియామక ప్రక్రియ చెల్లదని తీర్పు వెల్లడించింది.

25 వేల టీచర్ ఉద్యోగాలు రద్దు.. కోల్‌కతా హైకోర్టు షాకింగ్‌ తీర్పు..!
X

కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 2016 నాటి స్టేట్‌ లెవల్ సెలక్షన్‌ టెస్ట్‌- SLST నియామక ప్రక్రియ చెల్లదంటూ సంచలన తీర్పు ఇచ్చింది. ఆ పరీక్షతో జరిపిన నియమకాలను రద్దు చేయాలని ఆదేశించింది. ఈ తీర్పుతో దాదాపు 25 వేల 753 మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. అంతేకాదు ఇప్పటివరకూ పొందిన జీతాన్ని 12 శాతం వడ్డీతో తిరిగి ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడం చర్చకు దారి తీసింది.

ఇంతకీ ఏం జరిగిందంటే..?

ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతులకు ఉపాధ్యాయులతో పాటు గ్రూప్‌-C, గ్రూప్‌-D స్టాఫ్‌ సిబ్బంది నియామకాల కోసం 2016లో మమతా బెనర్జీ సర్కార్‌ స్టేట్‌ లెవల్‌ సెలక్షన్‌ టెస్ట్‌ నిర్వహించింది. 24 వేల 650 భర్తీ కోసం ఈ రిక్రూట్‌మెంట్ చేపట్టగా.. దాదాపు 23 లక్షల మంది హాజరయ్యారు. కానీ ఖాళీలకు వ్యతిరేకంగా 25 వేల 753 మందికి అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చారు. ఐతే నియామక ప్రక్రియలో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ అంశంపై విచారణ చేపట్టాలంటూ పలువురు కోర్టును ఆశ్రయించారు.

దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ పిటిషన్లపై విచారణ కోసం కోల్‌కతా హైకోర్టులో ప్రత్యేక డివిజన్ బెంచ్ ఏర్పాటైంది. సుదీర్ఘ విచారణ జరిపిన బెంచ్‌.. తాజాగా ఆ నియామక ప్రక్రియ చెల్లదని తీర్పు వెల్లడించింది. తక్షణమే కొత్త నియామక ప్రక్రియ ప్రారంభించాలని వెస్ట్‌ బెంగాల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌- WBSSC కు సూచించింది. ఇక నియామక ప్రక్రియ జరిగిన విధానంపై పూర్తి స్థాయిలో విచారణ చేసి మూడు నెలల్లో నివేదిక సమర్పించాలని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తం ప్రక్రియలో ఓ వ్యక్తికి మినహాయింపు నిచ్చింది కోర్టు. సోమ దాస్‌ అనే వ్యక్తి క్యాన్సర్ చికిత్స పొందుతుండడంతో మానవతా దృక్పథంతో ఆయన ఉద్యోగాన్ని కొనసాగించేలా కోర్టు తన ఉత్తర్వుల్లో మినహాయింపునిచ్చింది.

ఇక 2016 నాటి నియామక ప్రక్రియలో ఉద్యోగాలు పొందిన వారందరి జీతాలు.. నాలుగు వారాల్లోగా ఇప్పటివరకూ తీసుకున్న జీతాలను 12 శాతం వడ్డీ కలిపి తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది ఆ డబ్బు వసూలు బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని సూచించింది. ఐతే జీతాలు తిరిగి ఇచ్చేయాలన్న ఆదేశాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బాధితులు ఎవరైనా తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే... కోల్‌కతా కోర్టు ఆదేశాలను కొట్టివేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  22 April 2024 10:51 AM GMT
Next Story