Telugu Global
National

అస‌లు అభ్య‌ర్థుల‌ను గుర్తించిన యూపీఎస్సీ.. - మోసానికి పాల్ప‌డిన వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వెల్ల‌డి

ఈ రెండు ఘటనల్లో ఆయేషా మక్రానీ, హర్యానాకు చెందిన తుషార్ తాము ర్యాంకులు సాధించినట్టు మోసపూరితంగా ప్రకటించారని యూపీఎస్సీ తెలిపింది.

అస‌లు అభ్య‌ర్థుల‌ను గుర్తించిన యూపీఎస్సీ.. - మోసానికి పాల్ప‌డిన వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వెల్ల‌డి
X

సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష ఫ‌లితాల్లో ఒకే ర్యాంకు కోసం ఇద్ద‌రు అడ్మిట్ కార్డులు స‌మ‌ర్పించిన వ్య‌వ‌హారం గంద‌ర‌గోళం సృష్టించిన విష‌యం తెలిసిందే. అయితే.. మ‌రో రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో యూపీఎస్సీ రంగంలోకి దిగి.. ఈ రెండు అంశాల‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టింది. అస‌లు అభ్య‌ర్థుల‌ను గుర్తించింది. మోసానికి పాల్ప‌డిన మిగిలిన ఇద్ద‌రిపై క్రిమిన‌ల్ చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్టు స్ప‌ష్టం చేసింది.

గ‌త మంగ‌ళ‌వారం వెలువ‌రించిన 2022 సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష ఫ‌లితాల్లో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన ఆయేషా ఫాతిమా (23), ఆయేషా మ‌క్రాని (26) 184వ ర్యాంకు త‌మ‌దేనంటూ మీడియా ముందుకు వచ్చారు. అలాగే 44వ ర్యాంకు విష‌యంలోనూ ఇలాంటి ఉదంత‌మే చోటుచేసుకుంది. హ‌ర్యానాకు చెందిన తుషార్‌, బిహార్‌కు చెందిన తుషార్‌కుమార్ ఆ ర్యాంకు త‌మ‌కే వ‌చ్చిందంటూ చెప్పారు. ఈ రెండు ఉదంతాల‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టిన యూపీఎస్సీ.. 184వ ర్యాంకు విష‌యంలో ఫాతిమానే అస‌లు అభ్య‌ర్థి అని గుర్తించింది. అలాగే 44వ ర్యాంకు విష‌యంలో బిహార్‌కు చెందిన తుషార్‌కుమార్ నిజ‌మైన అభ్య‌ర్థి అని తేల్చింది.

గుర్తించింది ఇలా...

184వ ర్యాంకు త‌న‌దేన‌ని మోస‌పూరితంగా ప్ర‌క‌టించిన ఆయేషా మక్రానీ కూడా యూపీఎస్సీ పరీక్ష రాసింద‌ని, అయితే ప్రిలిమ్స్ పేపర్-1లో ఆమెకు 22.22 మార్కులు, పేపర్-2లో 21.09 మార్కులే వచ్చాయ‌ని యూపీఎస్సీ తెలిపింది. ప్రిలిమ్స్ లోనే ఆమె ఉత్తీర్ణత సాధించలేదని, అలాంటప్పుడు మిగతా దశలకు వెళ్లే అవకాశమే లేదని స్ప‌ష్టం చేసింది. ఇక, ఆయేషా ఫాతిమా అన్ని దశల్లో ఉత్తీర్ణత సాధించి 184వ ర్యాంక్ ద‌క్కించుకుంద‌ని తెలిపింది. ఆమే అసలు అభ్యర్థి అని ప్ర‌క‌టించింది.

ఇక హర్యానాకు చెందిన తుషార్ కూడా ప్రిలిమ్స్ రాశాడని, అతనికి పేపర్-1లో మైనస్ 22.89, పేపర్-2లో 44.73 మార్కులు వచ్చాయని, అతను కూడా ప్రిలిమ్స్ లోనే ఫెయిల్ అయ్యాడని వివ‌రించింది. మరోవైపు బీహార్‌కు చెందిన తుషార్ కుమార్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలో పాసై 44వ ర్యాంక్ సాధించాడని తెలిపింది. అతడే అసలైన అభ్యర్థి అని యూపీఎస్సీ వెల్లడించింది.

నిందితుల‌పై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు..

ఈ రెండు ఘటనల్లో ఆయేషా మక్రానీ, హర్యానాకు చెందిన తుషార్ తాము ర్యాంకులు సాధించినట్టు మోసపూరితంగా ప్రకటించారని యూపీఎస్సీ తెలిపింది. వీరిద్దరూ నకిలీ వ్యక్తులేన‌ని ప్ర‌క‌టించింది. తమ స్వార్థ ప్రయోజనాల కోసం తమ పేరుతో యూపీఎస్సీకి ఎంపికైన అసలు అభ్యర్థుల రోల్ నంబర్లు, ఇతర పత్రాలను వీరు ఫోర్జరీ చేశార‌ని పేర్కొంది. సివిల్స్‌కు ఎంపికైన‌ట్టు మోసపూరితంగా చెప్పినందుకు గాను.. ఆయేషా మక్రానీ, హ‌ర్యానాకు చెందిన తుషార్‌ల‌పై క్రిమినల్, క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్టు యూపీఎస్సీ ప్ర‌క‌టించింది. తమ వ్యవస్థ అత్యంత కఠినమైనది, పారదర్శకమైదని, ఎలాంటి పొరపాట్లూ జరిగే ఆస్కారమే లేదని ఈ సంద‌ర్భంగా కమిషన్ పేర్కొంది.

First Published:  27 May 2023 2:13 AM GMT
Next Story