Telugu Global
National

అమిత్ షా మెగా జపం.. అందుకోసమేనా?

చిరంజీవి, చరణ్ క్రేజ్ ను రాజకీయాల కోసం వాడుకునేందుకు కోసమే అమిత్ షా మెగా కుటుంబానికి దగ్గర అవుతున్నారని ప్రచారం జరుగుతోంది.

అమిత్ షా మెగా జపం.. అందుకోసమేనా?
X

కేంద్ర హోం మంత్రి అమిత్ షా మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు. సమయం చిక్కినప్పుడల్లా వారిని పొగిడేందుకు సన్మానించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఏడాది కాలంగా బీజేపీ నేతలు చిరంజీవి, ఆయన తనయుడు చరణ్ ను మచ్చిక చేసుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఏడాది చిరంజీవికి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా గోవాలో జరిగిన వేడుకల్లో కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్ చిరంజీవిని ఘనంగా సన్మానించారు. ఆ స‌మ‌యంలో ప్రధాని మోదీ నుంచి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వరకు పలువురు బీజేపీ మంత్రులు చిరంజీవికి అభినందనలు తెలిపారు.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించిన తర్వాత రామ్ చరణ్ ను అమిత్ షా స్వయంగా కలిశారు. ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాన్ క్లేవ్ కు చరణ్ హాజరుకాగా అమిత్ షా స్వయంగా చరణ్ వద్దకు వచ్చి కలిశారు. ఆ సందర్భంగా చిరంజీవి, చరణ్ తో 15 నిమిషాల పాటు చర్చలు జరిపారు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవార్డు వచ్చినందుకు చరణ్ కు శాలువా కప్పి సన్మానించారు. అయితే దీనిపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఆస్కార్ అవార్డు తెచ్చిన ఆర్ఆర్ఆర్ బృందాన్ని అంతటినీ సన్మానించకుండా ఒక్క చరణ్ ని మాత్రమే అభినందించడం ఏంటని ప్రశ్నలు వచ్చాయి.

ఇదిలా ఉండగా ఇవాళ రామ్ చరణ్ బర్త్ డే. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా చరణ్ కు కాల్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, చిరంజీవి, చరణ్ క్రేజ్ ను రాజకీయాల కోసం వాడుకునేందుకు కోసమే అమిత్ షా మెగా కుటుంబానికి దగ్గర అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని బీజేపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో బీజేపీ అంతో ఇంతో బలంగా ఉన్నప్పటికీ ఏపీలో మాత్రం బీజేపీకి ఎటువంటి బలం లేదు.

మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి, చరణ్ క్రేజ్ ను ఉపయోగించుకోవాలని అమిత్ షా ప్లాన్ వేస్తున్నట్లు టాక్. ఎన్నికల సమయానికి ఏదో ఒక విధంగా చిరంజీవి కుటుంబాన్ని వాడుకోవాలని అమిత్ షా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రాజకీయాలకు తానిక దూరం దూరం అని పదే పదే ప్రకటిస్తున్న చిరంజీవి బీజేపీ వేస్తున్న వలకు చిక్కుతాడో లేదో చూడాలి.

First Published:  27 March 2023 12:28 PM GMT
Next Story