Telugu Global
National

త్రిపురలో మొదలైన పోలింగ్.. బీజేపీకి కష్టకాలమేనా..?

మొత్తం 259 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. వీరిలో కేవలం 20 మంది మాత్రమే మహిళలు. మార్చి 2న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.

త్రిపురలో మొదలైన పోలింగ్.. బీజేపీకి కష్టకాలమేనా..?
X

త్రిపురలో అధికార బీజేపీకి కష్టకాలం మొదలవుతుందనుకుంటున్న వేళ, అక్కడ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 9 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 వరకు కొనసాగుతుంది. ఇండిజినస్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ త్రిపుర (IPFT)తో కలసి బీజేపీ పోటీ చేస్తోంది. మరోవైపు సీపీఎం - కాంగ్రెస్‌ కూటమి బరిలో ఉంది. వీటికి గట్టి పోటీగా తిప్రా మోథా అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. మొత్తం 259 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. వీరిలో కేవలం 20 మంది మాత్రమే మహిళలు. త్రిపురలో 28.13 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోబోతున్నారు.

బీజేపీకి కష్టకాలం..?

మూడు దశాబ్దాలకు పైగా త్రిపురలో సీపీఎం అప్రతిహతంగా పాలన కొనసాగించింది. సీపీఎం ప్రస్థానానికి అడ్డుకట్టవేస్తూ.. 2018లో బీజేపీ అక్కడ విజయం సాధించింది. బిప్లవ్ కుమార్ సారథ్యంలో అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సరిగ్గా ఎన్నికలకు ముందు బిప్లవ్ తో రాజీనామా చేయించి మానిక్ సాహాను సీఎం పోస్ట్ లో కూర్చోబెట్టింది అధిష్టానం. సాహా నేతృత్వంలో ఎన్నికలను ఎదుర్కొంటోంది బీజేపీ. 60 అసెంబ్లీ స్థానాలున్న త్రిపురలో గత ఎన్నికల్లో బీజేపీకి 32సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభావం పెద్దగా లేకపోయినా అక్కడ సీపీఎంతో కలసి హస్తం పార్టీ బీజేపీని దెబ్బకొట్టాలని చూస్తంది. అయితే ఇటీవల కొత్తగా పుట్టుకొచ్చిన తిప్రా మోథా పార్టీ బీజేపీకి షాకివ్వబోతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి బయటికొచ్చిన బిక్రమ్ మాణిక్యదేవ్ వర్మ తిప్రామోథా పార్టీని స్థాపించి తొలిసారి ఎన్నికల బరిలో తన అభ్యర్థులను నిలబెట్టారు. తిప్రామోధా ప్రభావం త్రిపుర ఎన్నికల్లో గట్టిగా కనపడుతుందనే అంచనాలున్నాయి.

రెండోసారి అధికారంకోసం బీజేపీ ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తమ బలం నిరూపించుకోవాలనుకుంటున్నారు కమల నాథులు. మొత్తం 3,337 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్‌ జరుగుతోంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సరిహద్దు ప్రాంతాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మార్చి 2న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుంది.

First Published:  16 Feb 2023 5:57 AM GMT
Next Story