Telugu Global
National

ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు జడ్జి రాజీనామా.. కోర్టు హాల్లోనే ప్రకటన

జస్టిస్ రోహిత్ దియో రాజీనామా ప్రకటించడంతో ఈ రోజు ఆయన ముందుకు వచ్చే కేసులన్నింటినీ నాగ్‌పూర్ బెంచ్ తొలగించి.. వేరే జడ్జికి కేటాయించింది.

ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించిన హైకోర్టు జడ్జి రాజీనామా.. కోర్టు హాల్లోనే ప్రకటన
X

బాంబే హైకోర్టులో జడ్జిగా పని చేస్తున్న జస్టిస్ రోహిత్ దేవ్ (Rohit Deo) సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌లో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ రోహిత్.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు కోర్టు హాల్లోనే ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. నా ఆత్మ గౌరవాన్ని చంపుకొని పని చేయలేకపోతున్నానని, అందుకే రాజీనామా చేస్తున్నానని కోర్టు హాల్లో తెలిపినట్లు అక్కడే ఉన్న ఒక లాయర్ వెల్లడించారు. జస్టిస్ రోహిత్ దేవ్ రాజీనామా ప్రకటించడంతో ఈ రోజు ఆయన ముందుకు వచ్చే కేసులన్నింటినీ నాగ్‌పూర్ బెంచ్ తొలగించి.. వేరే జడ్జికి కేటాయించింది.

'కోర్టు హాల్లో ఉన్న అందరికీ నేను క్షమాపణలు చెబుతున్నాను. నేను చాలా సార్లు మిమ్మల్ని తిట్టాను. మీరు మరింతగా రాటుతేలాలనే అలా చేశాను. అయితే ఎవరైనా నా ప్రవర్తన కారణంగా బాధపడి ఉంటే క్షమించండి. నేను మిమ్మల్ని అందరినీ (లాయర్లు) నా సొంత కుటుంబం లాగానే భావించాను. అయితే నేను నా పదవికి రాజీనామా చేస్తున్నాను. నా ఆత్మగౌరవానికి, మనసాక్షికి విరుద్దంగా పని చేయలేకపోతున్నాను. మీరు కష్టపడి పని చేయండి, న్యాయాన్ని గెలిపించండి' అని జస్టిస్ రోహిత్ దేవ్ చెప్పినట్లు ఆ సమయంలో కోర్టులో ఉన్న లాయర్ మీడియాకు చెప్పారు. కాగా, కోర్టు హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రోహిత్ దియో విలేకరులతో మాట్లాడుతూ.. నా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేశాను. ఇప్పటికే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు తన రాజీనామా పత్రాన్ని పంపించినట్లు తెలియజేశారు.

ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించిన జడ్జి..

మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాకు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. కాగా, గతేడాది అక్టోబర్‌లో బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్‌కు చెందిన ద్విసభ్య ధర్మాసనం సాయిబాబాని నిర్దోషిగా ప్రకటించింది. ఆయనకు విధించిన జీవిత ఖైదును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఆ ధర్మాసనానికి నేతృత్వం వహించింది జస్టిస్ రోహిత్ దేవే కావడం గమనార్హం. ట్రయల్ ప్రొసీడింగ్స్‌లో సాయిబాబాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని.. కేవలం యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేసి.. శిక్ష విధించడం సరి కాదని చెబుతూ.. ఆయనను విడుదల చేయాలని తీర్పు ఇచ్చారు. కాగా, నాగ్‌పూర్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో సాయిబాబా ఇంకా జైల్లోనే మగ్గుతున్నారు.

రోహిత్ దేవ్ 2017 జూన్‌లో బాంబే హైకోర్టు జడ్జిగా నియమించబడ్డారు. అంతకు ముందు ఆయన మహారాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌గా పనిచేశారు. హైకోర్టు జడ్జిగా ఆయనకు 2025 డిసెంబర్ వరకు పదవీకాలం ఉన్నది. కానీ, ఇంతలోనే ఆయన రాజీనామా చేశారు.

First Published:  4 Aug 2023 1:25 PM GMT
Next Story