Telugu Global
National

పంచెలూడేలా ఫైటింగ్.. తమిళనాట డీఎంకేలో కుమ్ములాట

తిరుచ్చిలో అటు ఎంపీవర్గం, ఇటు మంత్రి నెహ్రూ వర్గం.. రెండూ కటకటాల వెనక్కు వెళ్లాయి. పూర్తి మెజార్టీతో డీఎంకే గద్దనెక్కినా.. అక్కడక్కడ నేతల మధ్య ఉన్న ఆధిపత్యపోరు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది.

పంచెలూడేలా ఫైటింగ్.. తమిళనాట డీఎంకేలో కుమ్ములాట
X

తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ కుక్కలు చించిన విస్తరిలా మారిపోయింది. డీఎంకేలో మాత్రం సీఎం స్టాలిన్ మాటకు ఇప్పటి వరకూ ఎదురు లేదు. అయితే ఇప్పుడు డీఎంకేలో కూడా కుమ్ములాటలు చోటు చేసుకుంటున్నాయి. డీఎంకే ఎంపీ, మంత్రి మధ్య మొదలైన ఆధిపత్యపోరు చివరకు వీధిన పడింది. ఎంపీ అనుచరులు, మంత్రు అనుచరులు పంచెలూడేలా కొట్టుకున్నారు. పోలీస్ స్టేషన్లో సైతం వీరంగం వేశారు. దీంతో డీఎంకే అధినేత సీఎం స్టాలిన్ సీరియస్ అయ్యారు.

ఎంపీ వర్సెస్ మంత్రి

తిరుచ్చి వేదికగా గొడవ మొదలైంది. తిరుచ్చిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. స్థానిక మంత్రి నెహ్రూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. దీనికి ఎంపీ తిరుచ్చి శివను ఆహ్వానించలేదు. దీంతో శివ వర్గీయులు గొడవకు దిగారు. శివ ఇంటి సమీపంలో ఓ గ్రౌండ్ ప్రారంభోత్సవానికి మంత్రి రాగా.. ఎంపీ మద్దతుదారులు ఆయనకు నల్లజెండాలు చూపించారు. నిరసన తెలిపారు. నిరసనకారుల్ని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌ కి తరలించారు. నెహ్రూ వర్గం కూడా రెచ్చిపోయింది. శివ ఇంటి ముందు వీరంగం సృష్టించింది. కార్ల అద్దాలు పగలగొట్టారు. ఇంట్లో ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారు. పోలీస్ స్టేషన్ కి వెళ్లి మరీ నెహ్రూ వర్గం నేతల్ను చితగ్గొట్టారు. ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లోనే పంచెలూడేలా కొట్టుకున్నాయి.

తిరుచ్చిలో ఇద్దరు కీలక నేతల మద్దతు దారుల కొట్టుకోవడంతోపాటు, తిరునల్వేలిలో మేయర్, జిల్లా కార్యదర్శి మధ్య గొడవ కూడా చోటు చేసుకుంది. మేయర్ ని దించేయాలని చూస్తున్నారు డీఎంకే జిల్లా కార్యదర్శి. ఈ గొడవ కూడా స్టాలిన్ వరకు చేరింది. దీంతో ఈ గొడవలకు కారణమైనవారిపై అధిష్టానం చర్యలు తీసుకుంది. తిరుచ్చిలో కొంతమంది కార్పొరేటర్లను పార్టీనుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. పోలీస్ స్టేషన్లోకి దూరి దాడి చేసినవారిపై కూడా కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు. దీంతో తిరుచ్చిలో అటు ఎంపీవర్గం, ఇటు మంత్రి వర్గం.. రెండూ కటకటాల వెనక్కు వెళ్లాయి. పూర్తి మెజార్టీతో డీఎంకే గద్దనెక్కినా.. అక్కడక్కడ నేతల మధ్య ఉన్న ఆధిపత్యపోరు ఇప్పుడిప్పుడే బయటపడుతోంది.

First Published:  16 March 2023 3:59 AM GMT
Next Story