Telugu Global
National

స్టాలిన్ ఫార్ములా సక్సెస్.. వలసకార్మికుల రిటర్న్ జర్నీ

చెన్నై చేరుకున్న కార్మికులు.. చైన్నె నుంచి దక్షిణ తమిళనాడు, కొంగు జిల్లాల వైపుగా రైళ్లలో భారీగా తరలివెళ్లారు. వలస కార్మికులు తిరిగి రావడంపై తమిళనాడు ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తోంది.

స్టాలిన్ ఫార్ములా సక్సెస్.. వలసకార్మికుల రిటర్న్ జర్నీ
X

ఉత్తరాదినుంచి తిరిగి వస్తున్న వలస కార్మికులతో తమిళనాడులోని రైల్వే స్టేషన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. కోయంబత్తూరు, తిరుప్పూర్‌, సేలం, తిరుచ్చి, మదురై ప్రాంతాలకు వలస కార్మికులు తిరిగొచ్చేస్తున్నారు. ఉత్తరాదినుంచి తమిళనాడుకు వచ్చే రైళ్లన్నీ రద్దీగా కనపడుతున్నాయి. అపోహలు తొలగిపోవడంతో కార్మికులు ధైర్యంగా తమిళనాడుకి తిరిగొచ్చేస్తున్నారు.

తమిళనాడులో ఉత్తరాది వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ ఇటీవల కొన్ని వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలతో భయపడి చాలామంది ఉత్తరాది కార్మికులు.. ముఖ్యంగా బీహార్, జార్ఖండ్ కి చెందినవారు తమ సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోయారు. హోళీ పండగ సందర్భంగా మరికొంతమంది వెళ్లిపోయారు. దీంతో ఒకరకంగా తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు బోసిపోయాయి. ఎక్కడిపనులక్కడ ఆగిపోయాయి. ఇదంతా తప్పుడు ప్రచారమంటూ సీఎం స్టాలిన్ వివరణ ఇచ్చారు. ఫేక్ వీడియోలపై విస్తృత ప్రచారం చేపట్టారు. స్వయంగా ఆయన వలస కార్మికులు ఉన్న ప్రాంతాలకు వెళ్లి వారికి ధైర్యం చెప్పారు. రైళ్లు, బస్సులు ఎక్కి తిరిగి వెళ్లాలనుకుంటున్న కొంతమందికి స్థానిక అధికారులు నచ్చజెప్పి వెనక్కు రప్పించారు. వెళ్లిపోయినవారు కూడా ఇప్పుడు తిరిగొచ్చేస్తున్నారు.

చెన్నై చేరుకున్న కార్మికులు.. చైన్నె నుంచి దక్షిణ తమిళనాడు, కొంగు జిల్లాల వైపుగా రైళ్లలో భారీగా తరలివెళ్లారు. వలస కార్మికులు తిరిగి రావడంపై తమిళనాడు ప్రభుత్వం హర్షం వ్యక్తం చేస్తోంది. తమిళనాడు అన్ని ప్రాంతాలవారికి ఉపాధిని కల్పించే రాష్ట్రమని, ఇక్కడ ఎవరిపైనా ఎలాంటి దాడులు జరగవని, అలాంటి సంస్కృతి ఇక్కడివారికి లేదంటున్నారు నాయకులు. వలస కార్మికులను కడుపులో దాచుకుని చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు.

First Published:  21 March 2023 1:29 PM GMT
Next Story