Telugu Global
National

మీడియాని నియంత్రించడం కుదరదు.. అదానీకి సుప్రీంలో ఎదురుదెబ్బ

మీడియాని నియంత్రించడం కుదరదు.. అదానీకి సుప్రీంలో ఎదురుదెబ్బ
X

హిండెన్ బర్గ్ కథనం వల్ల తీవ్రంగా నష్టపోయిన అదానీ కంపెనీ, ఆ తర్వాత వికీపిడియాలో తప్పులు సరిచేసుకోడానికి అసత్య కథనాలు రాయించి మరింతగా అభాసుపాలయింది. ఇప్పుడు అదానీ గ్రూప్ కి సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. అదానీ గ్రూప్ కి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేయకుండా మీడియాని నియంత్రించేలా ఉత్తర్వులివ్వాలంటూ ఓ న్యాయవాదితో సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం.. అలాంటి ఆదేశాలివ్వలేమని తేల్చి చెప్పింది.

అదానీ సంస్థలపై కథనాన్ని ప్రచురించిన హిండెన్‌ బర్గ్‌ సంస్థ వ్యవస్థాపకుడు నాథన్‌ ఆండర్సన్, ఆ సంస్థ భారతీయ ప్రతినిధులపై విచారణ జరిపేలా సెబీ, కేంద్ర హోంశాఖకు ఆదేశాలు ఇవ్వాలని ఎంఎల్‌ శర్మ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అదానీ లిస్టెడ్‌ కంపెనీలపై సెబీ ధృవీకరించని వార్తలను ప్రసారం చేయకుండా మీడియాను నియంత్రించేలా గాగ్‌ ఆర్డర్‌ కూడా ఇవ్వాలని ఆయన సుప్రీంకోర్టును కోరారు. ఈ విజ్ఞప్తిని పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్, మీడియాకు వ్యతిరేకంగా ఎలాంటి నిషేధాజ్ఞలు ఇవ్వబోమని స్పష్టం చేశారు.

మొత్తమ్మీద అదానీ వ్యవహారం మరోసారి హైలెట్ అయింది. సుప్రీంకోర్టుని ఆశ్రయించినా కూడా చుక్కెదురైంది. ఇప్పటికీ అదానీ సంస్థ తప్పులు చేసిందని ఎవరూ ఒప్పుకోవడంలేదు. కేవలం మీడియా వల్లే తప్పంతా జరిగిందని అంటున్నారు. అటు కేంద్రం కూడా ఈ విషయాన్ని పూర్తిగా లైట్ తీసుకుంది. పరోక్షంగా అదానీని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ తప్పుమీద తప్పులు చేసుకుంటూ వెళ్తున్న అదానీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కంపెనీ షేర్ల విలువలు కుప్పకూలుతూనే ఉన్నాయి. అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన, అదానీకి రుణాలు ఇచ్చిన కంపెనీల షేర్లు కూడా కుదేలయ్యాయి.

First Published:  25 Feb 2023 4:35 AM GMT
Next Story