Telugu Global
National

దీపావళికి అంతా సైలెన్స్.. ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ పై కూడా నిషేధం

ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటి వరకు టపాకాయలు కాలుస్తున్నారంటూ 2,616 మంది వ్యక్తులపై కేసులు పెట్టింది. అయితే ఈ అరెస్ట్ ల వ్యవహారం సరికాదని చెప్పింది సుప్రీంకోర్టు.

దీపావళికి అంతా సైలెన్స్.. ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ పై కూడా నిషేధం
X

వినాయకచవితి వస్తుందంటే హైదరాబాద్ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలపై కోర్టుల్లో ఎలాంటి చర్చ నడుస్తుందో.. దీపావళి వస్తుందంటే ఢిల్లీలో టపాకాయలపై కూడా అలాంటి న్యాయవివాదాలే కొనసాగుతాయి. అయితే ఈసారి సుప్రీంకోర్టు కాస్త ఘాటుగానే తేల్చి చెప్పింది. ఈసారి గ్రీన్ క్రాకర్స్ కూడా కాల్చడానికి లేదని తీర్పునిచ్చింది.

దీపావళి వచ్చిందంటే ఢిల్లీలో వాయుకాలుష్యం భారీగా పెరిగిపోతుంది. దీపావళికి కాల్చే టపాకాయలతో వాయు, ధ్వనికాలుష్యం పెరుగుతుంది. వాతావరణంలో కలిసే దుమ్ము, ధూళి, ఇతర రసాయనాలతో వారం రోజులపాటు ప్రజలు ఇబ్బంది పడతారు. చిన్నారులు, శ్వాసకోశ సమస్యలున్నవారికి ఈ పరిస్థితి మరింత ప్రమాదకరం. కొన్నేళ్లుగా ప్రభుత్వం టపాకాయలను నిషేధించినా గ్రీన్ క్రాకర్స్ పేరుతో కాలుష్యం కొనసాగుతూనే ఉంది. ఈసారి సుప్రీంకోర్టు గ్రీన్ క్రాకర్స్ కూడా కాల్చకూడదంటూ నిషేధం విధించింది.

అరెస్ట్ లు చేయొద్దు..

దీపావళి రోజుల్లో టపాకాయలు కాల్చినవారిని అరెస్ట్ చేస్తామని గతంలోనే ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటి వరకు టపాకాయలు కాలుస్తున్నారంటూ 2,616 మంది వ్యక్తులపై కేసులు పెట్టింది. అయితే ఈ అరెస్ట్ ల వ్యవహారం సరికాదని చెప్పింది సుప్రీంకోర్టు. ప్రత్యామ్నాయం ఆలోచించాలని ప్రభుత్వానికి సూచించింది. టపాకాయలు కాలుస్తున్న వారిని కాకుండా వాటి తయారీ మూలాల్లోకి వెళ్లి సమస్యను పరిష్కరించాలని సూచించింది. రాజధాని నగరంలో టపాకాయల విక్రయాలకు లైసెన్సులు ఇవ్వొద్దని ఢిల్లీ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది.

First Published:  22 Sep 2023 9:13 AM GMT
Next Story