Telugu Global
National

వసుంధర రాజే ఇంట్లో కీలక సమావేశం నిర్వహించిన మద్దతుదారులు

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 9న తొలి జాబితా విడుదల చేశారు. 41 మందితో కూడిన ఈ జాబితాలో వసుంధర రాజే వర్గానికి చెందిన పలువురు ఆశావహుల పేర్లు మిస్ అయ్యాయి.

వసుంధర రాజే ఇంట్లో కీలక సమావేశం నిర్వహించిన మద్దతుదారులు
X

రాజస్థాన్ బీజేపీలో అసమ్మతి పెరుగుతోంది. ఒకప్పుడు రాజస్థాన్‌లో బీజేపీ అంటే వసుంధర రాజే అనే విధంగా చక్రం తిప్పారు. పార్టీకి ఆమె పెద్ద దిక్కుగా ఉన్నారు. అప్పట్లో బీజేపీ కూడా ఆమెకు అత్యంత ప్రధాన్యత ఇచ్చింది. కానీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వసుంధరా రాజేను పూర్తిగా పక్కన పెట్టారు. గతంలో బీజేపీ ఫ్లెక్సీలపై వసుంధర ఫొటోలే భారీగా కనపడేవి. ఇప్పుడు మాత్రం బీజేపీ జాతీయ నాయకత్వం అలాంటి వాటికి చెక్ పెట్టేసింది. రాజస్థాన్‌లో బీజేపీ అభ్యర్థుల గెలుపుకు పార్టీ గుర్తైన తామర పువ్వు మాత్రమే సహాయం చేస్తుందని పీఎం మోడీ ఇటీవల వ్యాఖ్యానించారు.

రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 9న తొలి జాబితా విడుదల చేశారు. 41 మందితో కూడిన ఈ జాబితాలో వసుంధర రాజే వర్గానికి చెందిన పలువురు ఆశావహుల పేర్లు మిస్ అయ్యాయి. మాజీ మంత్రులు సర్పత్ సింగ్ రిజ్వీ, రాజ్‌పాల్ సింగ్ షెకావత్ వంటి వారికి టికెట్లు దక్కక పోవడంతో వారి అసంతృప్తిని బయటకు వెల్లడించారు. అధిష్టానం కావాలనే రాజే వర్గం నాయకులకు టికెట్లు కేటాయించలేదనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజే వర్గాయులు శనివారం వసుంధర ఇంటిలో సమావేశం నిర్వహించారు. తమ పూర్తి మద్దతు మాజీ సీఎం వసుంధర రాజేకు ఉంటుందని వారు ప్రకటించారు.

వసుంధర రాజే మద్దతుదారుల్లో చాలా మంది ఏళ్లుగా బీజేపీ కోసం పని చేస్తున్నారు. ప్రస్తుతం వారికి టికెట్లు దక్కే అవకాశం లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. వసుంధరకు సన్నిహితులైన అనితా సింగ్, భవానీ సింగ్ రెబెల్ అభ్యర్థులుగా బరిలోకి దిగనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రాజే మద్దతుదారులు టికెట్లు రాకపోతే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఇటీవల బీజేపీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజే పలు సూచనలు చేశారు. గత ఎన్నికల్లో రెబెల్స్‌గా బరిలోకి దిగిన వారికి, ఇటీవలే కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన వారికి టికెట్లు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. అయితే బీజేపీ ప్రస్తుతం ఇవేవీ పట్టించుకోవడం లేదు. జైపూర్ పరిధిలోని విద్యాధర్ నగర్ నుంచి ఎంపీ దియా కుమారికి బీజేపీ టికెట్ ప్రకటించింది. ఒక వేళ రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే దియా కుమారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. 2003లో కూడా వసుంధర రాజేను ఇలాగే సీఎం అభ్యర్థిగా ప్రకటించి బీజేపీ అక్కడ విజయం సాధించింది. వసుంధర రాజేకు ఇప్పుడు ఈ విషయమే ఆగ్రహం తెప్పించినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. తనను కాదని వేరే వారిని సీఎం క్యాండిడెట్‌గా అధిష్టానం ప్రొజెక్ట్ చేస్తుండటం.. తన వర్గీయులకు టికట్లు కేటాయించకపోవడం చూస్తుంటే.. రాజస్థాన్‌లో బీజేపీ రాజేను పక్కన పెట్టినట్లే కనపడుతున్నది.

First Published:  15 Oct 2023 5:43 AM GMT
Next Story