Telugu Global
National

శ్రద్ధా వాకర్ తండ్రి ఆవేదన.. తొలిసారిగా మీడియాతో ఏం మాట్లాడారంటే..?

ఆఫ్తాబ్‌ ఆమెను వేధిస్తున్నాడని తమకి కూడా తెలుసని, అయితే అంతగా వేధించినా ఆమె ఎందుకు తిరిగి ఇంటికి రాలేదో తమకు అర్థం కాలేదని చెప్పారు తండ్రి వికాస్.

శ్రద్ధా వాకర్ తండ్రి ఆవేదన.. తొలిసారిగా మీడియాతో ఏం మాట్లాడారంటే..?
X

శ్రద్ధా వాకర్ చనిపోయిన నెలరోజుల తర్వాత ఆమె హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. అన్ని రోజులపాటు కుమార్తె విషయంలో తండ్రి ఎందుకు ఆందోళన చెందలేదు, అసలేం జరిగింది. శ్రద్ధా వాకర్ ని పేరెంట్స్ నిజంగానే వదిలేశారా, ఆమెను అస్సలు పట్టించుకోలేదా..? శ్రద్ధా మరణం తర్వాత ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలాయి. ప్రియుడు ఆఫ్తాబ్ చేతిలో అతి క్రూరంగా హత్యకు గురైన శ్రద్ధా వాకర్ కుటుంబ సభ్యులు అసలు ఆమెని ఎందుకు దూరంగా పెట్టారనే ప్రశ్నకు తండ్రి వికాస్ తొలిసారిగా స్పందించారు. ఆయన తొలిసారి మీడియా ముందుకొచ్చి తన ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రద్ధాను తామంతా ఒంటరిగా వదిలేశామని చాలా మంది అనుకుంటున్నారని, కాని తాము ఆమె గురించే ఆలోచించేవారమని అన్నారు. ఆఫ్తాబ్‌ ఆమెను వేధిస్తున్నాడని తమకి కూడా తెలుసని, అయితే అంతగా వేధించినా ఆమె ఎందుకు తిరిగి ఇంటికి రాలేదో తమకు అర్థం కాలేదని చెప్పారు. కారణం తెలుసుకోవాలని చాలాసార్లు ప్రయత్నించినా శ్రద్ధా ఎప్పుడూ సమాధానం చెప్పేది కాదన్నారు. శ్రద్ధాతో ఆమె తండ్రి వికాస్ చివరిసారిగా 2021 జూన్ లో మాట్లాడారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో ఆమెకు పూర్తిగా మాటల్లేవు. ఆ తర్వాత ఓసారి ఆఫ్తాబ్ కి ఫోన్ చేసి మాట్లాడితే, తన కుమార్తె ఇంటినుంచి వెళ్లిపోయిందని చెప్పాడని వాపోయాడు వికాస్.

అప్పుడే పోలీసులు స్పందించి ఉంటే..

ఆఫ్తాబ్‌ తనను తీవ్రంగా కొట్టాడని 2020లో శ్రద్ధా ఓసారి వసయి పోలీసులకు ఫిర్యాదు చేసిందని, పోలీసులు అప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు వికాస్. మహారాష్ట్ర పోలీసులు సమయానికి స్పందించి ఉంటే తన కుమార్తె బతికేదని ఆవేదన వ్యక్తం చేశారాయన. ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల దర్యాప్తు సంతృప్తికరంగా ఉందని చెప్పారు.

ఉరి తీయాలి..

తన కుమార్తెను అతి దారుణంగా హత్య చేసిన ఆఫ్తాబ్‌ ని ఉరి తీయాలని అన్నారు వికాస్. తన కుమార్తెకు జరిగినట్లు మరెవరికీ జరగకూడదని అన్నారు. తన కుమార్తె మరణానికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. తన కుమార్తెను ఆఫ్తాబ్‌ ఎంత దారుణంగా హింసించాడో, అంతే ఘోరంగా అతడికి శిక్ష పడాలన్నారు. ఈ కేసుకు సంబంధమున్న అతడి కుటుంబంతో సహా ప్రతి ఒక్కరినీ విచారించాలన్నారు.

ప్రస్తుతం ఆఫ్తాబ్ ఢిల్లీ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఈరోజుతో జ్యుడీషియల్ కస్టడీ ముగియాల్సి ఉండగా.. మరో రెండువారాలపాటు ఢిల్లీ కోర్టు కస్టడీ పొడిగించింది.

First Published:  9 Dec 2022 1:59 PM GMT
Next Story