Telugu Global
National

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం

ఎంఆర్ఐ మెషీన్లు తయారు చేసే జీఈ హెల్త్ కేర్‌, సీమెన్స్‌ హెల్త్ కేర్ సంస్థలు తక్కువ హీలియం ఉపయోగించుకునే మెషీన్లను సిద్ధం చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి. భవిష్యత్తులో అసలు హీలియం అవసరమే లేకుండా ఎంఆర్ఐ యంత్రాలు తయారు కావొచ్చని అంటున్నారు నిపుణులు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం
X

రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చమురు నిల్వల విషయంలో ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. రష్యాకు ఎగుమతులు, దిగుమతుల విషయంలో అనేక ప్రత్యామ్నాయాలు వెలుగులోకి వచ్చాయి. భారత్ నుంచి వైద్య విద్యకోసం ఉక్రెయిన్ సహా ఇతర సరిహద్దు దేశాలకు వెళ్లినవారు, వెళ్లాలని అనుకున్నవారు కూడా ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. అయితే వైద్య రంగంలో కూడా ఈ యుద్ధ ప్రభావం కొత్త మార్పులు తీసుకొచ్చేలా ఉంది. ప్రధానంగా ఎంఆర్ఐ స్కానింగ్ మెషీన్ల రూపురేఖలు మారిపోయేందుకు ఈ యుద్ధం ఓ ప్రధాన కారణం అవుతోంది.

హీలియంతో సమస్య..

వైద్యపరీక్షల్లో కీలకమైన ఎంఆర్‌ఐ స్కానింగ్ మెషీన్లు హీలియం వాయువు లేకపోతే పనిచేయవు. ఎంఆర్‌ఐ స్కానింగ్ మెషీన్లలోని భారీ అయస్కాంతాలను చల్లబరచడానికి హీలియం అత్యవసరం. అయితే రష్యా నుంచి హీలియం ఎగుమతులు ఆగిపోవడంతో ప్రపంచ దేశాలపై ఆ ప్రభావం పడింది. ముఖ్యంగా అమెరికా హీలియం కొరతతో ఇబ్బంది పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా హీలియం నిల్వలు చాలాకాలం క్రితమే అడుగంటినా, రష్యా నుంచి వచ్చే వాయువుతో ఇప్పటి వరకూ పనిజరిగేది. ఇప్పుడది కూడా ఆగిపోవడంతో అసలు హీలియం అవసరం లేకుండా ఎంఆర్ఐ స్కానింగ్ మెషీన్లను తయారు చేసేందుకు ప్రయోగాలు మొదలయ్యాయి.

ఒక ఎంఆర్‌ఐ మెషీన్ సగటు జీవన కాలం 12.8 సంవత్సరాలు. ఆలోగా అది 10 వేల లీటర్ల ద్రవ హీలియంను వినియోగించుకొంటుంది. హీలియం లేకపోతే ఆ మెషీన్లు పనిచేయవు. ఇప్పుడు హీలియం కొరతతో ప్రత్యామ్నాయ మార్గాలు వెదుకుతున్నారు శాస్త్రవేత్తలు. ఎంఆర్ఐ మెషీన్లు తయారు చేసే జీఈ హెల్త్ కేర్‌, సీమెన్స్‌ హెల్త్ కేర్ సంస్థలు తక్కువ హీలియం ఉపయోగించుకునే మెషీన్లను సిద్ధం చేసే ప్రయత్నాల్లో ఉన్నాయి. భవిష్యత్తులో అసలు హీలియం అవసరమే లేకుండా ఎంఆర్ఐ యంత్రాలు తయారు కావొచ్చని అంటున్నారు నిపుణులు.

మొత్తమ్మీద రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచానికి పెద్ద గుణపాఠమే చెప్పింది. యుద్ధం నెలల తరబడి కొనసాగితే దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో పొరుగు దేశాలకు తెలిసొచ్చింది. ఎగుమతులు, దిగుమతుల విషయంలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవనే పాయింట్ అందరికీ అర్థమైంది. రష్యా-ఉక్రెయిన్ సహా యుద్ధ ప్రభావిత ప్రాంతాలపై ఆధారపడిన ప్రతి దేశం కూడా వారి అవసరాలకు ప్రత్యామ్నాయాలను చూసుకుంటోంది. ఒకరకంగా ఇది సానుకూల పరిణామమేనని చెప్పాలి.

First Published:  1 Nov 2022 6:25 AM GMT
Next Story