Telugu Global
National

రిమోట్ ఓటింగ్.. భారత్ లో నిజమయ్యేనా..?

ఓటు హక్కు ఉండి కూడా దాదాపు 30 కోట్ల మంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేదు. తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. వీరందరికీ వేర్వేరు కారణాలున్నాయి. అందులో ప్రధాన కారణం ఉన్న ఊరిలో ఓటు లేకపోవడం.

Remote Voting Machine
X

రిమోట్ ఓటింగ్.. భారత్ లో నిజమయ్యేనా..?

ఉన్నప్రాంతంలోనే ఓటు వేస్తారు. కానీ సొంత ఊళ్లోని పోలింగ్ బూత్ లో వారి ఓటు పడుతుంది. ఇక్కడ ఉంటారు, అక్కడ ఎవరు గెలవాలో డిసైడ్ చేస్తారు. ఇదే రిమోట్ ఓటింగ్. వలస వచ్చిన ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ రిమోట్ ఓటింగ్ అనే కాన్సెప్ట్ ని భారత కేంద్ర ఎన్నికల సంఘం తీసుకురావాలనుకుంటోంది. రిమోట్ ఓటింగ్ మిషన్ పై ఈసీ ఓ కాన్సెప్ట్ నోట్ సిద్దం చేసింది. రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఆర్వీఎం) నమూనా కూడా రూపొందించింది. ప్రస్తుతం ప్రతిపాదన దశలో ఉన్న ఈ వ్యవహారం పట్టాలెక్కుతుందా అనేది మాత్రం అనుమానమే.

రిమోట్ ఓటింగ్ మిషన్ స్పెషాలిటీస్ ఏంటి..?

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లాంటిదే రిమోట్ ఓటింగ్ మిషన్. ఇందులో కూడా బటన్ నొక్కి మన ఓటు వేయొచ్చు. ఈ ఆర్వీఎం ద్వారా 72 నియోజకవర్గాల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. జనవరి 16న ఈ నమూనా మిషన్‌ ప్రదర్శిస్తారు. దీనికోసం అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించింది ఈసీ. అయితే ఆచరణలో ఎదురయ్యే న్యాయపరమైన, సాంకేతిక సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉందని అధికారులు తెలిపారు. దీనికోసం రాజకీయ పార్టీల అభిప్రాయాలు కోరబోతున్నారు.

ఎన్నికల విధుల్లో ఉన్నవారికి పోస్టల్ బ్యాలెట్ ఎలాగో.. ఎన్నికల విధులకు సంబంధం లేకుండా పరాయి ఊరిలో ఉండిపోయిన వారికి రిమోట్ ఓటింగ్ మిషన్ అలాగే ఉపయోగపడుతుంది. ఓటు వృథా కాకుండా, పోలింగ్ కి ఓటర్లు దూరంగా ఉండకుండా ఇది ఉపయోగపడుతుంది.

ఓటర్లలో చైతన్యం రావాల్సిందే..

2019 సార్వత్రిక ఎన్నికల్లో 67.4 శాతం పోలింగ్‌ నమోదైంది. అంటే ఓటు హక్కు ఉండి కూడా దాదాపు 30 కోట్ల మంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేదు. తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. వీరందరికీ వేర్వేరు కారణాలున్నాయి. అందులో ప్రధాన కారణం ఉన్న ఊరిలో ఓటు లేకపోవడం. స్థానికత కోసం చాలామంది వలస వచ్చినా సొంత ఊరిలోనే ఓటు ఉండాలనుకుంటారు.

ఇలాంటి వారు దేశంలో దాదాపు 85శాతం మంది ఉన్నా వారిలో కొందరే ఉన్న చోట ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటారు, మిగిలినవారంతా లైట్ తీసుకుంటారు. ఇలాంటి వారు కూడా పోలింగ బూత్ కి రావాలంటే వారి సొంత ప్రాంతంలో జరిగే ఎన్నికల్లో ఇక్కడినుంచే వారు ఓటు వేయాలి. ఆ సౌకర్యం రిమోట్ ఓటింగ్ మిషన్ తో సాధ్యం. ప్రజాస్వామ్య పండగలో మరింత మంది పాల్గొనేలా ఈ రిమోట్‌ ఓటింగ్‌ గొప్ప నాంది కాబోతోందని ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు.

అయితే న్యాయపరమైన చిక్కుల్ని దాటుకుని ఇది అమలులోకి వస్తుందా అనేది అనుమానమే. రిమోట్ ఓటింగ్ పేరుతో అధికార పార్టీలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే అది మరో సమస్యకి దారి తీస్తుంది. అందుకే దీనిపై సుదీర్ఘ కసరత్తు జరిగే అవకాశముంది. జనవరి 16న నమూనా మిషన్ ప్రదర్శనతో తొలి అడుగు పడబోతోంది.

First Published:  29 Dec 2022 8:22 AM GMT
Next Story