Telugu Global
National

రెడ్ సిగ్నల్ పడిందా.. వాహనం ఆపేయాల్సిందే.. ఢిల్లీలో కొత్త నిబంధన

ఢిల్లీలో కాలుష్యాన్ని నివారించడానికి డస్ట్ సప్రెసెంట్ పౌడర్ ని ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలో కాలుష్యస్థాయి ఏక్యూఐ 300 మార్కును దాటడంతో టపాసులు పేల్చడాన్ని కూడా ప్రభుత్వం నిషేధించింది.

రెడ్ సిగ్నల్ పడిందా.. వాహనం ఆపేయాల్సిందే.. ఢిల్లీలో కొత్త నిబంధన
X

ఢిల్లీలో వాతావరణ కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇక చలికాలం వచ్చిందంటే అక్కడ కాలుష్య తీవ్రత మరింత పెరుగుతుంది. ప్రస్తుతం ఢిల్లీలో చలి తీవ్రత పెరగడంతో కాలుష్య శాతం ప్రమాదకరస్థాయికి చేరింది. దీంతో కాలుష్య నియంత్రణకు కేజ్రీవాల్ సర్కార్ సరికొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది.

గతంలో దేశ రాజధానిలో కాలుష్య తీవ్రత పెరిగినప్పుడు కొద్దిరోజులు బేసి సంఖ్యలతో ముగిసే నెంబర్లు ఉన్న వాహనాలు, మరి కొన్ని రోజులు సరి సంఖ్యలతో ముగిసే నెంబర్లు ఉన్న వాహనాలను అనుమతించేవారు. ఇప్పుడు ఆ విధానం అమల్లో లేదు.

కాలుష్య నియంత్రణ కోసం ఈనెల 26వ తేదీ నుంచి 'రెడ్ లైట్ ఆన్, గాడి ఆఫ్ ' అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. దీని ప్రకారం రోడ్లపై రెడ్ లైట్ పడినప్పుడు వాహనాలను ఆఫ్ చేయాల్సి ఉంటుంది. మళ్లీ గ్రీన్ సిగ్నల్ పడిన తర్వాతే వాహనాలను ఆన్ చేసి ముందుకు కదలాల్సి ఉంటుంది. వాహనాలను ఆపేయడం ద్వారా కొంతసేపైనా వాటి నుంచి వచ్చే పొగను నియంత్రించవచ్చని భావిస్తున్నారు.

అలాగే ఢిల్లీలో కాలుష్యాన్ని నివారించడానికి డస్ట్ సప్రెసెంట్ పౌడర్ ని ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలో కాలుష్యస్థాయి ఏక్యూఐ 300 మార్కును దాటడంతో టపాసులు పేల్చడాన్ని కూడా ప్రభుత్వం నిషేధించింది. గత ఏడాది దీపావళి సమయంలో కూడా బాణాసంచాకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం దసరా వేడుకల్లో కూడా ఎక్కడా టపాసులు పేల్చవద్దని కేజ్రీవాల్ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది.

First Published:  23 Oct 2023 1:28 PM GMT
Next Story