Telugu Global
National

గోడలు కట్టేస్తాం.. రైలు ప్రమాదాలు నివారిస్తాం

ఆస్తుల నష్టంతోపాటు ఆరోపణలు కూడా రావడంతో రైల్వే శాఖ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. రైల్వే ట్రాక్ లపైకి ఎవరూ రాకుండా ఇరువైపులా గోడలు నిర్మించేందుకు నిర్ణయించింది.

గోడలు కట్టేస్తాం.. రైలు ప్రమాదాలు నివారిస్తాం
X

రైలు ప్రమాదాలు ఇటీవల ప్రముఖంగా వార్తల్లో కనిపిస్తున్నాయి. అందులోనూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ రైళ్లు వారానికోచోట ప్రమాదానికి గురికావడం సంచలనంగా మారింది. పట్టాలపైకి అడ్డుగా వస్తున్న మనుషులు, పశువుల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. తప్పెవరిదైనా రైల్వే ఆస్తులకు నష్టం పరిపాటిగా మారింది. ఆస్తుల నష్టంతోపాటు ఆరోపణలు కూడా రావడంతో రైల్వే శాఖ దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టింది. రైల్వే ట్రాక్‌లపైకి ఎవరూ రాకుండా ఇరువైపులా గోడలు నిర్మించేందుకు నిర్ణయించింది.

రైలు పట్టాలపైకి పశువులు రాకుండా నిరోధించేందుకు అడ్డు గోడలు కట్టాలని నిర్ణయించింది రైల్వే శాఖ. రాబోయే ఐదారు నెలల్లో వెయ్యి కిలోమీటర్ల మేర గోడలు కట్టబోతున్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. గోడల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ఒక డిజైన్‌ను ఖరారు చేశామని చెప్పారాయన. అయితే ఇది ఎంతమేరకు సత్ఫలితాలనిస్తుందో తేలాల్సి ఉందన్నారు. దీనికోసం అన్ని సెక్షన్లలో ప్రయోగాత్మకంగా నిర్మాణాలు చేపట్టబోతున్నట్టు తెలిపారు.

ఈ ఏడాది ఇప్పటి వరకూ రైల్వే ట్రాక్‌పై పశువులు అడ్డుగా రావడంతో 4 వేలకు పైగా ప్రమాదాలు జరిగాయి. కొన్ని సందర్భాల్లో రైలింజన్లు దెబ్బతిన్నాయి. ఇక ఆలస్యం సంగతి సరేసరి. అందుకే ఈ ఇబ్బందులు లేకుండా రైల్వే ట్రాక్‌కి ఇరువైపులా గోడలు కట్టబోతున్నారు.

ప్రజల ఇబ్బంది సంగతేంటి..?

రైల్వే లెవల్ క్రాసింగ్ అన్నిచోట్లా ఉండదు. ఊరికి చివరిగా ఉండే రైల్వే ట్రాక్‌లను దాటి గ్రామస్తులు పొలాల్లోకి వెళ్తుంటారు. పశువులను కూడా పొలాల్లోకి తోలుకెళ్లాలంటే ట్రాక్‌లను దాటాల్సిందే. ఇప్పుడు ట్రాక్‌లకు ఇరువైపులా గోడలు కట్టేస్తే.. వారికి ప్రత్యామ్నాయం ఏంటనేది తేలాల్సి ఉంది. గోడల నిర్మాణం సత్ఫలితాలనిస్తుందా లేక విఫల ప్రయోగంగా మిగిలిపోతుందా అనేది ముందు ముందు తేలిపోతుంది.

First Published:  18 Nov 2022 4:04 AM GMT
Next Story