Telugu Global
National

వ్యాపారవేత్తను బెదిరించి కోటి లూటీ చేసిన పోలీసులు

వ్యాపారవేత్తను బెదిరించి కోటి రూపాయలు కొట్టేశారు పంజాబ్​ పోలీసులు. రెండు వేల రూపాయల నోట్లను మార్చుకుని తిరిగి వస్తున్న అతనిని బెదిరించి డబ్బులు తీసుకున్నారు. అయితే వ్యాపారి ఈ ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో విషయం బయటపడింది.

వ్యాపారవేత్తను బెదిరించి కోటి లూటీ చేసిన పోలీసులు
X

సమస్యలు వస్తే మనం పోలీసులకు చెప్పుకుంటాం కానీ, అలాంటి పోలీసులే సమస్యగా మారుతున్న సంఘటనలు అప్పుడప్పుడు వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి సంఘటనే జరిగింది పంజాబ్‌లో ఓ కారులో తనిఖీలు చేసిన పోలీసులు అందులో భారీగా డబ్బులు గుర్తించారు. ఆ వ్యాపారవేత్తను బెదిరించి.. ఆ మొత్తం సొమ్ముతో చెక్కేశారు.

వివరాల్లోకి వెళితే..

బఠిండాకు చెందిన వ్యాపారవేత్త సంజయ్​ గోయల్ ఆగస్టు 4న​ కోటి రూపాయల విలువైన రూ.2వేల కరెన్సీ నోట్లను 500 రూపాయల నోట్లుగా మార్చి ఆ డబ్బుతో మొహాలికి చేరుకున్నాడు. అనంతరం సెక్టార్​-40లో ఓ వ్యక్తిని కలిశాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన సబ్​ ఇన్​స్పెక్టర్ నవీన్​, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు అనుమానం ఉందంటూ సంజయ్​ కారును తనిఖీ చేశారు. అందులో కోటి రూపాయలు గుర్తించి సంజయ్​ను బెదిరించి ఆ డబ్బులు తీసుకొని వెళ్లిపోయారు.

పోలీసులకు భ‌యపడ్డ సంజయ్​.. అక్కడి నుంచి తప్పించుకుని ముందుగా ఇంటికి చేరుకున్నాడు. విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించి తర్వాత చండీగఢ్​​ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్​ను కలిసి ఫిర్యాదు చేశాడు. ఘటనపై విచారణ చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు చండీగఢ్​ ఎస్పీ. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చండీగఢ్​లోని సెక్టార్​-39 పోలీస్​ స్టేషన్​ అదనపు సబ్​ ఇన్​​స్పెక్టర్​ నవీన్ ఫోగట్​ ఇందులో ప్రధాన నిందితుడు. ఇతనితో పాటు సహాయం అందించిన వీరేంద్ర, శివకుమార్ అనే కానిస్టేబుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.75 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు నవీన్​ ఫోగట్​ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. దోపిడీ అంశం బయటకు రాకుండా ఉండేందుకు స్థానిక పోలీసులు ప్రయత్నాలు చేసినప్పటికీ.. విషయం చండీగఢ్ ​ఎస్పీ దాకా వెళ్లడం వల్ల ఘటన మొత్తం వెలుగులోకి వచ్చింది.

First Published:  7 Aug 2023 7:00 AM GMT
Next Story