Telugu Global
National

బీమా సొమ్ము కోసం వ్యాపారి దారుణం.. - స్నేహితుడిని చంపి.. తానే చ‌నిపోయిన‌ట్టు డ్రామా

సుఖీత్‌తో ఫుల్లుగా మ‌ద్యం తాగించాడు. అత‌డు మ‌త్తులోకి జారుకున్నాక ప్రాణాలు తీశాడు. అనంత‌రం త‌న దుస్తులు మృత‌దేహానికి తొడిగి.. మృత‌దేహాన్ని గుర్తుప‌ట్ట‌కుండా ట్ర‌క్కు కింద తొక్కించాడు.

బీమా సొమ్ము కోసం వ్యాపారి దారుణం.. - స్నేహితుడిని చంపి.. తానే చ‌నిపోయిన‌ట్టు డ్రామా
X

ఓ సినిమాలో బీమా సొమ్ము కోసం మృత‌దేహాన్ని తీసుకొచ్చి పాల‌సీదారుదిగా న‌మ్మింప‌జేసి డ‌బ్బు కొట్టేసే ప్ర‌య‌త్నం చేస్తారు.. కానీ, నిజ జీవితంలో పంజాబ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త మాత్రం మృత‌దేహం త‌న‌దని న‌మ్మించ‌డం కోసం ఏకంగా స్నేహితుడినే చంపేశాడు. ఈ దారుణం కోసమే అత‌నితో స్నేహం చేయ‌డం గ‌మ‌నార్హం. ఇందుకు నిందితుడి భార్య కూడా స‌హ‌క‌రించింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

న‌ష్టాన్ని భ‌ర్తీ చేసుకోవాల‌ని...

పంజాబ్‌కు చెందిన గురుప్రీత్ సింగ్ అనే వ్యాపారవేత్తకు వ్యాపారంలో న‌ష్టాలు వ‌చ్చాయి. ఈ న‌ష్టాల నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం కోసం త‌న పేరిట ఉన్న రూ.4 కోట్ల బీమా సొమ్మును పొంద‌డానికి భార్య‌తో క‌లిసి దుర్మార్గ‌మైన ప్ర‌ణాళిక ర‌చించాడు. ఇందులో భాగంగా త‌న స్నేహితుడిని చంపేసి.. తానే చ‌నిపోయిన‌ట్టు న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశాడు.

చంపేందుకే స్నేహం చేశాడు..

ఈ ఉదంతంలో మ‌రో దారుణ‌మేమిటంటే.. సైన్‌పుర్ ప్రాంతానికి చెందిన సుఖీత్ అనే వ్య‌క్తిని కేవ‌లం చంపాల‌నే కుట్ర‌తోనే స్నేహం చేయ‌డం. అత‌నితో క‌లిసి నిత్యం మ‌ద్యం తాగ‌డం మొద‌లుపెట్టిన గురుప్రీత్ సింగ్‌.. ఈనెల 19న అత‌న్ని చంపేందుకు ప్లాన్ చేశాడు. అందులో భాగంగా సుఖీత్‌తో ఫుల్లుగా మ‌ద్యం తాగించాడు. అత‌డు మ‌త్తులోకి జారుకున్నాక ప్రాణాలు తీశాడు. అనంత‌రం త‌న దుస్తులు మృత‌దేహానికి తొడిగి.. మృత‌దేహాన్ని గుర్తుప‌ట్ట‌కుండా ట్ర‌క్కు కింద తొక్కించాడు. గురుప్రీత్ భార్య ఆ మృత‌దేహం త‌న భ‌ర్త‌దే అని నాట‌కమాడింది. గురుప్రీత్ రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు అతని కుటుంబ సభ్యులు ఈ నెల 20న రాజురా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

గుట్టు బ‌య‌ట‌ప‌డిందిలా..

సుఖీత్ జాడ లేక‌పోవ‌డంతో అత‌ని భార్య పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. త‌న భ‌ర్త గురుప్రీత్‌తో క‌లిసి కొన్ని రోజులుగా మ‌ద్యం సేవిస్తున్నాడ‌ని వివ‌రించింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు గురుప్రీత్ కుటుంబ సభ్యులను త‌మ‌దైన శైలిలో విచార‌ణ చేశారు. ఈ నేప‌థ్యంలో గురుప్రీత్ బ‌తికే ఉన్న‌ట్టు తేలింది. ఈ కేసుకు సంబంధించి గురుప్రీత్‌తో పాటు అత‌ని భార్య‌ను, మ‌రో న‌లుగురు నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

First Published:  30 Jun 2023 4:12 AM GMT
Next Story