Telugu Global
National

ప్రొఫెసర్ లైంగిక వేధింపులు.. ప్రధాని, సీఎంకి లేఖ రాసిన 500 మంది విద్యార్థినులు

ఈ విషయాన్ని బయటపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించేవాడని వాపోయారు. కొన్ని నెలలుగా ఆయనిలా ప్రవర్తిస్తున్నాడని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమని, ప్రొఫెసర్ కు రాజకీయ పలుకుబడి ఉండటంతో వీసీ కూడా తమకు సహకరించలేదని తెలిపారు.

ప్రొఫెసర్ లైంగిక వేధింపులు.. ప్రధాని, సీఎంకి లేఖ రాసిన 500 మంది విద్యార్థినులు
X

చౌదరి దేవీలాల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రికి వందలాది మంది విద్యార్థినులు లేఖ రాయడం సంచ‌ల‌నం సృష్టించింది. హర్యానా సిర్సాలోని చౌదరి దేవి లాల్ వ‌ర్సిటీ మ‌హిళా క‌ళాశాల‌కు చెందిన 500 మంది విద్యార్థినులు.. తమను వేధింపులకు గురిచేస్తున్న ప్రొఫెసర్‌‌ను సస్పెండ్ చేయడంతోపాటు హైకోర్టు రిటైర్డ్ జడ్జీతో విచారణ జరిపించాలని లేఖలో డిమాండ్ చేశారు. ఈ లేఖను ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయానికి, ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు రాయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అలాగే ఈ లేఖ కాపీని వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ అజ్మేర్‌సింగ్ మాలిక్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, హోంమంత్రి అనిల్ విజ్, జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మ, ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు, కొన్ని మీడియా సంస్థలకు కూడా పంపారు.



ప్రొఫెసర్ అసభ్యకరమైన, నీచమైన చర్యలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. తన ఆఫీసుకు అమ్మాయిలను పిలిపించి.. బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి ‘ప్రయివేట్ పార్ట్స్ తాకడం, చెప్పుకోలేని చేష్టల’కు పాల్పడి దారుణంగా వ్యవహరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని బయటపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించేవాడని వాపోయారు. కొన్ని నెలలుగా ఆయనిలా ప్రవర్తిస్తున్నాడని, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమని, ప్రొఫెసర్ కు రాజకీయ పలుకుబడి ఉండటంతో వీసీ కూడా తమకు సహకరించలేదని తెలిపారు.


అంతేకాదు రాత, ప్రాక్టికల్ పరీక్షల్లో మెరుగైన మార్కులు పేరుతో వైస్ ఛాన్స్‌లర్ కూడా ఈ ఆరోపణలను అణిచివేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ ఇప్పటికే తన కార్యాలయంలోని సీసీటీవీ ఫుటేజీ నుంచి విద్యార్ధినులతో తన అసభ్యకరమైన చర్యలను తొలగించారు’ అని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో తమ కుటుంబాలకు అపమానం జరుగుతుందనే భయంతో తమ గుర్తింపును బయటపెట్టడంలేదని చెప్పారు. ప్రజాభిప్రాయంతో ప్రొఫెసర్‌ను యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేస్తారని తాము ఆశించడం లేదని, హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని కూడా లేఖలో కోరారు. మరోవైపు ప్రొఫెసర్‌ పై విద్యార్థినులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తమ దర్యాప్తులో తేలినట్టు వర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు.

విద్యార్థినులు రాసిన లేఖలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. సిట్ ఇప్పటికే యూనివర్సిటీని సందర్శించి వాంగ్మూలాలు తీసుకున్నట్టు పేర్కొన్నారు.

First Published:  9 Jan 2024 8:30 AM GMT
Next Story