Telugu Global
National

కేజ్రీవాల్ కేబినెట్ లో ఇద్దరు కొత్త మంత్రులు..

సిసోడియాతోపాటు, ఇప్పుడు సత్యేంద్ర జైన్ కూడా రాజీనామా చేశారు. వీరిద్దరి స్థానంలో కొత్త మంత్రులకు కేజ్రీవాల్ అవకాశమిస్తున్నారు.

కేజ్రీవాల్ కేబినెట్ లో ఇద్దరు కొత్త మంత్రులు..
X

కేజ్రీవాల్ కేబినెట్ లో ఇద్దరు కొత్త మంత్రులు కొలువుదీరబోతున్నారు. ఆతిషి, సౌరభ్ భరద్వాజకు కేజ్రీవాల్ మంత్రి వర్గంలో చోటు కల్పించారు. దీనికి సంబంధించి ఇక లెఫ్ట్ నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమోద ముద్ర ఒక్కటే మిగిలి ఉంది. అది పూర్తయితే మంత్రులుగా వారిద్దరూ ప్రమాణ స్వీకారం చేస్తారు.

సిసోడియా, సత్యేంద్ర జైన్ స్థానంలో..

ఢిల్లీలో మూడోసారి సీఎం అయిన తర్వాత కొన్ని శాఖలు తనవద్దే ఉంచుకుని మరో ఆరుగురికి మంత్రులుగా అవకాశమిచ్చారు కేజ్రీవాల్. రాజేంద్రపాల్ గౌతమ్ గతేడాది రాజీనామా చేయగా ఆయన స్థానంలో రాజ్ కుమార్ ఆనంద్ ని తీసుకున్నారు. ఆ తర్వాత కోల్‌ కతాకు చెందిన ఓ కంపెనీకి అక్రమంగా డబ్బులు బదిలీ చేశారనే ఆరోపణలతో మంత్రి సత్యేంద్ర జైన్ 2022 మే లో అరెస్ట్ అయ్యారు. తాజాగా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా.. మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యారు. సిసోడియాతోపాటు, ఇప్పుడు సత్యేంద్ర జైన్ కూడా రాజీనామా చేశారు. వీరిద్దరి స్థానంలో కొత్త మంత్రులకు కేజ్రీవాల్ అవకాశమిస్తున్నారు.

ఉపముఖ్యమంత్రిగా కూడా వ్యవహరించిన మనీశ్‌ సిసోడియా 18 శాఖల బాధ్యతలను చూసుకునేవారు. సత్యేంద్ర జైన్ ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. జైలులో ఉన్న వీరిద్దరూ మంత్రి పదవుల్లో కొనసాగడంపై విమర్శలు మొదలవుతున్న క్రమంలో వారు రాజీనామా చేశారు. ఈ రాజీనామాలు పరిపాలనా పరమైన నిర్ణయాలే తప్ప నేరాన్ని అంగీకరించినట్లు కానే కాదని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. కొత్త మంత్రులకు అవకాశమిచ్చింది.

First Published:  1 March 2023 12:11 PM GMT
Next Story