Telugu Global
National

అదానీకోసం ప్రధాని, ప్రధానికోసం గవర్నర్లు

‘పదవీ విరమణకు ముందు ఇచ్చే తీర్పుల ప్రభావం, పదవీ విరమణ తర్వాత పొందే ఉద్యోగాలపై ఉంటుంది’ అని 2012లో జైట్లీ అన్న వీడియో క్లిప్‌ను షేర్‌ చేశారు జైరాం రమేష్.

అదానీకోసం ప్రధాని, ప్రధానికోసం గవర్నర్లు
X

అదానీకోసం ప్రధాని, ప్రధానికోసం గవర్నర్లు

ఆంధ్రప్రదేశ్ సహా మొత్తం 13 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నియామకాలన్నీ పూర్తిగా రాజకీయ ప్రయోజనాలతో నిండినవేనంటూ మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. అదానీ కోసం ప్రధాని పనిచేశారని, ఇప్పుడు ప్రధాని కోసం ఈ గవర్నర్లంతా పనిచేస్తారని విమర్శించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అబ్దుల్ నజీర్‌ ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది.


ట్రిపుల్ తలాక్, అయోధ్య రామమందిరం-బాబ్రీ మసీదు వివాదం, పెద్ద నోట్ల రద్దు వంటి కేసులతో సహా పలు కీలక తీర్పులలో అబ్దుల్ నజీర్‌ భాగమయ్యారని పేర్కొంది. ఆ కేసులన్నిట్లో తీర్పులు మోదీకి అనుకూలంగా వచ్చాయనే విషయాన్ని గుర్తు చేసింది. తనకోసం మరింతగా పనిచేసేందుకే మోదీ ఆయన్ను ఏపీకి గవర్నర్ గా పంపించారని పేర్కొంది. ఈ ఏడాది జనవరి 4న నజీర్ సుప్రీంకోర్ట్ న్యాయమూర్తిగా రిటైర్ అయ్యారు. నెల రోజుల వ్యవధిలోనే ఆయనకు గవర్నర్ పదవి వరించడం విశేషమేనంటున్నారు.


గుజరాత్‌కు చెందిన పారిశ్రామికవేత్త అదానీ కోసం ప్రధాని మోదీ పని చేశారని, ఇప్పుడు మోదీ కోసం పని చేసిన వారు గవర్నర్లుగా నియమితులయ్యారంటూ కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్కం ఠాగూర్ ట్వీట్‌ చేశారు. ఇక ప్రజల కోసం ఎవరు పని చేస్తారు? అని ఆయన ప్రశ్నించారు. అబ్దుల్ నజీర్‌ నియామకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కూడా తప్పుబట్టారు. బీజేపీ దివంగత నేత అరుణ్‌ జైట్లీ గతంలో మాట్లాడిన ఒక వీడియోను ఆయన ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేశారు. ‘పదవీ విరమణకు ముందు ఇచ్చే తీర్పుల ప్రభావం, పదవీ విరమణ తర్వాత పొందే ఉద్యోగాలపై ఉంటుంది’ అని 2012లో జైట్లీ అన్న వీడియో క్లిప్‌ను షేర్‌ చేశారు జైరాం రమేష్.


కేవలం సుప్రీంకోర్టు న్యాయమూర్తులే కాదు, ఇతర కీలక శాఖల్లో ఉన్న అధికారులు కూడా పదవీ విరమణ తర్వాత ప్రభుత్వంలో కీలక పోస్ట్ లు దక్కించుకుంటున్నారు. దీనికి కారణం ఒకటే. విధి నిర్వహణలో ఉండగా వారు ప్రభుత్వానికి చేసిన సేవను మెచ్చి పదవీ విరమణ తర్వాత కూడా మరో అవకాశం ఇవ్వడం. రాజ్యాంగబద్ధంగా వారికి పదవులు కట్టబెట్టి వారి సేవలను మరో రకంగా ఉపయోగించుకుంటోంది కేంద్రం. తాజాగా గవర్నర్ల నియామకంతో అదే విషయం స్పష్టమైందని కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది.

First Published:  12 Feb 2023 4:34 PM GMT
Next Story