Telugu Global
National

మరిన్ని చిక్కుల్లో శివసేన నేత... మహిళా సాక్షిని బెదిరించిన కేసు నమోదు

మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పై మరో కేసు నమోదయ్యింది. తనను సంజయ్ రౌత్ బెదిరించారంటూ ఓ మహిళా సాక్షి పోలీసులకు పిర్యాదు చేశారు.

మరిన్ని చిక్కుల్లో శివసేన నేత... మహిళా సాక్షిని బెదిరించిన కేసు నమోదు
X

శివసేన నేత సంజయ్ రౌత్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. భూవివాదం.. మనీలాండరింగ్ కేసులో నిన్నఈడీ సంజయ్ ని అరెస్టు చేసిన వెంటనే ఆయనకు మరో కేసు చుట్టుకుంది. .. లోగడ తనను బెదిరించారని, అసభ్యంగా మాట్లాడారని అంటూ ఓ మహిళా సాక్షి ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె మరెవరో కాదు.. ఒకప్పుడు సంజయ్ కి సన్నిహితుడైన సుజిత్ పాట్కర్ భార్య స్వప్నా పాట్కర్.. ఈమె దాఖలు చేసిన ఫిర్యాదును పురస్కరించుకుని వకోలా పోలీసు స్టేషన్లో ఐపీసీ లోని 504, 506, 509 సెక్షన్ల కింద పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ పెట్టారు. రౌత్ ఈమెను బెదిరిస్తూ, దారుణంగా దుర్భాషలాడుతున్నట్టున్న ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాత్రాచాల్ ల్యాండ్ స్కామ్ కేసులో స్వప్నా పాట్కర్ సాక్షిగా ఉన్నారు. జులై 28 న తనకు, సంజయ్ కి మధ్య జరిగిన సంభాషణలో ఆయన తనను రేప్ చేస్తానని బెదిరించినట్టు కూడా స్వప్న పేర్కొన్నారు. ఈమె మరాఠీ చిత్ర నిర్మాత, సైకాలజిస్ట్ కూడా.. గత ఏడాది కూడా ఆయన తనను వేధించి, టార్చర్ పెట్టాడని ఈమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. 1,034 కోట్ల పాత్రా చాల్ భూ కుంభకోణం కేసులో ఈడీకి తానిచ్చిన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవలసిందిగా ఆయన ఒత్తిడి తెచ్చాడని ఆమె వెల్లడించింది.

ఈ స్కామ్ లో కోట్ల రూపాయల అవకతవకలు జరిగాయని, తాను, సంజయ్ భార్య వర్ష ఒకప్పుడు భాగస్వాములని, అయితే ఈడీ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తను ఈ లావాదేవీలకు దూరమయ్యానని పేర్కొంది. దీన్ని మనీలాండరింగ్ కేసుగా ఈడీ నమోదు చేసిన అనంతరం .. తనకు సంజయ్ రౌత్ నుంచి బెదిరింపులు మరింత పెరిగినట్టు ఆమె తెలిపింది.' గతవారం నాకో లెటర్ అందింది. అందులో ఈడీ అధికారుల ఎదుట ఏ విషయమూ వెల్లడించవద్దని,లేకుంటే నిన్ను రేప్ చేస్తామన్న బెదిరింపులు ఉన్నాయి' అని సప్నా పాట్కర్ పోలీసులకు అందజేసిన ఫిర్యాదులో పేర్కొంది. పైగా బీజేపీ నేత కిరీట్ సోమయ్య ఆదేశాలపైనే ఇదంతా చేస్తున్నట్టు ఈడీకి వివరించాలని కూడా ఇందులో బెదిరించారని ఆమె వెల్లడించింది. ప్రస్తుతం ఈమె తన భర్త సుజిత్ కి దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది.

గత 8 ఏళ్లుగా సంజయ్ రౌత్ తనను మానసికంగా క్షోభకు గురి చేస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని అంటూ స్వప్న పాట్కర్ లోగడ ప్రధాని మోడీకి 40 ట్వీట్లతో కూడిన లేఖను పంపింది. 2009-2014 మధ్య రౌత్ ఆధ్వర్యంలోని 'సామ్నా' పత్రికలో ఈమె ఆర్టికల్స్ రాసేదట. కానీ ఈ భూ స్కామ్ బయటికి పొక్కడంతో మెల్లగా తాను ఆయన కుటుంబానికి దూరమయ్యానని తెలిపింది. ఇప్పుడు ఈడీ అధికారులతో బాటు పోలీసులు కూడా సంజయ్ కి సంబంధించిన మొత్తం వ్యవహారంపై ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు.





First Published:  1 Aug 2022 5:49 AM GMT
Next Story