Telugu Global
National

సంపద పెరిగితే, బరువు పెరుగుతుంది.. బీ అలర్ట్..

వయసుతో పాటు బరువు పెరగడం సహజం. కానీ సంపద పెరిగితే కూడా బరువు పెరుగుతుందని తాజా అధ్యయనం తెలియజేస్తోంది. భారత్ లోని ఊబకాయుల్లో అత్యథిక శాతం మంది సంపన్నులేనని తేలింది.

సంపద పెరిగితే, బరువు పెరుగుతుంది.. బీ అలర్ట్..
X

ఊబకాయులపై సర్వే అంటే వారి వయసు, బరువు, స్త్రీలా, పురుషులా, వారు నివసించే ప్రాంతం.. ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకుంటారు. కానీ ఈసారి వారి ఆర్థిక పరిస్థితి కూడా లెక్కలోకి తీసుకోవడంతో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (2019-21) నివేదికను విశ్లేషిస్తూ కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ (సీఎస్‌డీ) రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకంగా విడుదల చేసిన ఈ నివేదికలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తమిళనాడులో 53.9 శాతం మంది సంపన్నులు ఊబకాయంతో బాధపడుతుంటే పేదవారిలో కేవ‌లం 27.2శాతం మంది మాత్రమే అధిక బరువుతో ఉన్నారు. ఏపీలో కూడా ఇదే పరిస్థితి. తెలంగాణలో సంపన్నుల్లో 49.8శాతం మంది ఊబకాయులు. పేదవారిలో 16.9శాతం మంది మాత్రమే అధిక బరువుతో ఉన్నారు.

దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న 120 జిల్లాల లెక్క తీస్తే.. ఊబకాయులు ఉన్న టాప్-10 జిల్లాల్లో కామారెడ్డి, జోగులాంబ, గద్వాల జిల్లాలు ఉండటం విశేషం. అత్యల్ప ఊబకాయులు ఉన్న జిల్లాల్లో కూడా తెలంగాణదే పైచేయి. కొమ‌రం భీం, ఆసిఫాబాద్, అదిలాబాద్ జిల్లాల్లో ఊబకాయుల శాతం దక్షిణాదిలోనే అత్యల్పం. కేవలం 15శాతం మంది మాత్రమే ఆయా జిల్లాల్లో అధిక బరువుతో ఉన్నారు.

పెరుగుతున్న భారం..

దక్షిణాదిలో ఊబకాయుల సంఖ్య ఏడాదికేడాది పెరిగిపోతుందని ఈ నివేదికలు తెలియజేస్తున్నాయి. తాజా సర్వేలో తమి‌ళ‌నా‌డులో 9.5 శాతం మంది ఊబ‌కా‌యులు పెరి‌గారు. కర్నాట‌కలో 6.9 శాతం, కేర‌ళలో 5.7 శాతం, ఏపీలో 2.9 శాతం మంది కొత్తగా ఊబకాయుల లిస్ట్ లో చేరారు. తెలంగాణలో మాత్రం కేవలం 2 శాతం మాత్రమే పెరుగుదల ఉంది.

మహిళలు.. జాగ్రత్త..

అన్ని రాష్ట్రా‌ల్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే.. పురుషులతో పోల్చి చూస్తే మహిళల్లో ఊబకాయులు ఎక్కువగా ఉండటం. అందులోనూ గ్రామీణ ప్రాంతాలతో పోల్చి చూస్తే, పట్టణాల్లో ఉండే మహిళలే అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో 53శాతం మంది మహిళలు అధిక బరువుతో ఉన్నారు. హైదరాబాద్ లో 51శాతం మంది మహిళలు ఊబకాయంతో బాధపడుతున్నారు.

మొత్తంగా తాజా నివేదిక సారాంశం ఏంటంటే.. సంపన్నుల్లో ఎక్కువశాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. సంపద పెరిగే కొద్దీ శారీరక శ్రమ తగ్గిపోతుంది, పని మనుషులు లేదా యంత్రాలు.. అన్నిటికీ వీటి సాయం అవసరం అవుతోంది. వ్యాపార, వృత్తి అలవాట్లు కూడా శారీరక శ్రమకి దూరం చేస్తున్నాయి. దీంతో పట్టణాల్లో ఎక్కువగా, అందులోనూ సంపన్నుల్లో ఎక్కువమంది ఊబకాయులుగా మారిపోతున్నారు.

First Published:  9 Sep 2022 4:14 AM GMT
Next Story