Telugu Global
National

యడ్యూరప్పకు షాక్.. అవినీతి ఆరోపణలతో కేసు నమోదు

కోట్లాది రూపాయల ముడుపులు తీసుకుని బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ(బీడీఏ) పరిధిలోని హౌసింగ్ ప్రాజెక్టు కాంట్రాక్టును రామలింగం కన్ స్ట్రక్షన్ కంపెనీకి ఇచ్చినట్లు సామాజిక కార్యకర్త టీజే అబ్రహం ఆరోపణలు చేశారు.

యడ్యూరప్పకు షాక్.. అవినీతి ఆరోపణలతో కేసు నమోదు
X

సీఎం పదవి నుంచి దిగిపోయిన తర్వాత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పకు కేసుల బెడద తీవ్రమైంది. పాత కేసులు విచారణకు రావడంతో పాటు కొత్త కేసులు కూడా నమోదు అవుతున్నాయి. తాజాగా ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. యడ్యూరప్ప కుమారుడు, బీజేపీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్రపై కూడా లోకాయుక్త కేసు నమోదు చేసింది. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోట్లాది రూపాయల ముడుపులు తీసుకుని బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ(బీడీఏ) పరిధిలోని హౌసింగ్ ప్రాజెక్టు కాంట్రాక్టును రామలింగం కన్ స్ట్రక్షన్ కంపెనీకి ఇచ్చినట్లు సామాజిక కార్యకర్త టీజే అబ్రహం ఆరోపణలు చేశారు.

దీనిపై ఆయన 2021 జూన్‌లో ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. యడ్యూరప్ప ఆయన కుమారుడు విజయేంద్ర, కుమార్తె పద్మావతి, బంధువు శశిధర్ ను నిందితులుగా పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్ ను ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. దీంతో టీజే అబ్రహం దీనిపై హైకోర్టును ఆశ్రయించారు.

టీజే అబ్రహం వేసిన పిటిషన్ ను పునఃపరిశీలించాలని హైకోర్టు ఆదేశించడంతో ప్రత్యేక కోర్టు మరోసారి విచారణ చేపట్టింది. తాజాగా ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, ఆయన కుటుంబ సభ్యులపై లోకాయుక్త కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ కింద యడ్యూరప్ప కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు అవాస్తవమని మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప వ్యాఖ్యానించారు.

First Published:  19 Sep 2022 8:59 AM GMT
Next Story