Telugu Global
National

మన టెక్నాలజీపై అమెరికా ఆసక్తి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చెన్నైలో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.

మన టెక్నాలజీపై అమెరికా ఆసక్తి
X

మన ఇస్రో సాధించిన అద్భుత విజయం.. చంద్రయాన్‌–3. ఈ విజయంతో భారత్‌ అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర నెలకొల్పింది. అతి తక్కువ వ్యయంతో, అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో ఇస్రో శాస్త్రవేత్తలు సాధించిన ప్రగతి ప్రపంచ దేశాలన్నింటినీ ఆకర్షించింది. ఇదే క్రమంలో చంద్రయాన్‌–3 ప్రయోగించడానికి ముందే దానికి సంబంధించిన అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించిన అమెరికా అంతరిక్ష నిపుణులు.. మన సాంకేతికతను తమతో పంచుకోవాలని అప్పట్లోనే కోరారంట. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ఆదివారం వెల్లడించారు.

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చెన్నైలో ఆదివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ ఈ విషయం తెలియజేశారు. గతంతో పోల్చితే కాలం మారిందని.. ఇప్పుడు భారత్‌ సైతం అత్యుత్తమ పరికరాలు, రాకెట్లను తయారు చేయగలదని సోమనాథ్‌ చెప్పారు.

‘చంద్రయాన్‌–3’ స్పేస్‌ షిప్‌ను రూపొందించిన అనంతరం నాసాకు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ లేబొరేటరీ నిపుణులను ఆహ్వానించామని ఆయన తెలిపారు. వారికి చంద్రయాన్‌ –3 గురించి వివరించామని, దానిని రూపొందించిన విధానం, ఇంజనీర్లు పడిన కష్టం, చంద్రుడిపై ఏవిధంగా ల్యాండ్‌ చేయబోతున్నాం.. వంటి విషయాలు వివరించామని చెప్పారు. మన శాస్త్రీయ పరికరాలను పరిశీలించి.. అవి చాలా తక్కువ ఖర్చుతో, నిర్మాణానికి సులభంగా, అత్యాధునిక సాంకేతికతతో ఉన్నాయని వారు అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. ఈ సాంకేతికతను అమెరికాతో ఎందుకు పంచుకోకూడదు.. అంటూ వారు తమను అడిగారని ఈ సందర్భంగా సోమనాథ్‌ గుర్తుచేసుకున్నారు.

First Published:  16 Oct 2023 1:46 AM GMT
Next Story