Telugu Global
National

2040 నాటికి చంద్రుడిపైకి భారత వ్యోమగామి

రోదసి యాత్రల కోసం నలుగురు వ్యోమగామిలను ఎంపిక చేసినట్టు సోమనాథ్‌ తెలిపారు. వీరంతా భారత వైమానిక దళానికి చెందిన టెస్ట్‌ పైలట్లని ఆయన వివరించారు.

2040 నాటికి చంద్రుడిపైకి భారత వ్యోమగామి
X

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. భవిష్యత్‌ ప్రణాళికల విషయంలో స్పీడు మీదుంది. చంద్రయాన్‌–3 ద్వారా చంద్రుడిపైకి తొలిసారిగా భారతీయుడిని పంపేందుకు రంగం సిద్ధం చేస్తోంది. భారత వ్యోమగామిని తొలిసారిగా 2040 నాటికి చంద్రుడిపై దించుతామని ఆ సంస్థ చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ మంగళవారం వెల్లడించారు.

ఇక రోదసి యాత్రల కోసం నలుగురు వ్యోమగామిలను ఎంపిక చేసినట్టు సోమనాథ్‌ తెలిపారు. వీరంతా భారత వైమానిక దళానికి చెందిన టెస్ట్‌ పైలట్లని ఆయన వివరించారు. రోదసి అన్వేషణలో తదుపరి అంకాన్ని గగన్‌యాన్‌ ప్రాజెక్టు ద్వారా ఇస్రో చేపట్టనుందని ఈ సందర్భంగా తెలిపారు. దీనికింద ఇద్దరు లేదా ముగ్గురు భారత వ్యోమగాములను దిగువ భూకక్ష్యలోకి పంపుతామన్నారు. మూడు రోజుల తర్వాత వారు భూమికి తిరిగొస్తారని చెప్పారు. వీరు ప్రస్తుతం బెంగళూరులోని వ్యోమగామి శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్నారని తెలిపారు.

మరోపక్క భారత అంతరిక్ష కేంద్రాన్ని సాకారం చేయడంపై దృష్టిపెట్టినట్టు సోమనాథ్‌ వెల్లడించారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని సాకారం చేయాలని ప్రధాని మోడీ నిర్దేశించినట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. శుక్రుడి కక్ష్యలోకి ఉపగ్రహాన్ని, అంగారకుడి పైకి ల్యాండర్ను ప్రయోగించాలని సూచించినట్లు వివరించారు.

First Published:  13 Dec 2023 3:15 AM GMT
Next Story